calender_icon.png 1 January, 2026 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మక్క సారలమ్మ మహాజాతర దృష్ట్యా కీలక ముందడుగు

01-01-2026 12:18:44 AM

మేడారం పరిధిలోని నార్లాపూర్‌లో పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి సీతక్క

ములుగు, తాడ్వాయి, డిసెంబర్31 (విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం పరిధిలో నూతనంగా నిర్మించిన నార్లపూర్ పోలీస్ స్టేషన్ను బుదవారం రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకనలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం మేడారం మహాజాతర దృష్ట్యా ఎల్లప్పుడూ ప్రజలకు భక్తులకు గుత్తికొయా గిరిజన ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

జాతర సమయంలో లక్షలాది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వేగవంతమైన పోలీస్ సేవల అందించడంలో ఈ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ జిల్లాలో పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నూతన స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు, ఇది ప్రజలకు మరింత చేరువైన, సమర్థవంతమైన సేవలకు నాంది పలుకుతుందని అన్నారు.

పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ అధికారి ఎస్‌ఐ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయిలలో సుమారుగా 30మంది పనిచేయనున్నారని, నార్లాపూర్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారిగా ఎస్‌ఐఏ. కమలాకర్ విధులు నిర్వహించనున్నారని, పస్రా పరిధిలో ఈ స్టేషన్ పనిచేస్తుందని పస్రా సర్కిల్ ఇన్స్పెక్టర్గా దయాకర్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క,కలెక్టర్, ఎస్‌పిలతో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఉపాధ్యాయుల సేవకు పరమార్థం ఎస్టీయూ

తెలంగాణ రాష్ట్రంలో వివిధ యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నిస్వార్థంగా సేవ చేస్తూ, అన్ని ఉపాధ్యాయ సంఘాలకు మాతృ సంఘంగా నిలుస్తూ, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్న ఏకైక ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ మాత్రమేనని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి డా. అనసూయ సీతక్క అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్టీయూ రాష్ట్ర సంఘం రూపొందించిన డైరీ మరియు క్యాలెండర్లను ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. తెలంగాణ రాష్ట్రంలో గత 79 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సమస్యల పరి ష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, ప్రభుత్వం తో సమన్వయం చేసుకుంటూ నిస్వార్థంగా సేవలందిస్తున్న సంఘం ఎస్టీయూ అని తెలిపారు. మిగతా ఉపాధ్యాయ సంఘాలకు మాతృసంఘంగా ఎస్టీయూ నిలిచిందన్నారు. ములుగు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలపై తలలో నాలుకలా స్పందిస్తూ పనిచేస్తున్న సంఘం ఎస్టీయూ అని ప్రశంసించారు. ప్రతి ఏడాదిలాగే అన్ని సంఘాల కంటే ముందుగా డైరీ, క్యాలెండర్లను రూపొందించి ఆవిష్కరించిన ఎస్టీయూ నాయకత్వాన్ని ఆమె అభినందించారు.

ఉపాధ్యాయుల సమస్యలను ముఖ్య మంత్రి గారితో చర్చించి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ ములుగు జిల్లా అధ్యక్షుడు శిరుప సతీష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంచర్ల టవి వీరభద్రం, ఆర్థిక కార్యదర్శి పోరిక శంకర్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్, రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ సోలం కృష్ణయ్య, ములుగు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ హమీద్, డేగల శంకర్, తాడ్వాయి మండల అధ్యక్ష, కార్యదర్శులు కందిక రాజు, రస్పుత్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాం

ఎస్టీయూ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ములుగు జిల్లా ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల కామన్ జాయినింగ్ తేదీ అంశంపై మంత్రికి వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మంత్రి డా. దాసరి అనసూయ సీతక్క ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో చర్చించి, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులందరికీ ఒకే తేదీ జాయినింగ్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల మంజూరు, 010 పద్దు కింద వేతనాల చెల్లింపు అంశాలపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎస్టీయూ ములుగు జిల్లా అధ్యక్షుడు శిరుప సతీష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంచర్ల టవి వీరభద్రం, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్ తెలిపారు.

ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.

 ములుగు జిల్లా సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద నిర్మించనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేదతీరే అవకాశం ఉందని,తల్లికి తలవంచందే భక్తులు ముందు కదలరని మంత్రి సీతక్క అన్నారు. బుదవారం ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను, ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్ వాహనాల పార్కింగ్ స్థలాలను రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్,డిఎఫ్‌ఓ రాహూల్ కిషన్ జాదవ్ లతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు,పర్యాటకులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరమే ముందు సాగుతారని, జాతీయ రహదారి ఆనుకొని ఉన్న గట్టమ్మ తల్లి ఆలయం వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని,నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పార్కింగ్ నుంచి ఆలయ మార్గం వరకు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల సాఫీగా రాకపోకలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పార్కింగ్ ప్రాంతంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్పష్టమైన రేడియం స్టిక్కర్లు,దిశానిర్దేశక సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయంలో కూడా స్పష్టంగా కనిపించేలా సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు.