02-01-2026 01:29:27 AM
నట్టె కోటేశ్వరరావు :
రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులకు ఎన్నికల ఖర్చు రూ.4 వేల కోట్లు
అంతంతగానే అభివృద్ధి నిధులు.. అడ్డదారులపైనే ఆశలన్నీ
గ్రామస్వరాజ్యంలో ఈసారీ అవినీతి రాజ్యమే?
* గ్రామ సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు.. సర్పంచ్ కావాలనే కోరిక సహజంగానే అందరికీ ఉంటుంది. ఊరిలో పెత్తనం చెలాయించాలంటే ఆ పదవి అవసరం మరి. అందుకే సర్పంచ్ పదవికి పోటీ ఎక్కువగానే ఉంటుంది. రానురాను ఈ పోటీ మరింత పెరుగుతున్నది కూడా. గ్రామ సర్పంచ్ పదవి ఒక సామాజిక హోదాను ఇస్తున్నది కనుక దానిని ఎలాగైనా చేపట్టేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. అంటే ఉన్న ఆస్తులను అమ్ముకోవడం, స్థాయికి మించి అప్పులు చేయడం వంటివి.
అయితే ఎన్నికలప్పుడు ఖర్చు చేసిందంతా గెలిచిన తర్వాత ఎలాగైనా సంపాదించేందుకు అడ్డదారులు తొక్కాల్సిన పరిస్థితి సర్పంచులకు ఎదురవుతున్నది. దీంతో అక్రమ సంపాదనకు ఆదాయమార్గంగా సర్పంచ్ పదవి మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈసారి గ్రామ సర్పంచ్ పదవికి పోటీ పెరగడంతో ఖర్చు కూడా తడిసి మోపెడైంది.
సూర్యాపేట, జనవరి 1 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా 12,728 పంచాయతీలకు సర్పంచ్, 1,12,242 వార్డు సభ్యు ల పదవులకు ఇటీవల మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. సర్పంచులుగా గెలుపొందేందుకు ఒకటీ అరా మినహా చిన్న గ్రామాలైతే సగటున రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలు, పెద్ద గ్రామాలైతే రూ. 60 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పక్షం రోజుల్లో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా పల్లెల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల్లో పోటీపడినవారు ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
కొన్నిచోట్ల సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు చేయడానికి చేతిలో సమయానికి నగదు లేకపోవడంతో అప్పటికప్పుడు వ్యవసాయ భూమి, ప్లాట్లు, బంగారం వంటి వాటిని అమ్మడం, కుదవబెట్టడం చేసినట్లు తెలుస్తున్నది. మరీ కొన్నిచోట్ల ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో స్థాయికిమించి అప్పుజేసి ఖర్చు పెట్టినట్లు సమా చారం. దీంతో రానున్న రోజుల్లో గ్రామ ప్రథమ పౌరుడి పదవి అవినీతికి పరాకాష్ట కానుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పెరిగిన ఓటు రేటు..
గతంతో పోల్చితే ఈసారి ఓటు రేటు పెరిగిందని చెప్పవచ్చు. తక్కువలో తక్కువ ఓటుకు రూ. 500 కాగా గరిష్టంగా 30 వేల చొప్పున ఇచ్చిన ఘటనలు ఈసారి వెలుగు చూశాయి. వాస్తవికంగా పంచాయతీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధం గా యువత ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తామని నిఖార్సుగా ప్రచారం చేసినప్పటికీ అండగా నిలిచిన వారు సైతం పైసల వైపే మొగ్గు చూపడంతో చివరకు గెలుపుకోసం వారు కూడా ఓటుకు రేటు పెంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది.
పంపకాల్లో పదనిసలు..
ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు నగదు పంపిణీకి పలు పద్ధతులను అనుసరించారు. అయితే అందులోనూ అవకాశం ఉన్నకాడికి ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాలు చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. సూర్యాపేట జిల్లాలోని ఒక మేజర్ గ్రామపంచాయతీలో ఓ చేపల పెంపకందారుడు పోటీలో నిలిచి ప్రత్యేక టోకెన్ తయారు చేయించి తనకు ఓటేసి గెలిపిస్తే టోకెన్ చేయించి సంవత్సరంలో రెండుసార్లు రెండు కేజీల చొప్పున ఫ్రీగా చేపలు పంపిణీ చేస్తానని ప్రచారం చేశాడని గ్రామస్తులే చెప్పుకుంటున్నారు.
అదే జిల్లాలోని మరో ఊర్లో పోటీదారుడు బాతులు కాస్తూ బతికేవారి వద్ద వయసుమీరిన బాతులు పెద్దమొత్తంలో తక్కువ రేటుకు కొని ఇంటింటికి పంచినట్లు పెద్ద చర్చనే జరిగింది. ఇక నిజామాబాద్ జిల్లాలో ఓటర్లకు పంచడానికి దొంగ నోట్లు వినియోగించిన సంఘటన కూడా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకుంది. ఇలా అనేక విధానాలు ఈసారి వెలుగు చూసాయి.
వనరులను బట్టి వడ్డన..
స్థానికంగా సహజ వనరులైన గ్రానైట్, ఇసుక, మొరం, మట్టి వంటి వనరులు ఉన్నచోట, అత్యధిక జనాభా కలిగిన గ్రామాల్లో సైతం సర్పంచు పదవి కోసం పోటీ చేసిన అభ్యర్థులు తర్వాత సంపాదించుకునే అవకాశం ఉండడంతో పెద్దమొత్తంలో ఖర్చు చేశారు. 250 లోపు ఓట్లు ఉన్న చిన్న పంచాయతీలో సైతం రూ. 20 లక్షలు ఖర్చు చేసి విజయం సాధించిన సంఘటనలు కూడా ఉన్నాయి.
తగ్గిన ఏకగ్రీవాలు..
2019లో రాష్ట్రవ్యాప్తంగా 12,571 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 2,134 మంది సర్పం చులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే ఈసారి 12, 728 గ్రామాల సర్పంచులకు ఎన్నికలు నిర్వహించగా కేవలం 1,284 మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. సర్పం చ్ పదవులకి పోటీ పెరిగిందనదానికి ఇది నిదర్శనం.
పనికో రేటు.. ప్రజలకు చేటు..
పోటీలో నిలిచినప్పుడు పెట్టిన పెట్టుబడి రాబట్టాలంటే ఎలాగోలా వాటిని గుంజుకోవాల్సిందే. అందులో భాగంగానే గెలిచిన తర్వాత ప్రజలకు అందించాల్సిన సేవలకు, ధ్రువీకరణ పత్రాల జారీకి కూడా ఓ రేటు నిర్ణయించి దానికి అనుగుణంగా వసూలు చేయాల్సిన పరిస్థితి సర్పంచ్‌ది. గతంలో సర్పంచి పదవి నిర్వహించిన కొందరు ప్రజలకు ప్రభుత్వం నుంచి మంజూరైన సంక్షేమ పథకాల నిధులను పక్కదారి పట్టించి సొంతానికి వాడుతున్న ఆరోపణలు అనేకం ఉన్నాయి. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిధులు కాజేసిన ఘటనలు చూశాం.
అలాగే రేషన్ కార్డులు, రైతుబంధు, రైతు బీమా, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, చివరికి దళిత బంధు సైతం ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు దందుకొన్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఇక డెత్, బర్త్ సర్టిఫికెట్‌ల మంజూరికి కూడా రూ. 500-1000 వరకు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే సర్పంచులకు కూడా పాపం తప్పని పరిస్థితి. అప్పుచేసి పెట్టిన పెట్టుబడి డబ్బులు వడ్డీతో సహా తిరిగి ప్రజల నుండి తీసుకోవాల్సిందే. అందుకే వాటిని సంపాదించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
మారాల్సింది మనమే..
ఎన్నికల సమయంలో ఎవరేమి ఇస్తారని అర్ధరాత్రి పూట తలుపులు తెరిచి ఆశగా చూసి రూ. 500 నోటు, క్వార్టర్ సీసాలు, అరకిలో చికెన్ తీసుకుని భాధ్యతని మరచి ఓటు అమ్ముకునే మనమే మారాల్సింది. ఇచ్చినప్పుడు తీసుకుని, పనుల కోసం వెళితే పైసలు అడుగుతున్నారని గొంతెత్తి సుద్దపూసల్లా మాట్లాడితే ఫలితం శూన్యం. అందుకే ఇప్పటికైనా మారాల్సింది మనమే. 2025 ఎన్నికల్లో జరిగిన అనుభవాలను యాదిలో ఉంచుకుని 2026 ప్రారంభం నుంచే మంచి ఆలోచనలు చేస్తూ అంతా మంచే జరగాలని ప్రతిన పూనుదాం.
