calender_icon.png 31 October, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతును ముంచిన మొంథ తుఫాన్

30-10-2025 04:31:14 PM

కరీంనగర్ జిల్లాలో భారీ నష్టం

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో మొంథ తుఫాన్ రైతును నిలువునా ముంచింది. చేతికి వచ్చిన పంట వరదనీటిలో కొట్టుకుపోగా, కోతకు వచ్చిన పంట నీట మునిగింది. కరీంనగర్ జిల్లాలో 183 గ్రామాల పరిధిలోని 3,321 మంది రైతులకు సంబంధించిన 3,512 ఎకరాల్లో పత్తి చేన్లు తడిసి ముద్దయ్యాయి. ఇందులో అత్యధికంగా కొత్తపల్లి మండలంలో 1200 ఎకరాల్లో, ఇల్లందకుంటలో 300, జమ్మికుంటలో 200, సైదాపూర్లో 324 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది.

జిల్లాలోని 15 మండలాల్లో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 26,441 మంది రైతులకు సంబంధించి 30,560 ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. మండలాల వారీగా చూస్తే హుజురాబాద్లో 3959, సైదాపూర్లో 4123, ఇల్లందకుంటలో 1200, జమ్మికుంటలో 1400, వీణవంకలో 1650, శంకరపట్నంలో 2100, మానకొండూర్ 3800, తిమ్మాపూర్ 240, చిగురుమామిడిలో 3383, గన్నేరువరంలో 1740, కరీంనగర్ రూరల్ మండలంలో 2055, కొత్తపల్లిలో 2500, చొప్పదండిలో 550, రామడుగులో 175, గంగాధరతో 1650 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. మొక్కజొన్న చొప్పదండి మండలంలో 50 ఎకరాల్లో దెబ్బతింది. మొంథ తుఫాన్ కు సంబంధించి రైతాంగం అరబెట్టిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా అష్టకష్టాలు పడ్డా ఫలితం లేకుండా పోయింది.

తడిసిన 11644 క్వింటాళ్ల ధాన్యం...

భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తీసుకువచ్చిన వరిధాన్యం బస్తాలు తడిసిపోయాయి. చాలా చోట్ల రైతులు రోడ్ల వెంట ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. అధికారుల అంచనా ప్రకారం కరీంనగర్ జిల్లాలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో 4684 క్వింటాళ్లు, డీసీఎంఎస్ కేంద్రాల్లో 6690 క్వింటాళ్లు, హకా పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో 270 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. మొత్తం 11,644 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది.