02-01-2026 01:24:09 AM
నీళ్లు-నిజాలు
డీపీఆర్‌ను దాచిన బీఆర్‌ఎస్ సర్కార్
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి) : పాలమూరు-రంగారెడ్డి ప్రాజె క్టుకు పాతరేసిందే బీఆర్‌ఎస్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సాగు నీటి విషయంలో తెలంగాణకు కేసీఆర్, హరీశ్‌రావు చేసిన అన్యాయానికి వారిని ఉరి తీసినా తప్పులేదని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పార్టీ.. మనుగడ కష్టం అవుతున్నదని గుర్తించిన కేసీఆర్ బయటకు వచ్చారని, మళ్లీ జల వివాదం రేపితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని భావించే ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. పంపులు, లిఫ్టులు అనే కాన్సెప్ట్‌తోనే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజె క్టు మార్చారని ఆరోపించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి ఎప్పుడైతే మార్చారో అప్పుడు ఏపీ అవకాశం దొరికిందని తెలిపారు. కేసీఆర్ ప్రాజెక్టు తల వదిలేసి తోక దగ్గారకు వెళ్లారని.. జూరాలను వదిలి శ్రీశైలానికి మార్చారని ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సభలో మాట్లాడాలని.. దీనిమీద విచారణకు ఆర్డర్ ఇవ్వాలని.. ఎవరి ప్రయోజనాల కోసం జూరాల తరలిపోయింది..? ఎవరి ఇంటి కి వేల కోట్లు పోయాయి..? ఈ కమీషన్లు ఎవరికి చేరాయి..? దీని వల్ల తెలంగాణకు జరిగిన నష్టం ఏంటి..? అని ప్రశ్నించారు.
జూరాలను అదే స్థలంలో నిర్మిస్తే చంద్రబాబు, జగన్ రాష్ట్రానికి వచ్చి నీరు తీసుకెళ్లే పరిస్థితి ఉండేదా అని ప్రశ్నించారు. ఇందులో నీటి అన్యాయం జరిగిందని.. నిధుల దోపిడీ జరిగిందని అన్నారు. ఇదే అడుగుదామని కేసీఆర్‌ను రమ్మంటే అసెంబ్లీకి రమ్మంటే జంకుతున్నారని అన్నారు. అందుకే తొండి వాదన, మొండి వాదన బలంగా వినిపిస్తున్నారని అన్నారు.
అంతకుముందు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... ఇటీవల మాజీ సీఎం కేసీఆర్, మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతున్న అంశాలన్నీ సత్య దూరమైనవి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తి చేశామని వ్యాఖ్యలు చేయడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క పైసా ఖర్చు చేయలేదని, తట్టెడు మట్టి తీయలేదని, పూర్తిగా విస్మరించిందని చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని పేర్కొన్నారు.
ప్రాజెక్టు అంచనా రూ. 35 వేల కోట్ల అని జూన్ 2015లో నాటి ప్రభుత్వం జీవో ఇచ్చిందని, వారి హయాంలో రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసిందని, ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేం దుకు రూ. 85 వేల కోట్లు దాటుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో రూ. 85 వేల కోట్ల పనులకు కేవలం రూ. 27 వేల కోట్ల పనులు పూర్తి చేసి 90 శాతం పనులు పూర్తి చేశామని చెప్పడం ఎంత సత్య దూరమైన విషయమో యావత్తు తెలంగాణ ప్రజానీకం గమనించాలన్నారు. ఆనాడు రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసి కూడా ఒక్క ఎకరాకు కూ డా నీళ్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుపై రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.
గురువారం ప్రజాభవన్‌లో సాగునీటి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తప్పులకు పాల్పడిన వారు.. ఉద్దేశ పూర్వకంగా రాష్ట్రానికి న ష్టం కలిగించిన వారు.. నేడు ఆ సమస్యలను పరిష్కరించి.. రైతాంగానికి న్యాయం చేయాలని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శించడమే కాకుండా.. ప్రభుత్వం ఉద్దేశాలను, ఆలోచనలను తప్పుబడుతున్నారని విమర్శించారు. ఒక స్ట్రాటజీ ప్రకారం ముం దుకెళ్తూ.. మన హక్కులను సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
దీనికి కేసీఆర్, హరీశ్‌రావు, వివిధ బీఆర్‌ఎస్ నేత లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని అన్నా రు. కృష్ణా నదిలో నికర జలా లు ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీ ఎంసీల కేటాయించారని, ఉమ్మడి ఏపీ లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీసిన లెక్కలు ఏపీలోని ప్రాజెక్టులకు 512 టీఎంసీ లు, తెలంగాణ ప్రాజెక్టులకు 299 టీఎంసీలు అని లెక్క తీశారని తెలిపారు. 66 శాతం ఏ పీకి, 34 శాతం తెలంగాణకు అన్నట్లుగా లెక్కలేశారు.
763 టీఎంసీల కోసం వాదిస్తున్నాం..
అంతర్జాతీయ జల విధానంలో పరీవాహక ప్రాంతం ఎంత ఉంటుందో అంత వాటాను తెలంగాణ ఇవ్వాలని.. రాష్ట్ర పరీవాహక ప్రాంతం 71 శాతం అని.. దాని ప్రకా రం 555 టీఎంసీల నీరు వస్తుందని బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నట్లు తెలిపారు. 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు కేటాయించాలని కోరుతున్నామన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు కాకుండా అదనంగా నీరు ఉన్నదని లభ్యత ఉన్నదని.. 1,005 టీఎంసీలు పూర్తిస్థాయిలో ఉంటుందని ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. ఒకవేళ కృష్ణా నదిలో 1,005 టీఎంసీల లభ్యత ఉం టే.. 763 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాల ని.. 287 టీఎంసీలు ఏపీకి ఇవ్వాలని రెండో వాదనగా వినిపించినట్లు తెలిపారు.
నోరు తెరిస్తే అబద్ధాలే..
వరుస ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ.. మనుగడ కష్టం అవుతున్నదని గుర్తించిన కేసీఆర్ బయటకు వచ్చారని తెలిపారు. దాంతో మళ్లీ జల వివాదం రేపితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని భావించి నట్లు ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవం త్ ఏపీ సీఎం చంద్రబాబుకు సహకరిస్తున్నారని ప్రజల్లో అపోహ కల్పిస్తేనే తన పార్టీని బతికించుకునేందుకు ఓ అబద్ధాల సంఘా న్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. వా రు నోరు తెరిస్తే అబద్ధమే.. కేసీఆ ర్, హరీశ్‌రావు చెప్పేది ఏదైనా అబద్ధమేనని అన్నారు.
పంపులు, లిఫ్టుల కాన్సెప్ట్‌తోనే..
గోదావరి బేసిన్లో నాడు తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల వరకు నీరు ఇచ్చేందుకు అంచనాలు వేసి 38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీ డిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించారని సీఎం అన్నారు. దాంతో రూ.1,50,000 కోట్లకు అంచనాలు పెంచారని అన్నారు. ఇం దులో ప్రధానంగా పంపులు, లిఫ్టులు అనే కాన్సెప్ట్‌తోనే ముందుకు వెళ్లారని తెలిపారు. ఎన్ని పంపులు, ఎన్ని లిఫ్టులు పెంచితే కేసీఆర్ ఇంట్లో అంత కనకవర్షం కురుస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
ఇదే ఫార్ములాను జూరాల విషయంలో పాటించారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో మం జూరైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించారని ఆరోపించారు. మూడు స్టేజీల్లో ఉన్న పంపులు ఐదు స్టేజీలకు మారిందన్నారు. 22 పంపులు కాస్త 37 పంపులుగా మారిందని తెలిపారు. రూ.32,200 కోట్లతో పూర్తికావాల్సిన జూరాల సోర్స్ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు.. నేడు రూ.84,000 కోట్లు ఖర్చు చేస్తే కూడా పూర్తవుతుందన్న న మ్మకం లేదన్నారు. కేసీఆర్ లెక్కల్లోనే రూ .55వేల కోట్లకు పెరిగిందని తెలిపారు.
తల దగ్గర వదిలేసి తోక దగ్గర..
జూరాల నుంచి శ్రీశైలానికి ఎప్పుడైతే మార్చారో అప్పుడు ఏపీ అవకాశం దొరికిందని తెలిపారు. తల వదిలేసి తోక దగ్గారకు వెళ్లారని.. జూరాలను వదిలి శ్రీశైలానికి మార్చారని ఆరోపించారు. శ్రీశైలం ద్వారా 13.5 టీఎంసీలు ఏపీ ఒక్క రోజుకు తరలిస్తున్నదని.. ఒక నదిని నదినే మలుపుకుని పోయారని అన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తిచేస్తే 2.5 టీఎంసీలు కూడా లేవని అన్నారు. ఇప్పుడు రాష్ట్రం వాడుకున్న లెక్కలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మనం వాడుతున్నది కేవలం 0.25 టీఎంసీలు మాత్రమే అని తెలిపారు.
