calender_icon.png 23 December, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొలేరో వాహనాన్ని ఢీకొట్టిన లారీ

23-12-2025 02:44:15 AM

ముగ్గురు కూలీల మృతి, పలువురికి గాయాలు

జైపూర్ (మంచిర్యాల), డిసెంబర్ 22 (విజయక్రాంతి): బతుకుదెరువు కోసం పక్క రాష్ట్ర మైన మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రాగా ప్రమాదవశాత్తు వారు వస్తున్న బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందగా, పలువురికి గాయాలైన సంఘటన సోమవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దపల్లి జిల్లా సుల్తా నాబాద్ పరిసర గ్రామాల్లో వరి నాట్ల కోసం తట్ట బుట్టలతో మహరాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా చాందిని బుజ్ గ్రామానికి చెందిన 23 మంది కూలీలు బొలేరో (ఎంహెచ్ 34 బీజీ 4825) వాహనంలో బయలుదేరి వచ్చారు.

మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డు సమీపంలో ఉదయం 3.30 గంటల సమయంలో డ్రైవర్ మూత్రవిసర్జన కోసం వాహనాన్ని ఎడమ వైపునకు రోడ్డుదించే సమయంలో శ్రీరాంపూర్ వైపు నుంచి వచ్చిన లారీ అతి వేగంగా బొలెరో వాహనం వెనక వైపున ఢీ కొట్టింది. దీనితో ఆ బొలేరో వాహనం అటవీ ప్రాంతంలోని చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళా కూలి అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు.

మృతి చెందిన వారిలో మీనాబాటిల్ వాల్ (45), లీలాబాయి (60), ఇమ్లిబాయి (48)లు ఉన్నారు. సమాచారం అందుకున్న జైపూర్ పోలీసులు 108 వాహనం ద్వారా క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదస్థలాన్ని జైపూర్ సీఐ నవీన్ కుమార్ సందర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలాన్ని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, జైపూర్ ఏసీపీ ఆర్ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్ కుమార్, ఎస్సై శ్రీధర్ పరిశీలించారు.