30-10-2025 01:57:35 AM
‘మొంథా’ ప్రభావంతో నగరంలో కుండపోత
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): మొంథా తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ నగరంపై వరుణుడు విరుచుకుపడ్డాడు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమై చెరువులను తలపించగా, ప్రధాన కూడళ్లన్నీ కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయిన వాహనాలతో స్తంభించిపోయాయి.
నగరవాసులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడ్డారు. గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్‌రాంగూడ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాలతో పాటు ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి వంటి నగరంలోని నలుమూలలా భారీ వర్షం నమో దైంది. రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, అత్తాపూర్ ప్రాంతాలను దట్టమైన ముసురు కమ్మేసింది.
అనేక లోతట్టు ప్రాంతాలు, బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లడంతో మురుగునీరు రోడ్లపైకి చేరింది. మలక్‌పేట మెట్రో స్టేషన్ పరిసరాలు పూర్తిగా నీట మునిగిపోవడంతో దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చే వాహ నాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కూకట్‌పల్లి, జేఎన్టీయూ నుంచి హైటె క్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్, కేబుల్ బ్రిడ్జి, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ వరకు వాహనాలు నత్తనడకన కదిలాయి. సికింద్రాబాద్, అల్వాల్ రైతుబజార్, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, కొండాపూర్ లలో నూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వర్షంలోనే జీహెచ్‌ఎంసీ, హైడ్రా కమిషనర్ల పర్యటన
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం వర్షంలోనే క్షేత్రస్థాయిలో పర్యటించారు. లకిడికాపూల్ ప్రాంతంలో పర్యటించి, భారీగా నిలిచిన వరద నీటిని, దానివల్ల తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిశీలించారు. మాసబ్ ట్యాంక్ నుంచి లకడికాపూల్ వైపు వచ్చే మార్గంలో, మెహిదీ ఫంక్షన్ హాల్ వద్ద రహదారిపై నీరు నిలవడానికి గల కారణాలను ఇరువురు కమిషనర్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇక్కడ కొత్తగా రెండు ఫీట్ల పైపులైన్లను ఏర్పాటు చేశామని, వీటికి చింతలబస్తీ, మహావీర్ ఆసుపత్రి పరిసరాల నుంచి వచ్చే వరద, మురుగు నీటిని అనుసంధానించాల్సి ఉందని అధికారులు వివరించారు. తక్షణ ఉపశమనం కోసం, మహావీర్ ఆసుపత్రి నుంచి మెహిదీ ఫంక్షన్ హాల్ వరకు ఉన్న పైపులైన్లలో పేరుకుపోయిన మట్టిని, పూడికను వెంటనే తొలగించాలని ఆదేశించారు.
అప్రమత్తమైన జలమండలి
నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఎలాంటి ప్రజా ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, అత్యవసర స్పందన బృందాలు ఈఆర్‌టీ క్షేత్రస్థాయిలో నిరంతరం అందుబాటులో ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, పలు కీలక సూచనలు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఈఆర్‌టీ బృందాలు, ఎస్పీటీ వాహనాలు నిరంతరం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
సీవరేజ్ ఓవర్‌ఫ్లో మ్యాన్‌హోళ్లను గుర్తించి, తక్షణ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ నగరంలోని ఎస్.ఆర్.నగర్, వెంకటగిరి, యూసుఫ్‌గూడ ప్రాంతాలలో ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. లో-ప్రెషర్ ఫిర్యాదులపై చర్చించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలు ఉంటే జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.