calender_icon.png 30 October, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతల గుండెల్లో తుఫాన్!

30-10-2025 01:38:55 AM

  1. ముంచెత్తిన వర్షం, కన్నీరు పెట్టిస్తున్న నష్టం
  2. ఒరిగిన వరి, నెలపాలైన పత్తి, మిర్చి  

విజయక్రాంతి నెట్‌వర్క్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రెక్కలు ముక్కలు చేసుకొని పంటలను సాగు చేసిన అన్నదాతల ఆశలు నేలవాలిపోయాయి. చేతికొచ్చిన పంట నొటికి దక్కకుండా మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షం కర్షకుల కష్టాన్ని  నడ్డివిరిచింది. దీంతో వారి కష్టం నీటిపాలైంది. కష్టాలే సాగుబడిలో కన్నీళ్లే దిగుబ డిగా మిగిలాయి.

కళ్ల ముందే విలు వైన పంట నీటి పాలవుతుంటే చేసేది లేక, వరుణ దేవుడా నష్టాలను భరించే శక్తి తమకు లేదంటూ వేడుకున్నారు. కోతకొచ్చిన వరి అనేక ఎకరాల్లో నేలవారింది. మార్కెట్‌యార్డుల్లో అమ్మకానికి తీసుకెళ్లిన ధాన్యం తడిసి ముద్దయింది. రాసుల చుట్టూ చేరిన నీటిని తొలగించడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. 

ఖమ్మం జిల్లాలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో వర్షం ప్రభావంతో అనేక మం డలాలలో పత్తి, వరి పంటలు, మిర్చి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మణుగూరు, అశ్వాపురం మండలంలో 13,818 ఎకరాల్లో పత్తి, 18,270 ఎకరాల్లో వరి సాగైంది. కానీ మండలంలో వర్షానికి పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. వందల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. తిర్లాపురం, అన్నారం, ధమ్మక్కపేట, విజయనగరం, పగిడేరు  గ్రామాల్లో ఈదురు గాలులతో వర్షం పడటంతో కోతకచ్చిన వరిపంటలు నేల కొరిగాయి.

మెదక్ జిల్లాలో

మంజీరా నీటి ఆధారంగా ధాన్య భాండాగారంగా పేరొందిన మెతుకు సీమలో వర్షాల రూపంలో రైతులకు కన్నీరు తెప్పిస్తుంది. తుఫాను కారణంగా అకాల వర్షాల తో కొల్చారం మండలంలో వరి పంట తడిసిపోయి నష్టాన్ని కలిగిస్తుంది.  గత మూడు రోజులుగా తుఫాను ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రైతులు కోసి కల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం అక్కడికక్కడే మొలకలు వేస్తోంది.

కొల్చారం మండలంలోని సంగాయిపేట, వరిగుంతం, రంగంపేట, చిన్నఘనపూర్, పైతర, పోతిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో తీవ్రంగా ప్రభావం పడింది. పంట చేలల్లో వందల ఎకరాల్లో నీరు నిలిచిపోయి, నిలువునా మొలకలు వస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ధాన్యం రాశులు కుళ్లిపోతున్నాయం టూ బాధ వ్యక్తం చేస్తున్నారు. ఆపత్కాలంలో రైతులకు మార్గదర్శనం చేసి నష్టాలను తగ్గించే చర్యలు సూచించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా..

కొల్చారం మండల వ్యవసాయ అధికారి రైతులు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంజీరా ఉధృతి కారణంగా గత రెండు నెలల్లో పరివాహక గ్రామాలైన ఎనగండ్ల, వైమాందాపూర్, కోనాపూర్, తుక్కాపూర్ తదితర ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల వరకు పంటనష్టం జరిగినా.. కేవలం 50 ఎకరాలే నష్టం అని తప్పుడు నివేదిక ఇచ్చి రైతులను నట్టేట ముంచారని మండిపడుతున్నారు.

కామారెడ్డి జిల్లాలో 

కామారెడ్డి జిల్లాలో తుఫాన్ వర్షం బీభత్సానికి కల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్ద అయ్యింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజిలో ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. భిక్కనూర్, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, లింగంపేట్, దోమకొండ బిబిపేట్, గాంధారి, మండలాల్లో, గ్రామాల్లో కల్లాలలో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. అమ్మ డానికి తెచ్చిన  ధాన్యం రైతుల కళ్ళముందే కొట్టుకపోవడం తో  రైతుల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

నల్లగొండ జిల్లాలో

నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పంట పొలాలు నీట మునిగాయి. అసలే అకాల వర్షాల ధాటికి దెబ్బతిన్న పత్తి చేన్లు గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో ఎందుకూ పనికిరాకుండాపోయాయి. కోత దశకు వచ్చిన వరి పొలాలు నేలకొరిగాయి. ఇప్పటికే కోతలు పూర్తి చేసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసుకున్న వడ్ల రాసులు నీటి మునిగాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు వర్షపు నీటితో మునిగి చెరువుల్లా తలపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలోని పలుచోట్ల వరి పొలాలు చివరి దశలో ఉండగా అవి వందల ఎకరాల్లో నేలకొరిగాయి. దీంతో రైతులకు భారీగా నష్టం వాటిలే అవకాశం ఉంది. లోతట్టు రా ఉన్న వరి పొలాలు నీట మునిగిపోయాయి.

