calender_icon.png 23 December, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాచకొండలో పెరిగిన క్రైం రేటు

23-12-2025 02:35:50 AM

  1. తగ్గిన సైబర్ క్రైమ్ నేరాలు, పెరిగిన రికవరీ 
  2. గత ఏడాది 28,626.. ఈ ఏడాది 33,040 కేసులు నమోదు
  3.   579 కిడ్నాప్ కేసులు, 1,224 పోక్సో కేసులు 
  4.   2025 క్రైమ్ వార్షిక నివేదికను వెల్లడించిన సీపీ సుధీర్‌బాబు

ఎల్బీనగర్, డిసెంబర్ 22: రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈసారి నేరాల సంఖ్య పెరిగినట్లు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. నాగోల్‌లోని ఒక కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారం రాచకొండ--2025 క్రైమ్ వార్షిక నివేదికను వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో గత ఏడాది 28,626 కేసులు నమోదు కాగా, 2025లో 13,040 కేసులు నమోదైనట్లు తెలిపారు. కిడ్నాప్ కేసులు, పోక్సో కేసుల సంఖ్య కూడా పెరిగిందని పేర్కొన్నారు.

579 కిడ్నాప్ కేసులు, 1,224 పోక్సో కేసులు నమోదయ్యాయని వివరించారు. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాల సంఖ్య 4 శాతం పెరిగిందని, ఈ ఏడాది రూ.20 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ కేసుల్లో 668 మంది నిందితులు అరెస్ట్ చేశామన్నారు.

గత ఏడాదితో పోలిస్తే సైబర్ క్రైమ్ కేసులు తగ్గాయని సీపీ వెల్లడించారు. గత ఏడాది 4,618 కేసులు నమోదు కాగా, ఈసారి 3,734 కేసులు నమోదయ్యాయని, రికవరీ శాతం భారీగా పెరిగిందని చెప్పారు. ఆపరేషన్ ముస్కాన్ కింద 2,479 మందిని రెస్క్యూ చేసినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా 1,071 మందిని రెస్క్యూ చేశామని పేర్కొన్నారు. 

పెరిగిన రోడ్డు ప్రమాదాలు

గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని, గత ఏడాది 3,207 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 3,488 కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 659 మంది మృతి చెందారని వివరించారు. కమిషనరేట్ పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదాల్లో 37మంది మృతి చెందారని వివరించారు. ఎక్సైజ్ యాక్ట్ కింద 656 కేసులు నమోదు చేసి, 689 మందిని అరెస్ట్ చేశామని, 6,824 లీటర్ల మద్యం సీజ్ చేశామని, గేమింగ్ యా క్ట్ కింద 227 కేసులు నమోదు చేసినట్టు వివరించారు.

మానవ అక్రమ రవాణా కింద ఈ ఏడాది 73 కేసులు నమోదు చేశామని, 8 స్థావరాలు గుర్తించామని చెప్పారు. దోపిడీలు -3, దొంగతనాలు -67, ఇళ్లలో చోరీలు -589, వాహనాల చోరీలు -876, సాధారణ చోరీలు 1,161, హత్యలు -73, లైంగికదాడులు 330, వరకట్న వేధింపుల మరణాలు- 12, గృహహింస కేసులు 782 నమోదైనట్లు వివరించారు. 

ఎల్బీనగర్ జోన్‌లో

జీరో ఎఫ్‌ఆర్‌ఐలు 87, సైబర్ క్రైమ్-964, 100 కాల్స్ డయల్ కాల్స్ 78,046, ఈ--పెట్టి కేసులు, చిన్న కేసులను పరిష్కరించారు. 18346 ఈ-పెట్టి కేసులు డిస్పోజ్ అయినవి 17,586. పాయింట్ బుక్స్ సందర్శించనవారు 2,74,419, ఎఫ్‌ఆర్‌ఐ స్వీకరించినవి 30,757, ఎఫ్‌ఆర్‌ఐ డిస్పోజ్ చేసినవి 29,872, కేసుల్లో దోషులుగా తేలింది 2,133 మంది. 

శాంతిభద్రతల పరిరక్షణే ముఖ్యం: సీపీ

శాంతిభద్రతల పరిరక్షణే ముఖ్యమని, పోలీసులకు ప్రజలు సహకరించి, నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ సుధీర్‌బాబు కోరారు. కేసుల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, నేరస్తులకు శిక్షలు పడేలా కేసుల దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరగాలని సూచించారు. సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.