calender_icon.png 23 December, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో భారం మోసేదెవరు?

23-12-2025 01:50:56 AM

ప్రభుత్వ స్వాధీనంతో హైదరాబాద్ మెట్రో సంక్షోభం.. ఆర్థికంగా తప్పులు, ప్రయాణీకులకు తిప్పలు

* ప్రతిరోజూ తీవ్రమైన ట్రాఫిక్‌తో ఇబ్బంది పడే హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు ఒకప్పుడు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు మెట్రోను పరిష్కారంగా ప్రజలు భావించారు. కానీ ఇప్పుడు అదే మెట్రో ప్రభుత్వ తప్పిదాలకు బలిపశువుగా మారింది. హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్ టీ మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ నుంచి తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తొందరపాటు నిర్ణయం భారీ ఆర్థిక నష్టానికి, ప్రయాణీకులకు ఇబ్బందులు కలిగించడానికి కారణమవుతున్నది.

ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్‌లో ప్రకటించగా, 2026 మార్చిలో అధికారికంగా స్వాధీన ప్రక్రియ జరగనుంది. ఈ ప్రక్రియలో ప్రభుత్వం రూ. 13,000 కోట్ల అప్పును భరించడంతో పాటు అదనంగా రూ. 2,000 కోట్ల ఈక్విటీ సెటిల్మెంట్ చెల్లించడం ప్రజాధనంపై పెనుభారంగా మారుతుంది. 

ఈ నిర్ణయం వల్ల మెట్రో సేవల నాణ్యత తగ్గుతుందని, ఖర్చులు పెరుగుతాయని, భవిష్యత్ తరాలపై అప్పుల భారం పడుతుందని ‘విజయక్రాంతి’, ‘మెట్రో ఇండియా’ పత్రికలు ముందుగానే రెండుసార్లు హెచ్చరించాయి. కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఒప్పందం పూర్తికాకముందే సమస్యలు బయటపడుతున్నాయి.

ఇప్పటికైనా మేలుకుంటేనే మేలు

హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్, ప్రైవేట్, భాగస్వామ్య (పీపీపీ) ప్రాజెక్ట్‌గా ప్రారంభమైంది. ఇందులో ఎల్ అండ్ టీ 90 శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వానికి 10 శాతం వాటా ఉంది. ఈ మెట్రో మొత్తం 69.2 కిలోమీటర్ల పొడవునా మూడు మార్గాల్లో నడుస్తోంది. రెడ్ లైన్ మార్గం మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు, గ్రీన్ లైన్ మార్గం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు, బ్లూ లైన్ మార్గం నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు విస్తరించి ఉంది. ఎనిమిదేళ్లలో మెట్రోలో 80 కోట్ల మంది ప్రయాణించారు.

2025 ప్రారంభంలో రోజుకు 5.5 లక్షల మంది ప్రయాణించే స్థాయికి చేరిం ది. వార్షిక ఆదాయం రూ. 1,100 కోట్లకు పైగా ఉండగా, 2022--23 ఆర్థిక సంవత్సరంలో టికెట్ల రూపంలో ఆదాయం రూ.703 కోట్లుగా నమోదైంది. అయితే ఇదంతా తెరపైకి బాగానే కనిపించినా.. అంతర్గతంగా మాత్రం భారీ నష్టాలు ఉన్నాయి. ఇప్పటివరకు మెట్రో రైల్ ద్వారా మొత్తం రూ. 6,600 కోట్ల నష్టం వాటిల్లింది. ఇందులో 2024-25లో మాత్రమే రూ. 625 కోట్ల నష్టం వచ్చింది. నిర్వహణ ఖర్చులు రూ. 429 కోట్లు, రూ. 12,500 కోట్ల అప్పుపై 1,273 కోట్ల వడ్డీ చెల్లించడమే ఈ నష్టానికి ప్రధాన కారణాలు.