పలు జిల్లాల్లో పంటల నష్టం 

మొంథా తుపాను ప్రభావంతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పైర్లు నేలవాలాయి. కోత కోసి రాశులుగా పోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. హుజురాబాద్, కరీంనగర్ మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొట్టుకుపోయింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో వర్ష తీవ్రత కారణంగా వరి, మొక్కజొన్న, జొన్న, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

మరి కొంతమంది రైతులు పత్తిని పంట నుండి తీసి ఇంట్లో భద్రపరచుకున్నప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షానికి ఇంట్లో ఉన్న పత్తి కూడా తడిసి ముద్దయింది. కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్ నియోజక వర్గంలోని పలు మండలాల్లో వరి, పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. రంగారెడ్డి జిల్లాలో పత్తి పంట పూర్తిగా దెబ్బ తినడంతో పాటు కల్లాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. 

మొంథా ఎఫెక్ట్.. నేలకొరిగిన వరి

  1. యాజమాన్య పద్ధతులతో నష్టాన్ని నివారించుకోండి
  2.  వరి పైరు జడలు కట్టుకోవాలి
  3. పొలాల్లో నీరు నిల్వకుండా కాల్వలు తీయాలి
  4. రైతులకు గడ్డిపల్లి కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ నరేశ్ సూచన

సూర్యాపేట, అక్టోబర్ 29 (విజయక్రాంతి) : మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంట చేలల్లో నీరు నిల్వ ఉండడంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరిపైరు వేల ఎకరాల్లో నేలకొరగడంతో రైతులకు ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అది బాడువ పొలమైతే నష్టం మరీ ఎక్కువగా ఉంటుంది.ఆ పొలాల్లో రైతులు యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చని గడ్డిపల్లి కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ దొంగరి నరేశ్ సూచిం చారు.

నేలకొరిగిన వరిలో పాటించాల్సిన మెలకువలను ఆయన తెలిపారు. వరి పంట ప్రస్తుతం దాదాపు కోత దశకు చేరుకున్నది. అయితే ఈ దశలో గాలి, వాన కారణంగా వరి పంట నేలకొరిగింది. రైతులు పొలాల్లో వరిపైరును జడలు కట్టాలపి సూచించారు. అలాగే  పొలాల్లో గింజలు నేలకు తాకితే కాల్వలు తీసి నీటిని బయటకు పంపించి అర బెట్టాలి. లేకుంటే గింజలు మొలకెత్తి గింజలు నల్లగా మారుతాయి. దాంతో రైతులకు మార్కెట్‌లో ధర తగ్గుతుంది.

పాలంలో తేమ ఉంటే 2 శాతం ఉప్పు ద్రావణం పొలంపై పిచికారీ చేయాలి. లీటర్ నీటిలో 2 గ్రాముల ఉప్పు కలిపి పిచికారీ చేయడం ద్వారా మొలకెత్తే గింజశాతం తగ్గించుకోవచ్చు.. రైతులు తడిసిన ధాన్యం కోత కోస్తే క్వింటా ధాన్యానికి కిలో ఉప్పు కలిపి అరబెట్టాలి. దీని ద్వారా మొలకెత్తే శాతం తగ్గించుకోవచ్చు. జాగ్రత్తలతో నష్టాన్ని తగ్గించుకోవచ్చు ఇటీవల కురిసిన వానలకు వందల ఎకరాల్లో వరి పొలాలు నేలకొరిగాయి.

రైతులు వాటిని అలాగే వదిలేస్తే గింజలు సరిగా ఏర్పడక తాలుగా మారుతాయి. అప్పటికే గింజ పోసుకున్నది నల్లగా మారుతాయి. అందుకే రైతులు పంట మొక్కలు నేలకొరగగానే పొలంలో కాల్వలు తీసి వాటి ద్వారా నీటిని బయటకు పంపించాలి. తేమ ఎక్కువగా ఉంటే పొలంలో ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. జాగ్ర త్తలు పాటించడం ద్వారా రైతులు సాధ్యమైనంత వరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చునని నరేశ్ సూచించారు.