06-01-2026 12:09:00 AM
నవాబుపేటలో కొల్లూరు ను కొత్త మండలం చేయాలి
అసెంబ్లీ జీరో అవర్‌లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, జనవరి 5: రెండు జాతీయ రహదారులకు కూడలి కేంద్రంగా ఉన్న జడ్చర్ల కు రెవెన్యూ డివిజన్, బస్ డిపోలను మంజూరు చేయాలని, కొల్లూరును కొత్త మండలంగా ప్రకటించాలని,జడ్చర్ల రూరల్ మండలం ఏర్పాటు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్ల ప్రాంతానికి అవసరమైన సౌకర్యాలను కల్పించాలన్నారు. సోమవారం అసెంబ్లీ జీరో అవర్ లో ఈ విషయం గురించి అనిరుధ్ రెడ్డి మాట్లాడారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాలు ఉండగా ఆ జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని తెలిపారు. 13 మండలాలు ఉన్న జోగుళాంబ గద్వాల, నారాయణ పేట జిల్లాల్లో కూడా ఒక్కో రెవెన్యూ డివిజన్ ఉండగా 17 మండలాలు, 306 రెవెన్యూ గ్రామాలు కలిగిన మహబూబ్ నగర్ జిల్లాలో కేవలం ఒకే ఒక్క రెవెన్యూ డివిజన్ ఉందని చెప్పారు.
6.43 లక్షల ఎకరాల భూమి, 10.12 లక్షల జనాభా కలిగిన మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క రెవెన్యూ డివిజనే ఉండటంతో ప్రజలు, అధికారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. తమ జిల్లా పరిధిలోని బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల తదితర మండలాలు 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్నాయని, జడ్చర్ల అటు 44వ నెంబర్ జాతీయ రహదారి, ఇటు 167 వ నెంబర్ జాతీయ రహదారులకు కూడలిగా ఉందని చెప్పారు.
జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని ఊర్కొండ మండలాన్ని నాగర్ కర్నూల్ డివిజన్ పరిధిలోకి చేర్చి తమ జడ్చర్లకు అన్యాయం చేసారని అభిప్రాయపడ్డారు.ఈ నేపథ్యంలోనే రెవెన్యూ డివిజన్ గా అప్ గ్రేడ్ చేయడానికి అన్ని అర్హతలు కలిగిన జడ్చర్లను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని అనిరుధ్ రెడ్డి కోరారు.
అదేవిధంగా రెండు జాతీయ రహదారులకు కూడలి కేంద్రంగా, పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఉన్న జడ్చర్లలో ఆర్టీసీ బస్ డిపోను ఏర్పాటు చేయాలని ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారని గుర్తు చేసారు. జడ్చర్ల నియోజకవర్గానికి అటు ఇటు గా ఉన్న కల్వకుర్తి, మహబూబ్ నగర్ లలో బస్ డిపోలు ఉన్నాయని, అయితే అన్ని వసతులు కలిగిన జడ్చర్లలో బస్ డిపోను కూడా ఏర్పాటు చేయాలని అనిరుధ్ రెడ్డి చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని మంత్రి కొండా సురేఖ ప్రకటించారు.