01-01-2026 12:18:29 AM
హుజూర్ నగర్, డిసెంబర్ 31: విద్యార్థులు శాస్త్రీయ ఆలోచన విధానం పెంచుకోవాలని అలాగే విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. బుధవారం పట్టణంలోని వి వి ఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన 53వ జిల్లా స్థాయి విద్యా,బాల వైజ్ఞానిక ప్రదర్శన-2025 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు...
చిన్న వయస్సులోనే విద్యార్థులు సుస్థిర వ్యవసాయం,వ్యర్ధాల నిర్వహణ,ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం, గ్రీన్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీ, వినోదాత్మక గణిత నమూనా నిర్మాణం, ఆరోగ్యం పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణలలో సమస్యలు గుర్తించి నూతన ఆలోచనలతో వినూత్న పద్దతిలో సమస్యలను పరిష్కరించటం అభినందనీయమన్నారు.గ్రామీణ ప్రాంతానికి చెందిన చిన్నారులు ఇప్పుడే మదర్ బోర్డ్,సెన్సార్, కోతుల బేడద కొరకు పరికరాలు లను ఉపయోగించి సమస్యల పరిష్కరిస్తున్నారంటే రాబోయే 10 ఏళ్ల తర్వాత వారి నూతన ఆలోచనలతో రోబోటిక్స్‌ను తయారుచేసే విధంగా ఉపాధ్యాయు లు వారికి సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం జిల్లా ప్రజలకు, విద్యార్థులకి ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు జూనియర్ విభాగంలో 121,సీనియర్ విభాగం లో 133 మంది ఇన్స్ పెయిర్ 64 మంది విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను కలెక్టర్ విక్షించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిఈఓ ఆశోక్,ఆర్డీఓ శ్రీనివాసులు,తహసీల్దార్ కవిత, ఎంపిడిఓ సుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎంఈఓలు సైదా నాయక్,సలీం షరీఫ్,ఛత్రు నాయక్,జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్, ఉపాధ్యాయులు, తదితరులు, పాల్గొన్నారు.