ఈ నష్టాలను భరించలేక ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ నుంచి బయటపడాలని నిర్ణయించింది. ప్రభుత్వం దీనికి పరిష్కా రం చూపడానికి బదులు, నష్టాలన్నింటినీ ప్రజలపై మోపేలా ఈ మొత్తం బాధ్యతను స్వీకరించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీకి చెల్లించాల్సిన మొత్తం ఖర్చు సుమారు రూ. 15,000 కోట్లకు చేరింది. అయితే ఈ అప్పులపై ప్రస్తుతం ప్రభుత్వం 11 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండటమే అసలు సమస్య అనే వాదనలు ఉన్నాయి. ఎల్ అండ్ టీ మాత్రం ఇదే అప్పులను కేవలం 6 శాతం వడ్డీతో తీసుకుంది.

దీని ద్వారా ప్రభుత్వానికి దాదాపు రెట్టింపు వడ్డీ భారం పడుతోంది. ఇదే కాకుండా, ఒప్పంద కాలం మొత్తం మీద ఎల్ అండ్ టీకి వచ్చే అవకాశం ఉన్న నష్టాలు రూ. 1 లక్ష కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఇవన్నీ కలిస్తే ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక పెను భారంగా మారుతోంది. ఈ క్రమంలో ఇది పూర్తిస్థాయిలో విపత్తు అని విజయక్రాంతి, మెట్రో ఇండియా స్పష్టంగా చెబుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో వచ్చే 50 ఏళ్ల పాటు ప్రజలపై భారం పడనున్నది.

అయితే ఒక ప్రైవేట్ కంపెనీని కాపాడేందుకు ప్రజాధనాన్ని ఎందుకు వినియోగించాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ స్వాధీన ప్రక్రియలో అవినీతి జరిగిందా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లోపాయికారిగా ఒప్పందాలు జరిగాయా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ప్రతిపక్ష పార్టీలు, ఎన్జీవోలు, ప్రజలు మౌనంగా ఉండడమే అసలైన వింత!. ఇలాంటి భారీ తప్పిదాలను ఎవ్వరూ ప్రశ్నించని పరిస్థితినే భారత ప్రజాస్వామ్యం అని అనుకోవాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

దిగజారిన హైదరాబాద్ మెట్రో..

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ఈ పరిస్థితిని మరింత కష్టతరం చేస్తున్నది. ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నారు. ఉద్దేశం మంచిదైనా, ఆచరణలో ఇది మెట్రోకు పెద్ద దెబ్బగా మారింది. ఒకప్పుడు మెట్రో ప్రయాణికుల్లో 40 శాతం మహిళలు ఉండేవారు. ఇప్పుడు వారు పెద్ద సంఖ్యలో బస్సుల వైపు మళ్లడంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య మరింత తగ్గింది.

ఈ పథకం కారణంగానే రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 5.5 లక్షల నుంచి 4.8 లక్షలకు పడిపోయిందని ఎల్ అండ్ టీ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణీకుల సంఖ్య 25 శాతం పెరిగినప్పటికీ ఆదాయం 21 శాతం తగ్గింది. ఒకప్పుడు దేశంలో రెండో అత్యంత రద్దీ మెట్రోగా ఉన్న హైదరాబాద్ మెట్రో ఇప్పుడు జాతీయ స్థాయిలో 9వ స్థానానికి పడిపోయింది.

వ్యవస్థలోని లోపాలు కూడా సమస్యను పెంచుతున్నాయి. సరైన లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల 62 శాతం మంది ఇంటికి చేరేందుకు బస్సులు, ఆటోలు లేదా బైక్ షేరింగ్‌ల రూపంలో అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. మెట్రో టికెట్ ధరలు రూ. 10 నుంచి రూ. 60 వరకు ఉండగా, బస్సు చార్జీలు 5 నుంచి రూ. 30 వరకు మాత్రమే ఉన్నాయి. పెరుగుతున్న ధరల నేపథ్యంలో మెట్రో ప్రయాణం చాలామందికి ఖరీదైనదిగా మారింది. 

