22-12-2025 02:15:56 AM
సురేశ్ ప్రొడక్షన్స్ డీ సురేష్‌బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్’. పతంగుల పోటీ నేపథ్యంలో రాబోతున్న ఈ యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామాను సినిమాటిక్ ఎలిమెంట్స్, రిషన్ సినిమాస్, మాన్‌సూన్ టేల్స్ పతాకాలపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేశ్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తోపాటు వంశీ పూజిత్ ముఖ్యతారాగణంగా ఉన్నారు. పాపులర్ దర్శకుడు నటుడు గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రముఖ సింగర్, నటుడు ఎస్‌పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు.
ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోందని పేర్కొంటూ మేకర్స్ ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వంశీ పూజిత్ మాట్లాడుతూ.. “ట్రైలర్‌లో వున్న పాజిటివ్ వైబ్ సినిమాలో కూడా ఉంటుంది. సినిమాలో పతంగ్ పోటీల సీజీ కూడా వరల్డ్‌క్లాస్ లెవల్‌లో ఉంటుంది” అన్నారు. ప్రీతి పగడాల మాట్లాడుతూ “పతంగ్‌లో నేను నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ట్రైలర్ మ్యాజిక్ చేసింది. ట్రైలర్ నచ్చిన అందరికి సినిమా కూడా నచ్చుతుంది” అన్నారు. ప్రణవ్ కౌశిక్ మాట్లాడుతూ.. “కైట్స్ స్పోర్ట్స్ డ్రామాను తీయడం అంత ఈజీ కాదు. ట్రైలర్ చూసి విమర్శించిన వాళ్లు కూడా ప్రశంసించారు. తప్పకుండా ఆడియన్స్ మమ్ములను ఆదరిస్తారని కోరుకుంటున్నా” అన్నారు. ‘పతంగ్ రోలర్ కోస్టర్‌లా మా సినిమా నిర్మాణం కూడా జరిగిందని, పతంగ్ జర్నీ గ్రేట్ జర్నీ’ అని నిర్మాత విజయ్‌శేఖర్ అన్నే తెలిపారు.
సురేశ్ కొత్తింటి మాట్లాడుతూ “డీలే అయినా ఓ మంచి క్వాలిటీ సినిమా తీశామనే నమ్మకం ఉంది” అన్నారు. నిర్మాత రమ్య మాట్లాడుతూ “ఈ సినిమా కంటెంట్‌ను నమ్మి నేను ఈ సినిమాతో అసోసియేట్ అయ్యాను. ఫెస్టివ్ మూడ్‌కు సెట్ అయ్యే సినిమా అని అందరూ అంటున్నారు. చిన్న సినిమాకు ఉండాల్సిన కష్టాలు ఈ సినిమాకు ఉన్నాయి. ప్రతి రోజు ఓ కొత్త చాలెంజ్‌ను ఫేస్ చేస్తున్నాం. సినిమా చూసిన అందరూ సినిమా గురించి ఎంతో ప్రశంసిస్తున్నారు. తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుందని నమ్మకం ఉంది” అన్నారు. మరో నిర్మాత సంపత్ మకా మాట్లాడుతూ ‘మా సినిమా ఈ సంవత్సరం విడుదలై విజయం సాధించిన మంచి చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందనే విశ్వాసం వుంది’ అన్నారు. ఈ సమావేశంలో మరో నిర్మాత నాని బండ్రెడ్డి కూడా పాల్గొన్నారు.