ఎన్నికలు వచ్చినప్పుడు పైసలకు అమ్ముడు పోకుండా మంచి మనుషులు, అభివృద్ధి చేసేవారికి ఓటువేసి గెలిపించి తర్వాత పనులు కోసం ప్రశ్నించే గొంతుకలుగా మారాలని ‘విజయక్రాంతి’ కోరుకుంటున్నది. రానున్న ఎన్నికల్లో ఆ మార్పుకు నూతన సంవత్సరం సందర్భంగా శ్రీకారం చుట్టాలని ఆశిస్తున్నది. దాదాపు ౪ వేల కోట్ల ఖర్చుతో గెలిచిన సర్పంచ్‌లు మొత్తంగా కనీసం ౧౦ వేల కోట్లు సంపాదించాలని అనుకుంటారనడంలో సందేహమేమీ లేదు.
జనం వద్ద పైసలు తీసుకోకుండా, అవినీతి దారుల వెంట వెళ్లకుండా.. గ్రామాభివృద్ధి కోసం పనిచేసే సర్పంచ్‌లు కొద్దిమంది ఉంటారు. వారిని మినాహాయిస్తే గ్రామ ప్రజలను పీడించే సర్పంచ్‌లను ప్రజలు ఆగ్రహానికి గురికావడం సహజం. ఈ పరిస్థితి రానున్న ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఊహించుకోవాల్సిందే.
పాపం పాత సర్పంచ్‌లు..
గత ఐదేండ్లు సర్పంచ్‌లుగా ఎన్నికై చేసిన పనులకు బిల్లులు రాక, అప్పటి ఎన్నికల్లో చేసిన ఖర్చులకు తగిన ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయనేది అక్షర సత్యం. దానిని దృష్టిలో పెట్టుకుని ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి మొన్నటివరకు పనిచేసిన సర్పంచులు ముందుకు రాలేదు. రిజర్వేషన్‌లు అనుకూలంగా వచ్చినప్పటికీ గతంలో చేసిన అప్పులే శాపంగా మారడంతో పోటీకి దూరం గా ఉండిపోయారు.
‘ఊరి’కే పనిచేస్తారా?
లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌ల చేతిలో సంచులు ఖాళీగా మారడంతో ‘ఊరి’కే పనిచేస్తారనుకోవడం అవివేకం. తాము పెట్టిన ఖర్చులు రికవరీ చేసుకోవడానికి ‘అడ్డ’ దారులు తొక్కక తప్పదు. సర్పంచ్‌కు ప్రభుత్వం ఇచ్చే నెల వేతనం రూ. 6,500 తిరుగుడు ఖర్చులకు చాలవు. దీనితో గ్రామావృద్ధి కోసం ప్రభుత్వాలు కేటా యించే నిధుల నుంచి మొదలుకొని గ్రామంలో జరిగే భార్యాభర్తలు, బంధువులు, భూమి పంచాయతీల్లో డిపాజిట్లు పెట్టించి నొక్కేయడం మొద లు పెడతారు. సహజ వనరులైన గ్రానై ట్, ఇసుక, మొరం, మట్టి ఇతర అవకాశాలను ‘అందిపుచ్చు’కొని అవకాశం ఉన్నకాడికి ఆరగించేస్తారు.
చెల్లింపులు తప్పవు..
* గ్రామాల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలన్నా సర్పంచ్‌కు ముట్టజెప్పాల్సిందే. లేదంటే అడుగు ముందుకు పడదు.
* నల్లా కనెక్షన్ కావాలంటే చేయి తడపాల్సిందే.
* మన కాలనీలోకి మురుగు కాల్వలు, రోడ్లు కావాలన్న సదరు సర్పంచ్‌కు ఎంతోకొంత సమర్పించాల్సిందే.
* జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాలన్నా సర్పంచ్‌కు అమ్యామ్యా ఇవ్వాల్సిందే.
* భూవివాదాలు, ఇతర వివాదాల పరిష్కారంలో సర్పంచ్ ప్రమేయం తప్పనిసరి.
* డబుల్ బెడ్‌రూం ఇళ్లు లాంటి సంక్షేమ పథకాలు కావాలన్నా సర్పంచ్ చేతిలో పనే.
* గ్రామ పరిధిలోని పరిశ్రమల యజమానులు సర్పంచ్‌ను ప్రసన్నం చేసుకోవాల్సిందే.
* సహజ వనరులైన ఇసుక, మొరం తరలింపులోనూ సర్పంచ్‌ల హస్తం ఉంటుందని ఆరోపణలుంటాయి.