మెట్రో స్వాధీనం తప్పిదం..

మెట్రో స్వాధీనం నిర్ణయం పూర్తిగా తప్పిదమని రాజకీయ విమర్శలు వస్తున్నాయి. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తీవ్రంగా విమర్శిస్తూ ప్రభుత్వం ప్రజలపై రూ. 15,000 కోట్ల భారం మోపుతూ, విలువైన భూములను ఎల్ అండ్ టీకి అప్పగిస్తోందని అన్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిచ్చే వారు మాత్రం ఇది స్థిరత్వానికి నిదర్శనమని, ఢిల్లీ, బెంగళూరు లాంటి ప్రభుత్వ నిర్వహణలోని మెట్రో విజయాలను ఉదాహరణగా చూపుతున్నారు.

కానీ ఇంత తొందర ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. మెట్రో ఫేజ్ విస్తరణ ప్రాజెక్ట్ ఇంకా కేంద్ర అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఐదు మార్గాల్లో 76.4 కిలోమీటర్లు, మొత్తం వ్యయం రూ. 24,269 కోట్లు ప్రతిపాదిస్తున్నప్పటికీ ప్రసుత మెట్రో రైళ్లకు అదనపు కోచ్‌లను జోడించడం, ఫీడర్ బస్సులు పెంచడం వంటి ప్రాథమిక అవసరాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

అసలు రూ. 1 లక్ష కోట్లకు పైగా నష్టం జరిగే పరిస్థితికి బాధ్యులు ఎవరు?, రాజకీయ నాయకుల మాటలకే తల ఊపుతూ, వ్యతిరేక అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్ణయాలను ఆమోదించారని సలహాదారులు, ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడ్డారా? అని ‘విజయక్రాంతి’, ‘మెట్రో ఇండియా’ ప్రశ్నిస్తున్నాయి.

జవాబివ్వాల్సిన అవసరం ఉంది..

ప్రజలకు స్పష్టమైన సమాధానాలు రావాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. నెలకు మెట్రో ఎంత నష్టం చవి చూస్తోంది. ఎల్ అండ్ డీ అప్పులపై వడ్డీలకు ఎంత చెల్లిస్తున్నారు?. ప్రయాణీకుల తగ్గుదల వల్ల ఎంత ఆర్థిక నష్టం?. ఇలాంటి కీలక అంశాలపై ప్రభుత్వ పారదర్శకత పూర్తిగా కనిపించడం లేదు. ఇంత పెద్ద విషయం అయినా అసెంబ్లీలో ప్రత్యేక చర్చ కూడా జరగలేదు. ‘విజయక్రాంతి’, ‘మెట్రో ఇండియా’ రెండుసార్లు హెచ్చరించినా వాటిని పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అహంభావానికి అద్దం పడుతోంది.

ఇది కేవలం మెట్రోలో జరిగిన తప్పిదం కాదు.. ప్రజాధనానికి జవాబుదారీతనం లేకపోవడమే. దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టే నిర్ణయం ఇది. ప్రయాణీకులు మాత్రం మౌనంగా కష్టాలు భరిస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో మెట్రో భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా?, ఎల్ అండ్ టీ తప్పులకు మాత్రమే పరిహారం ఇచ్చి, వారి మొత్తం నష్టాన్ని ప్రజలపై మోపకుండా ఉంటుందా? లేక ఈ అస్తవ్యస్త స్వాధీనం నష్టాల వారసత్వంగా మిగిలిపోతుందా? అని చూడాలి.

2026 మార్చి సమయం దగ్గర పడుతున్నా.. నష్టం మాత్రం ఇప్పుడే మొదలైంది. భవిష్యత్తు వైపు పరుగులు తీస్తున్న నగరానికి ఇది పెద్ద బ్రేక్ లాంటిది. ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాల కారణంగా పశ్చాత్తాపంతో మిగిలిపోయే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 

కనిపిస్తున్న మెట్రో ప్రభావం..

ప్రభుత్వ స్వాధీనం ఇంకా పూర్తికాకముందే దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోం ది. మెట్రో సేవల నాణ్యత బాగా తగ్గిపోయింది. రోజూ ప్రయాణించే వారి సంఖ్య 5 లక్షల నుంచి 4 లక్షలకు పడిపోయింది. అంటే రోజువారీ ప్రయాణీకుల్లో ఇది దాదా పు 20% తగ్గుదల. నాన్-పీక్ సమయాల్లో రైళ్ల మధ్య గ్యాప్ 10-12 నిమిషాలకు పెరిగింది. ఇంతకు ముందు రాత్రి 11:45 గంటల వరకు చివరి మెట్రో ఉండగా, ఇప్పుడు 11 గంటలకే ముగుస్తోంది. ప్రయాణీకులు తక్కువగా ఉండటం, ఖర్చులు తగ్గించడానికే ఇలా చేస్తున్నామని ఎల్ అండ్ టీ చెబుతోంది.

కానీ ప్రయాణీకులు మాత్రం దీనిని అంగీకరించడం లేదు. సంగారెడ్డికి చెందిన నర్సింగ్ ఆఫీసర్ వెరోనికా రాచెల్ స్పందిస్తూ.. ఇది అసౌకర్యం మాత్రమే కాదు, భద్రతకు కూడా ప్రమాద మని అభిప్రాయపడ్డారు. చాలా అలసటకు కూడా గురవుతున్నామని వాపోయారు. పీక్ అవర్స్‌లో రద్దీ మరింత పెరిగింది. ఆరు కోచ్‌లు పెట్టాలని ఎన్నిసార్లు కోరినా, ఇప్పటికీ రైళ్లు మూడు కోచ్‌లతోనే నడుస్తున్నాయి. రోడ్ సేఫ్టీ నిపుణుడు రమన్జీత్ సింగ్ దీనిపై తీవ్రంగా స్పందిస్తూ.. ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వాడకుండా చేయడానికే ఈ రకంగా చేస్తున్నారని, ఇది అభివృద్ధికి వ్యతిరేకమని వెల్లడించారు.

ప్రయాణీకుల అసంతృప్తి.. 

మెట్రోపై ప్రయాణీకుల అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ 210 మంది ప్రయాణికులపై చేసిన సర్వేలో 62 శాతం మంది మెట్రో వల్ల సమయం ఆదా అవుతుందని, సౌకర్యంగా ఉందని చెప్పారు. వాహనాలు ఉన్నవారిలో 88 శాతం మంది భద్రత కారణంగా మెట్రోను ఎంచుకుంటున్నట్లు తెలిపారు. టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం, రైళ్ల సంఖ్య తక్కువగా ఉండటం, రిజరవ్డ్ కోచ్లలో తీవ్ర రద్దీ, మహిళలు రిజర్వ్ సీట్లను 81 శాతం మాత్రమే ఉపయోగించగల్గడం, వృద్ధుల సీట్లను వారు 43 శాతమే వినియోగించుకోవడం వంటి సమస్యలు మాత్రం తగ్గలేదు.

మెట్రో స్వాధీనం అనిశ్చితి కారణంగా ఉద్యోగుల్లో కూడా నిరుత్సాహం పెరిగింది. ప్రత్యేక ఆడిట్ జరగనుండగా, మధ్యంతరంగా ఆరు నెలలు ఇతర సంస్థ నిర్వహణ చేపట్టే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒక మెట్రో ఉద్యోగి దీనిపై స్పందిస్తూ మునిగిపోతున్న ఓడ నుంచి చుక్కలతో లీక్ అవుతున్న మరో పడవలోకి దూకినట్టే పరిస్థితి ఉందని వాపోయారు. 

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి