06-01-2026 12:00:00 AM
మహబూబాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): గార్ల ప్రాంతానికి తాగునీరు, సాగు నీరు అందకుండా చేసే జీవో 98 ను వెంటనే రద్దు చేయాలని, మున్నేరు పాలేరు లింకు కాలువ నిర్మాణాన్ని నిలిపివేయాలని, వై యస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలని, గార్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమానికి నడుం బిగించారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతలను కలిసి మున్నేరు పాలేరు లింకు కా లువ నిర్మాణం వల్ల మహబూబాబాద్ జిల్లా గార్ల మండల ప్రాంతానికి జరిగే నష్టాన్ని వివరిస్తూ విజ్ఞాపన పత్రాలను అందజేస్తున్నారు.
ఇందులో భాగంగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం పూర్తిగా ఏజన్సీ మండలమని, ఈ మండలంలో సుమారుగా 90 శాతం జనాభా వర్షాధార వ్యవసాయముపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఇందులో అత్యధిక శాతం గిరిజనులు, పెద రైతులు, కూలీలు ఉండగా, ఈ మండలంలో రైతులు చిన్నచిన్న చెరువులు, కుంటలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారన్నారు.
పాలకుల నిర్లక్ష్యము వలన ఈ ప్రాంతము నిరంతరం తీవ్ర అన్యాయానికి గురవుతోందని, గార్ల మండల ప్రాంతానికి గత పాలకులు సీతారామ ప్రాజెక్ట్ (రోళ్ళపాడు రిజర్వాయర్) ఏర్పాటు చేసి అక్కడి నుండి టేకులపల్లి, ఇల్లందు, గార్ల , బయ్యారం, కారెపల్లి, కామేపల్లి డోర్నకల్ మండలాల బీడు భూములకు సాగు నీరు, ప్రజలకు త్రాగు నీరు నీరు అందించి మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని వాగ్దానాలు చేసి, మాట తప్పి తమ ప్రాంతానికినికి అన్యాయము చేస్తూ వస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
బయ్యా రం చెరువును రిజర్వాయర్ చేస్తామని కూడా సీతారామ ప్రాజెక్ట్ డీపీ ఆర్ లో పేర్కొన్నారని, ఇప్పుడు పాలకులు మోసపూరిత హామీలు ఇచ్చి అన్యాయం చేస్తున్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వము మున్నేరు నీటిని గార్ల మండలం నుండి సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా పాలేరు చెరువుకు తరలించేందుకు 2025, మే 17న జీవో నెంబర్ 98 విడుదల చేస్తూ కాలువ నిర్మాణ పనులకు 162 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు.
ఈ జీవోతో ముగ్గురు మంత్రు లు ప్రాతినిధ్యము వహిస్తున్న ఉమ్మడి ఖ మ్మం జిల్లాలో అన్ని ప్రాంతముల సమానాభివృద్ధిని అభివృద్ధిని కోరుకోవడం లేదని స్పష్టమవుతుందన్నారు. పుష్కలంగా నీరు వుండి రెండు, మూడు పంటలతో సస్యశ్యామలంగా ఉన్న పాలేరు ప్రాంతానికి, నీటి కొరత ఉన్న గార్ల మండల భూముల్లో కాలువలు నిర్మించి వాటి ద్వార పుష్కలంగా నీరు ఉన్న పాలేరుకు తరలించడము సరైంది కాదన్నారు.
ఈ జీవో వచ్చిన వెంటనే ఈ జీవోను నిరసిస్తూ ఈ జీవోను రద్దు చేయాలని కోరు తూ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సమక్షంలో వినతి పత్రం కూడా అందించిన ఫలితం లేకుండా పోయిందన్నారు. ఏజెన్సీ గిరిజన ప్రాంత భూముల్లో మున్నేరు, పాలేరు లింకు కాలువను తవ్వు తూ, ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు సాగు నీరు, త్రాగు నీరు అందించకుండా అన్యాయానికి గురి చేస్తున్నారన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో పీసా గ్రామ సభల ఆమోదం గాని, ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ కూ డా జరపకుండా మున్నేరు - పాలేరు లింకు కెనాల్ ఏర్పాటుకు జీవోను ఇచ్చి అకస్మాత్తుగా గిరిజన రైతుల భూముల్లో సర్వేలు చేస్తూ గిరిజన ప్రజలను, గిరిజన రైతులను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. గార్ల మండలంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు జేఏసి (అఖిల పక్షము) సమావేశము ఏర్పరచుకొని ఈ ప్రాంత సాగునీరు తాగునీరు కోసం ఉద్యమించాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు.
తక్షణమే జీ.ఓ. నెం.98 ను రద్దు చేయాలని, దాని ద్వారా చేపట్టబోయే ఈ మున్నేరు పాలేరు లింకు కాలువను నిలిపివేయాలన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణానికి నిర్మాణ అంచనా వ్యయం రూ.131,67.00 లక్షలతో (జీవో నం.1076 తేది.24.06.2009) మంజూరైందని, ఇప్పటి వరకూ మున్నేరు ప్రాజెక్టును నిర్మించలేదని, వెంటనే మున్నేరు ప్రాజెక్ట్ నిర్మా ణాన్ని చేపట్టి ఈ ప్రాంత భూములకు సాగు నీరు, ప్రజలకు త్రాగు నీరు అందించాలన్నారు.
సీతారామ ప్రాజెక్ట్ లో భాగంగా రోళ్ళపాడు రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడ నుండి టేకులపల్లి, ఇల్లందు, గార్ల, బ య్యారం, కారెపల్లి, కామేపల్లి డోర్నకల్ మండలాల బీడు భూములకు సాగు నీరు, ప్రజలకు తాగు నీరు అందించాలన్నారు. గార్ల మండల ప్రజల ఆకాంక్షలను క్షణ్ణంగా పరిశీలించి తమ ప్రాంతానికి తగు న్యాయం చేసి మా జీవితాలకు భరోసా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని పార్టీల నాయకులకు గార్ల మండల ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నారు.
సమస్య పరిష్కారానికి కృషి చేస్తా : హరీష్ రావు హామీ
గార్ల ప్రాంత ప్రజలకు నష్టదాయకంగా నిలుస్తున్న 98 జీవో రద్దు, మున్నేరుపై ప్రా జెక్టు నిర్మాణం కోసం తన వంతు కృషి చేస్తానని, ఇందుకోసం ప్రభుత్వం తో చర్చిస్తానని హరీష్‌రావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గార్ల మండల రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గట్టు రామచంద్రరావు, గంగావతి లక్ష్మణ్ నాయక్, సిపిఐ రాష్ట్ర నాయకులు కట్టబోయిన శ్రీనివాస్, టీజేఎస్ రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళితారక రామారావు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, జడ సత్యనారాయణ, గుగులోత్ సక్రు నాయక్, టిడిపి రైతు జిల్లా నాయకులు కత్తి సత్యం, బిజెపి జిల్లా నాయకులు అజ్మీర రామ నాయక్, సిపిఎం జిల్లా నాయకులు కందులూరు ఈశ్వర్ లిం గం, భానోత్ సురేష్ పాల్గొన్నారు.