19-01-2026 01:01:49 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగానే శనివారం జరిగిన ఐపీఎస్ బదిలీల్లో వ్యూహాత్మకంగా క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్న యువ ఐపీఎస్ అధికారులను ఎంపిక చేసి, వారికి ట్రాఫిక్ పగ్గాలు అప్పగించారు.
అవినాష్ కుమార్ కొత్తగూడెం నుంచి వచ్చి హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-1గా ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు బాధ్యతలు చేపట్టనున్నారు. కాజల్ ఉట్నూరు నుంచి వచ్చి హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2గా గోల్కొండ, జూబ్లీహిల్స్ జోన్లు వ్యవహరించనున్నారు. శేషాద్రినిరెడ్డి.. జగిత్యాల నుంచి సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2గా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు రానున్నారు. కంకనాల రాహుల్ రెడ్డి.. వనగిరి నుంచి మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ-1గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక దృష్టి
కొత్తగా రూపుదిద్దుకుంటున్న ప్రతిష్ఠాత్మక ఫ్యూచర్ సిటీలోనూ ట్రాఫిక్ వ్యవస్థను ఇప్పటి నుంచే బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. రైల్వేస్ డీఐజీగా ఉన్న జి. చందనా దీప్తిని ఫ్యూచర్ సిటీ అడ్మిన్ , ట్రాఫిక్ అదనపు సీపీగా నియమించగా, ములుగులో పనిచేస్తున్న యువ అధికారి శివం ఉపాధ్యాయను అక్కడి ట్రాఫిక్ డీసీపీగా నియమిం చారు. యువకులతో పాటు అనుభవజ్ఞులైన అధికారులకు కూడా ట్రాఫిక్ విభాగంలో కీలక బాధ్యతలు దక్కాయి. బీకే రాహుల్ హెగ్డేను హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3 చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ గా, రంజ న్ రతన్ కుమార్ను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-1 శేర్లింగంపల్లి గా నియమించారు.
అక్రమాలకు చెక్
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా, ఇతర అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో డీఐజీగా అభిషేక్ మహంతిని నియమించారు. మొత్తంగా ఈ బదిలీల ద్వారా ఓవైపు శాంతిభద్రతలు, మరోవైపు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని సీఎం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.