దొంగ తనం చేద్దామన్నా మన దగ్గర శక్తి లేదని తెలిపారు. కంబైన్డ్ స్టేట్ ప్రాజెక్టు కావడంతో ఏపీ జలవివాదం సృష్టించి కేసు వేశారని.. సోర్సు మారింది.. అంచనా మారింది కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు అని.. ఉమ్మడి ఏపీలో మంజూరైన ప్రాజెక్టు కాదని కేసు వేసినట్లు వెల్ల డించారు. దానిని కట్టడానికి వీల్లేదని.. వెం టనే ఆపాలని కేసులో పేర్కొన్నారు. దాంతో తెలంగాణకు కేంద్రం నోటీసులు ఇచ్చిందని.. శ్రీశైలం బ్యాక్ వాటర్లో పాలమూరు-రంగారెడ్డి ఎలా కడుతున్నారు? అని ప్రశ్నించింద న్నారు.
నాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగుకు కేసీఆర్, చంద్రబాబు హాజరై 512/299 వాడుకుంటామని పంచాయితీ సెటిల్ చేసుకున్నారని కేఆర్‌ఎంబీ అంటున్నదని చెప్పా రు. అప్పుడే 555 టీఎంసీలు తెలంగాణ ఇవ్వాలని వాదన వినిపించాల్సి ఉండేదని.. బేసిన్ లోపలే నీటిని వాడాలని.. అవతలకు తరలించడానికి వీలులేదని వాదన చేయాల్సి ఉండేదని చెప్పారు. కృష్ణా జలాల్లో నేడు ఏపీ పూర్తి ఆధిపత్యం సాధించడానికి కేసీఆర్ 2014 నుంచి 2023 వరకు తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు.
పరువు పోతుందనే..
మైనర్ ఇరిగేషన్ నుంచి 45 టీఎంసీలు, గోదావరి నుంచి మరో 45 టీఎంసీలు మొత్తంగా 90 టీఎంసీలు వాడుకుంటామ ని, తదుపరి మరోసారి కేసీఆర్ వాదన తీసుకొచ్చినట్లు రేవంత్ తెలిపారు. అయితే.. దీనికి సీడబ్ల్యూసీ గత 30 ఏండ్ల లెక్కలు అడిగిందని చెప్పారు. మైనర్ ఇరిగేషన్లో 30 ఏండ్లలో ఏయే చెరువు నుంచి ఎంత నీళ్లు మిగిల్చారో లెక్క చెప్పాలని కోరినట్లు తెలిపారు. అలాగే.. మిగితా 45 టీఎంసీలను మాత్రం ట్రిబ్యునల్ తీర్పుతో ముడిపెట్టినట్లు వెల్లడించారు.
ఈ మేరకు లెక్కలు కోరుతూ సీడబ్ల్యూసీ రాష్ట్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. దీంతో ఏపీ ఈ దొంగ లెక్కల డేటాను తీసుకెళ్లి సీడబ్ల్యూసీ ముందు పెట్టినట్లు చెప్పారు. చెరువులు, కుంటలు పాత వినియోగానికి తగ్గలేదని, మిషన్ కాకతీయలో భాగంగా మరమ్మతులు చేయడంతో గతం లో కంటే నీటి వినియోగం రెండింతలు పెరిగిందని ఏపీ ఫిర్యాదు చేసిందన్నారు. ఈ 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వడానికి వీలులేదని ఏపీ ఆరోపిస్తున్నదని తెలిపారు. తాము వచ్చాక డ్రింకింగ్ వాటర్ కింద పెట్టి మూసుకుంటే పరువు పోతుందని.. 90 టీఎంసీలకు క్లస్టర్ కింద అనుమతి ఇవ్వాలని కోరినట్లు సీఎం తెలిపారు.
చెరువుల లెక్క కట్టాలంటే మరో 30 ఏండ్లు పడుతుందని.. అలా కుదరదని.. ముందుగా సాగునీటి ప్రాజెక్టు నిర్మి ంచుకునేందుకు 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వండని మంత్రి ఉత్తమ్ లేఖ రాసి నట్లు చెప్పారు. మిగితా 45 టీఎంసీలు ట్రిబ్యున ల్ ముందు సాధించుకుంటామని తెలిపినట్లు వెల్లడించారు. 45 టీఎంసీలకు ముందుగా అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అను మ తులు వస్తే నేషనల్ ప్రాజెక్టు కిందకు తీసుకొచ్చి 60 శాతం కేంద్రం ఇస్తే.. 40 శా తం రాష్ట్రం ఖర్చు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్‌కు జలసమాధి తప్పదనే..
