calender_icon.png 23 December, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ నేనే.. కాదు నేను..

23-12-2025 02:02:41 AM

  1. ప్రమాణ స్వీకారానికి ఇద్దరు మహిళల పోటీ
  2. దామరవంచలో గందరగోళం 

మహబూబాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): గ్రామ సర్పంచిగా నేను గెలిచా నంటే నేను గెలిచాను .. నాతోనే ప్రమాణస్వీకారం చేయించాలంటూ ఇద్దరు పోటీ పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వారిద్దరు గెలుపు ధ్రువపత్రాలు ఫామ్ 29తో సోమవారం అధికారుల వద్దకు రావడంతో.. ఇదెక్కడి గోలరా అంటూ అధికారులు తలలు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 11న దామరవంచ గ్రామ సర్పంచ్ ఎన్నికకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించారు.

ఇందులో సర్పంచ్ గా ఒక్క ఓటు తేడాతో నునావత్ స్వాతిపై సనప సుజాత విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయ లలిత ఫామ్ 29 జారీ చేశారు. ఈ మేరకు సోమవారం సనప సుజాత చేత పదవి స్వీకార ఏర్పాట్లు చేస్తుండగా, ఆమె గెలవలేదు నేనే గెలిచానంటూ ఎన్నికల్లో పోటీ చేసిన నునావత్ స్వాతి అధికారుల వద్దకు వచ్చింది. ఓట్ల లెక్కింపు సమయంలో ముందుగా తాను మూడు ఓట్ల తేడాతో సుజాత పై తాను నెగ్గినట్లు ఎన్నికల అధికారి తనకు ఫామ్ 29 జారీ చేశారని స్వాతి సోమవారం ప్రమాణ స్వీకారం తనతో చేయించాలంటూ అధికారుల వద్దకు వచ్చింది.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇరువురు తమ బంధు వర్గంతో తరలివచ్చారు. ఆదివారం రాత్రి నుంచే తాను సర్పంచిగా గెలిచానంటే.. తాను సర్పంచిగా గెలిచానంటూ.. సోమవారం ఉదయం నేను ప్రమాణస్వీకారం చేస్తున్నానంటే.. నేను ప్రమాణం శ్రీకారం చేస్తున్నానని వాట్సాప్ గ్రూపులో ప్రచారం చేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

చివరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయ లలిత సర్పంచిగా సుజాత గెలుపొందినట్లు ఉన్నతాధికారులకు ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్పంచుగా సుజాత, ఎన్నికైన ఉప సర్పంచ్, వార్డు సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని నునావత్ స్వాతికి చెప్పి పంపారు. అయితే ఇద్దరికీ కూడా గెలుపును ధ్రువీకరిస్తూ ఫామ్ 29 ఎలా ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. 

స్వాతి గెలిచినట్లు ప్రకటించలేదు

దామరవంచ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సనప సుజాత విజయం సాధించింది. ఆమెకు మాత్రమే గెలుపు ధృవీకరణ పత్రం ఫామ్ 29 ఇచ్చాను. సర్పంచ్ గా పోటీ చేసిన మరో అభ్యర్థి నూనావత్ స్వాతి ఎన్నికల్లో గెలిచినట్టుగా, తాను ఆమెకు ఫామ్ 29 ఇచ్చినట్లుగా వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఆమెకు ఎటువంటి ధృవీకరణ పత్రం ఇవ్వలేదు. ఈ విషయంపై గూడూరు పోలీసులకు ఫిర్యాదులు చేశామని  ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయ లలిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు.