calender_icon.png 11 September, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్యాయమై పోతున్న ఆదివాసీలు

09-08-2024 12:00:00 AM

నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునుండి నేటివరకు ఆదివాసీల జీవనం, మనుగడ, హక్కులు, చట్టాలు ఆస్తిత్వ ప్రమాదంలో పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, రాజకీయ కుట్రలవల్ల ఆదివాసీ ప్రాంతాలకు భవిష్యత్తులో రక్షణ లేదనేది తేలిపోయింది. భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ భూభాగం మన రాష్ట్రంలో 17,352 చ.కి.మీ. ఉంది. గోదావరి, దాని ఉపనదులైన ప్రాణహిత, పెన్‌గంగా, కిన్నెరసాని వంటి పరీవాహక ప్రాంతాల్లో గోండు, కొలాం, పర్టాన్, తోటి, మన్నేనార్, నాయక పోడు, కోయ, కొండరెడి,్డ గొత్తి కోయు, చెంచులాంటి ఆదిమ తెగలు ప్రధానంగా అడవి కేంద్రంగానే జీవనం సాగిస్తున్నవి.

10 లక్షల జనాభాగల ఆదివాసీలు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు కరువై దుర్భర జీవితాలను గడుపు తున్నారు. చారిత్రకంగా చూస్తే హైదరాబాద్ పూర్వరాష్ట్రంలో గోండు రాజ్యస్థాప న కోసం 1836లో నిర్మల్ గడ్డపై రాంజీ గోండ్‌సహా 1000 మంది గోండులను ఉరి తీయబడ్డ పోరాటం. ‘జల్, జంగల్, జమీన్’ కోసం 1940లో జోడెన్‌ఘాట్ కొండల్లో కొమురం భీం తిరుగుబాటు, 1942లో దమ్మపేట కొండల్లో పోయం గంగులు పోరాటం జరిగాయి. 

ఇంకా దేశంలో ఇలాంటి అనేక ఆదివాసీల తిరుగుబాట్ల ఫలితంగా డా. బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో 5.6 షెడ్యూల్‌ను పొందుపరచడం జరిగింది. ‘తెలంగాణ రాష్ట్రం రావాలి, ఆదివాసీలకు స్వయంపాలన కావాలి’ అనేది తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో అదిమ సమాజం కొమరం భీం, సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితో రాష్ట్ర ఏర్పాటు వరకు నిర్విరామ పోరాటంలో భాగస్వామ్యం అయింది. ఆ పాపానికేమో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సీమాంధ్ర పాలకులు పోలవరం ప్రాజెక్టు విషయంలో ముంపు ప్రాంతాలను ఆంధ్రకు ఇవ్వాలని డిమాండ్ పెట్టినప్పుడు, 2 లక్షలమంది ఆదివాసీ ప్రజలను, 277 గూడేలను వారికి అప్పగించడం ద్వారా ఆదివాసీలపై తెలంగాణకు ఎటువంటి ప్రేమ ఉందో నిరూపిం చుకుంది.

నాలుగు దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు నిలిపి వేయాలని ఆదివాసీలు, బుద్ధిజీవులు, మేధావులు చేసిన పోరాటం ఒక్క దెబ్బతో నిలిచిపోయి పార్లమెంటులో పోలవరానికి చట్టబద్ధత వచ్చింది. చూస్తుండగానే నేడు పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ ద్వారా కూనవరం, చింతూరు, వేలేరుపాడు, భద్రాచలం, చర్ల, వెంకటాపూర్, వాజేడు లాంటి మండలాల్లో కూడా బ్యాక్ వాటర్ వచ్చి నీట మునిగిన పరిస్థితులు మన కళ్ళముందు కనిపిస్తున్నాయి. దీనికంతటికీ కారణం తెలంగాణ రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా? అని ఆదివాసి సమాజం ప్రశ్నిస్తున్నది. నిర్వాసితులను జల సమాధి చేయడంలో అందరూ ఉన్నారని తెలియజేస్తున్నది. 

అశాస్త్రీయంగా జిల్లాల విభజన

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా ఆదివాసీలకు న్యాయం జరుగుతుందా? అంటే అదీ లేదు. నూతన జిల్లాల ఏర్పాటు లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోండులను నాలుగు జిల్లాలుగా, ఉమ్మడి ఖమ్మంలోని కోయలను ఐదు జిల్లాలుగా, ఉమ్మడి వరంగల్‌లోని కోయలను మూడు జిల్లాలుగా, నల్లమల ప్రాం తంలోని చెంచులను రెండు జిల్లాలుగా విభజించి, ఆదివాసి భూభాగాలను ధ్వంసం చేశారు. భవిష్యత్తులో ఆదివాసీలు మైనార్టీలుగా మారి  అస్తిత్వమే కోల్పోయే ప్రమా దం ఉన్నదని గ్రహించి జిల్లాల పునర్విభజన కమిటీకి ఆదివాసీ జిల్లాల మ్యాప్‌ల తోలసహా సూచించినా కుట్రపూరితంగా విభజించింది ప్రభుత్వం. నేడు ముక్కలైన ఆదివాసాల జీవనం కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.

 తీవ్రమైన పోడు భూముల సమస్య

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోడు భూముల సమస్య తీవ్రంగా మారింది. భూమి పుత్రుల గుండెలపై ఫారెస్ట్ అధికారుల బూటు కాళ్ల ముద్రలు అధికమ య్యాయి. ‘అటవీ హక్కుల చట్టం 2006’ ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇచ్చే క్రమంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని భూములను పెండింగ్ క్లైమ్‌గా పెట్టింది. అందులో 3 లక్షల ఎకరాలకు పట్టాలు అం దించలేదు. తెలంగాణ వచ్చాక ఆ న్యాయమైన భూములపై అటవీశాఖ అధికారుల దాడులు అధికం అయ్యాయి. నిజాం నిరంకుశ పాలనను మళ్లీ చూపిస్తున్నది అటవీ శాఖ.

అమాయక ఆదివాసీలపై జులుం చేస్తున్నారు. ఆంధ్ర వలసలను వ్యతిరేకించి ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గోదావరి పరీవాహక ప్రాంతంలో సారవంత మైన ఆదివాసీల భూములు 7 లక్షల 50 వేల ఎకరాలు గిరిజనేతరుల చెరలో ఉన్నాయని స్వయాన ‘గిరిగ్లాని కమిషన్’ (2004), ‘కోనేరు రంగారావు కమిటీ’ (2006) తెలిపినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వలసాంధ్ర గిరిజనేతరులపైనే ప్రేమను చూపించింది తప్ప, ఆదివాసీలకు భూహక్కులు కల్పించలేదు.

‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూలవాసులను కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నది. అందుకు ప్రతి దేశం కొత్త చట్టాలు రూపొందించడం, వాటిని అమలు చేయ డం, తద్వారా జీవించే హక్కుతోసహా ఆధునిక మానవునికిగల అన్ని హక్కులూ వారికి ఇవ్వవలసి ఉన్నది’ అని 1994 డిసెంబర్ 23న ఐరాస (ఐక్కరాజ్యసమితి) జనరల్ అసెంబ్లీ 49/214 తీర్మానంలో పేర్కొన్నది. ఐరాస తీర్మానం మేరకు ప్రతి దేశం దశాబ్ద కాలం పాటు ఆదివాసీ తెగలను గుర్తించి వారిని చట్టపరిధిలోకి తీసుకురావాలి. ఈ తీర్మానంపై 148 దేశాలు సంతకాలు చేసి నా, కొంతమేరకు అమలు చేసిన దేశాలు 60 మాత్రమే. ఈ 60లో భారతదేశం లేదు. మన దేశంలో సుమారు 600 ఆదివాసీ తెగలు గుర్తింపును పొందాయి.

ఆ నీళ్లన్నీ మైదాన ప్రాంతాలకే

తెలంగాణలో అక్రమంగా ఓపెన్‌కాస్ట్ ఏర్పాటు చేసి ఆదివాసీలను అడవికి దూరం చేస్తున్నారు. గ్రామసభ నిర్వహణ, వారి అభిప్రాయం లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం జరిగిపోతున్నది. గోదావరిపై కట్టిన కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల నుండి కోటీ 8 లక్షల 50,000 ఎకరాలు, తుపాకులగూడెం ప్రాజెక్టునుండి 7 లక్షల ఇరవై వేల ఎకరాలు, దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నుండి 2 లక్షల ఎకరాలకు తెలంగాణ మైదాన ప్రాంతాలకు నీరు పోతుంది. తలాపున ఉన్న ఆదివాసి గూడేలకు ఒక ఎకరానికి కూడా సాగునీరు అందే పరిస్థితి లేదు. నేటికీ చలమల్లోని తాగునీరే గతి అవుతున్నది.

ఆంధ్ర వలసదారులు తెలంగాణ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు దోచుకున్నారని సాగిన పోరాటం నేడు తెలంగాణ ఆదివాసీ సమాజం విషయంలో మాత్రం ఈ డిమాం డ్ చేదుగా మారింది. నేడు తెలంగాణలో 50 లక్షల పైచిలుకు వలస జనాభా ఆదివాసీల రిజర్వేషన్లను పూర్తిగా అనుభవిస్తున్నది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆదిమ తెగలనుండి ఒక్క ఐఏఎస్ కూడా లేడు గాని 100కు పైచిలుకు లంబాడా ఐఏఎస్/ ఐపీఎస్‌లు ఉన్నారు. గ్రూప్ గ్రూప్ పాటు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగాలలో మొత్తం గా కూడా లంబాడీలు ఉన్నారు. రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ చూస్తున్నాయి తప్ప ఆదివాసీలకు న్యాయం చేసే పరిస్థితి లేదు.

అస్తిత్వానికే ముప్పు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2020 మార్చి 20న ఆదిమ తెగల అస్తిత్వానికి ప్రమాదంగా మారే ఒక తీర్పుని సుప్రీంకోర్టు వెలువరించింది. జీవో నెంబర్ 317 అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2001లో తెచ్చింది. ఈ జీవో భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లోని సబ్ పేరా (2)కు అనుసంధానం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(ఇ) ప్రాథమిక హక్కుల ప్రకారం ఆదిమ వాసుల ప్రదేశంలో బయటి ప్రాంతపౌరులు సంచరించడం నిషేధం.

కానీ, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. అంటే, ఈ తీర్పు తో ఐదో షెడ్యూల్‌కు చిల్లు పడిందని చెప్పవచ్చు. ఈ తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటీషన్ దాఖలు చేసి చేతులు దులుపుకొంది గాని, తనకున్న ఫెడరల్ అధికారాలను ఉపయోగించి ప్రత్యే క చట్టం మాత్రం చేయలేదు. తీర్పు వెలుపడిన వెంటనే జిల్లా కలెక్టర్లు, ఎమ్మార్వోలు షెడ్యూల్ ఏరియా సర్టిఫికెట్లను ఆదివాసీలకు నిలిపివేశారు. అందుకే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 29 శాఖల జీవోలను కలిపి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం మేరకు ప్రత్యేక చట్టం తెచ్చి ఆదివాసీలను రక్షించవలసిన బాధ్యత ఉంది. 

 వూకె రామకృష్ణ దొర

సెల్: 9866073866