19-01-2026 12:37:59 AM
నూతనకల్, జనవరి 18 : ఇటీవల వీధి కుక్కల బెడద ఎక్కువవుతుంది. వీధుల వెంట సంచరిస్తూ బాటసారుల పిక్కలు పట్టి పీకేస్తున్నాయి. దీంతో వీధి కుక్కలు అంటేనే ప్రజలు జంకుతున్నారు. ఈ పరిస్థితి నూతనకల్ మండలంలో సైతం నెలకొంది. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది.వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళ నకు గురిచేస్తున్నాయి.
గత నెల రోజుల్లోనే సుమారు 35 మందికి పైగా కుక్క కాటుకు గురై స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు రికార్డులు చెబుతున్నాయి. పెన్షన్ కోసం పోస్టాఫీసులకు వెళ్లే వృద్ధులపై కుక్కలు దాడి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇళ్లకు కాపలా ఉండాల్సిన కుక్కలు, పగటిపూట వీధుల్లో బాటసారులపై విరుచుకుపడుతున్నాయి.సూర్యాపేట - దంతాలపల్లి ప్రధాన రహదారిపై కుక్కలు అడ్డంగా రావడంతో ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయపడుతున్నారు.
ఇటీవల జరిగిన ఘటనలు
మాచనపల్లి గ్రామానికి చెందిన స్వామి లింగం అనే వ్యక్తి తన వ్యవసాయ పనుల నిమిత్తం వెళుతుండగా వీధి కుక్కలు వెంబడించి ముకుమ్మడిగా దాడి చేసి గాయపరిచాయి.అది మరువక ముందే మిర్యాల గ్రామం లో నాలుగు రోజుల క్రితం పాఠశాలకు వెళుతున్న ఎనిమిదేండ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.అంతే కాకుండా ఏడు నెలల క్రితం కుక్కల గుంపు దాడి చేయడంతో తాళ్లసింగారం గ్రామంలో సుమారు 50 గొర్రెలు మృతి చెందిన ఘటనను గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు.
మండల కేంద్రంతో పాటు మాచనపల్లి, లింగంపల్లి, చిల్లకుంట్ల, దిర్యానపల్లి, బిక్కమళ్ల, మిర్యాల, వెంకేపల్లి, తాళ్లసింగారం వంటి గ్రామాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విక్ ఇప్పటికైనా వాటి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
వీధికుక్కల నియంత్రణకు చర్యలు చేపడతాం: ఎంపీవో శశికళ
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే వీధికుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చూస్తాము.
కుక్కల బెడద నుండి కాపాడాలి
గ్రామాల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులు, పశువుల పైన దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కుక్కల బెడద నుండి తమను రక్షించాలి.
జాల మహేష్, రైతు, మిర్యాల