దాని ద్వారా పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేసేందుకు కంటిన్యూగా ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు. ఒకవేళ కేంద్రం ఇవ్వకున్నా అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుతో లోన్స్ వస్తాయని తెలిపారు. ఏదో ఒక రకంగా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని నిబద్ధతతో తాము ముందుకెళ్తున్నామని చెప్పారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికితే.. ఈ ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్కు శాశ్వతంగా జలసమాధి, రాజకీయ సమాధి జరుగుతుందని ఈ రోజు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ సభకు వస్తే తారీఖులతో సహా ఆయన సంతకం పెట్టిన ప్రతీ లేఖను, ఒప్పందాలను, పెంచిన అంచనాలను బయటపెడుతామని భయపడి రావ డం లేదన్నారు. అంతేకాకుండా.. ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చేందుకు కేబినెట్ అనుమతి సైతం లేదని.. తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరంకు తరలింపులోనూ కేబినెట్ పర్మిషన్ లేదని సీఎం చెప్పారు. ప్రాజెక్టు పేరు మారింది.. ఊరు మారింది.. అంచనాలు మారిందని ఆరోపించారు. జూరాలను తరలించడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయన్నారు.
సభలో ఎండగడుదాం..
తాను ఎప్పుడైతే అధికారులతో ఇంటర్నల్ మీటింగ్ ఏర్పాటు చేశానో అప్పటి నుంచి హరీశ్రావు తన డైరెక్షన్ మార్చుకున్నారని సీఎం రేవంత్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి మీద పూర్తిస్థాయిలో విచారణ చేపడుదామని అధికారులకు డైరెక్షన్ ఇచ్చినట్లు తెలిపారు. దాంతో హరీశ్రావు దీనిని వదిలేసి బనకచర్ల, నల్లమలసాగర్ మీద మాట్లాడుతున్నారని అన్నారు. నాలుగు రోజుల క్రితం తాను అధికారులతో మాట్లాడి విచారణకు ఆదేశిద్దామని చెప్పినట్లు తెలిపారు. ఇది ఎప్పుడైతే తాను చెప్పానో.. అప్పుడే హరీశ్రావు పసిగట్టారని అన్నారు.
దాంతో ఇప్పుడు కృష్ణా నది మీద చర్చ వదిలేశారని.. బకనచర్లకు అనుమతి ఇస్తూ చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఇప్పుడు అంటున్నారని అన్నారు. రాష్ట్ర నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్ద ఎవరైనా రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించారు. ఆయన అలానే చేసి అనుభవించి ఇంటికి చేరుకున్నారని అన్నారు. ఇప్పుడు మన మీద దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మహాభారతంలో ఉన్నట్లు ఇందులో ఎన్నో ఘట్టాలు ఉన్నాయని.. ప్రజాప్రతినిధులంతా అర్థం చేసుకోవాలన్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి కంటే వీళ్లే దుర్మార్గులు..
గతంలో కిరణ్‌కుమారెడ్డి తయారు చేసిన పేపర్ మీద కేసీఆర్, హరీశ్ సంతకం పెట్టి వచ్చారని.. ఆయన కంటే వీళ్లు ఎక్కువ దుర్మార్గులని రేవంత్ అన్నారు. ‘నేను సూటిగా కేసీఆర్‌కు ఆహ్వానం పలుకుతున్న. శాసనసభలో చర్చ చేద్దాం. నేను ఓపెన్ మైండ్‌తో ఉన్న. మా నిర్ణయాల్లో ఏమైనా లోపాలు ఉన్నా.. మాకు సూచనలు చేయం డి. మాజీ సీఎంగా మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి. సభలో చర్చించేందుకు నామోషీగా ఉంటే.. మీరు ఏం సూచిస్తారో ఓ లేఖ రాయండి. ఏదైనా ఒక కార్యాచరణ చెప్పం డి. ఎలా ముందుకెళ్దాం’ అని కోరారు.
299 టీఎంసీలకు సంతకం పెట్టిందే కేసీఆర్..
రాష్ట్రం ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాల్లో కేసీఆర్, హరీష్‌రావు పాల్గొన్నారని.. 34/66 శాతంగా తాము పంచుకుంటామని ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. మొదట ఒక ఏడాది అని ఒప్పందం చేసుకున్నారని.. ఆ తరువాత రెండో సంవత్సరం పోయి మూడో ఏడాది కూడా పొడిగించుకున్నారని తెలిపారు. ఇక 2020లో కేసీఆర్ ఓపిక లేక.. మల్ల మల్ల వచ్చేదే లేదని.. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకూ.. నీటి కేటాయింపులు జరిపే వరకూ ఒకటేసారి పంచుకుంటామని సంతకం చేసి వచ్చారన్నారు.
512/299 కిందనే వాడుకుంటామని.. ఊకే తమను పిలవద్దని చెప్పి వచ్చారని తెలిపారు. శాశ్వతంగా తెలంగాణకు 34 శాతం కోసం సంతకం చేసి వచ్చి ఏపీకి పర్మినెంటుగా హక్కు ఇచ్చారని ఆరోపించారు. కృష్ణా నీటి పంపకాల కోసం బ్రిజేష్ ట్రిబ్యునల్ 2004లో వేశారని.. ఇప్పటికి 21 ఏళ్లు అయిందని అన్నారు. అయినా.. ఆ నీటి మీద జడ్జిమెంట్ రాలేదని.. ఇంకా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదని అన్నారు. అలాంటిది ఆ జడ్జిమెంట్ వచ్చే వరకూ 299 టీఎంసీలు వాడుకుంటామని చెప్పి వచ్చారని వివరించారు.
దోపిడీ బయటకు వస్తుందని డీపీఆర్ తయారు చేయలేదు..
పాలమూరు- -రంగారెడ్డిని శ్రీశైలంకు తరలిచడం వల్లే నేడు ఈ ప్రాజెక్టుపై పంచా యితీ వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. 2022 వరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ కూడా తయారుచేయలేదని అన్నా రు. డీపీఆర్ తయారు చేస్తే అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుందని.. దాని వల్ల అంచనా లను పెంచుకునే వీలు ఉండదని ఇలా చేశారని ఆరోపించారు. రూ.20 వేల కోట్లు కాం ట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే వరకూ డీపీఆర్ రెడీ కాలేదన్నారు. 2019లో పబ్లిక్ హియరింగ్కు పిలిచి చేయలేదని.. 2020లో మళ్లీ పిలిచి చేయలేదని అన్నారు.
ఈ లోపల ఓ ప్రబుద్ధుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారని.. పాలమూరు-రంగారెడ్డికి ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవని అందులో తెలిపినట్లు చెప్పారు. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి వీలు లేదని వీడియోలతో సహా కేసులు వేశారని తెలిపారు. దాంతో ఎన్జీటీ వెంటనే పాలమూరు--రంగారెడ్డిని వెంటనే షట్ డౌన్ చేయాలని ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. దాంతో వెంటనే కేసీఆర్ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లారని చెప్పారు.
ఇది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అని.. 7.15 టీఎంసీల తాగునీటి కోసం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని అఫిడవిట్ వేశారని తెలిపారు. తాగునీటి కోసం అయితే పనులు చేసుకోవచ్చని 2023లో సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. ఇందులోనూ ఒక లాజిక్ ఉన్నదని.. పంపులు, లిఫ్టులకు కాంట్రాక్టర్లకు పే మెంట్ ఇచ్చేందుకు తాగునీటి ప్రాజెక్టు కింద చూపించి వారికి పూర్తిస్థాయిలో పేమెంట్లు ఇచ్చారని ఆరోపించారు. కమీషన్ల కోసం వారికి రూ.27వేల కోట్లు బిల్లులు మాత్రం ఆపలేదని ఆరోపించారు.
మరణశాసనం రాసిందే.. బీఆర్‌ఎస్ : మంత్రి ఉత్తమ్
నదీ జలాల అంశంపై బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితం
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి) : నదీ జలాశయాలలో తెలంగా ణకు మరణశాసనం రాసిందే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో నాటి సీఎం వై.ఎస్ జగన్‌మోహ న్‌రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలయ్ -బలయ్ చేసుకుని తెలం గాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలను ఆం ధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసమే పాలమూరు-- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి సామర్థ్యాన్ని ఒక్క టీఎంసీకి కుదించారని మండిపడ్డారు. బుధవారం సాయంత్రం ప్రజాభవన్‌లో జరిగిన పవర్ పాయింట్ ప్రజెం టేషన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఆధారలతో సహా వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... కృష్ణా జలాశయాల్లో 763 టీఎంసీల నీటిని తెలంగా ణకు కేటాయించాల్సిందేనని పేర్కొన్నారు. కృష్ణాజలాల వివాదాల ట్రిబ్యునల్‌లో స్వయంగా తాను పాల్గొని రాష్ట్రం తరఫున గట్టి వా దనలు వినిపిస్తున్నామని, అంతిమంగా విజయం తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జూరాల వద్ద నీటి లభ్యత ఉన్నప్పుడు శ్రీశైలంకు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నిలదీశారు. నదీ జలాల అంశంపై బీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అర్థర హితమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టి పారేశారు.