30-10-2025 01:21:22 AM
హైదరాబాద్, అక్టోబర్ 29(విజయక్రాంతి) : తెలంగాణ క్యాబినెట్ విస్తర ణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మాజీ ఎంపీ, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా కోరింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇవ్వడంతో.. హైదరాబాద్ జిల్లా, అందులో మైనార్టీ కోటా కూడా భర్తీ అవుతుందని, తద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు మైనార్టీ ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్లించుకునేందుకు అవకాశం ఉం టుందనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, అజారుద్దీన్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
గతంలో గవర్నర్ కోటాలో ఎంపికైన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, అమీర్‌అలీఖాన్ పదవులను సుప్రీంకోర్టు గత ఆగస్టులో రద్దు చేసింది. తిరిగి ఇదే కోటాలో కోదండరామ్ పేరుతో పాటు అజారుద్దీన్ పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అజారుద్దీన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీ ఓటర్లను ఆకర్షించేలా వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన ఈ ఉప ఎన్నికలోనూ టికెట్ ఆశించారు. పార్టీ అధిష్ఠానం మాత్రం అజారుద్దీన్ తప్పించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి.. ఎమ్మెల్యే టికె ట్ నవీన్ యాదవ్‌కు ఇచ్చింది.
ఇప్పుడు ఏకం గా అజారుద్దీన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవాల ని నిర్ణయం తీసుకోవడంతో మైనార్టీ ఓట్లను మెజార్టీగా తిప్పుకోవడానికి అవకాశం ఉం టుందని, తద్వారా గులాబీ పార్టీకి భారీగానే డ్యామెజ్ అవుతుందనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాకుండానే నందమూరి హరికృష్ణ, తన్నీరు హరీశ్‌రావులు మంత్రులుగా ప్రమాణస్వీకా రం చేశారు.
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత 6 నెలలలోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. హరీశ్‌రావు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కొనసాగారు. హరికృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేయకపోవడం తో మంత్రి పదవికి రాజీనామా చేశారు.
అజారుద్దీన్‌కు ఏ శాఖ..?
ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయకముందే ఆయన్ను క్యాబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణ యించింది. అయితే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేస్తే.. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ప్రస్తుతం హోంశాఖ, విద్యా శాఖ, మున్సిపల్ వంటి కీలక శాఖలున్నాయి. వీటిలో ఏ శాఖలు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. ఒక వేళ మైనార్టీ శాఖ కేటాయించాలనుకుంటే ప్రస్తుతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వద్ద ఉన్న ఆ శాఖను అజారుద్దీన్‌కు కేటాయించాల్సి ఉంది. వీటి లో ఏ శాఖలు కేటాయిస్తారనేది ఉత్కంఠంగా మారింది.
బీఆర్‌ఎస్‌కు అజారుద్దీన్ కృతజ్ఞతలు చెప్పాలి
అజారుద్దీన్‌కు మంత్రివర్గంలో చోటు దక్కడానికి బీఆర్‌ఎస్ పార్టీనే కారణమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మైనార్టీలు లేకుండా రాష్ట్ర మంత్రివర్గం ఎప్పుడూ లేదని, ఆ పరిస్థితి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలోనే ఉందంటూ బీఆర్‌ఎస్ పార్టీ విమర్శలు చేసింది. జూబ్లీహిల్స్‌లో ముస్లింల ఓట్లు కీలకం కావ డం, ఒక వేళ బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శల వల్ల మైనార్టీ ఓట్లకు గండిపడితే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన కాంగ్రెస్, అజారుద్దీన్‌కు క్యాబినె ట్‌లో స్థానం కల్పిస్తోందని పరిశీలకు లు అంటున్నారు. అందుకే అజారుద్దీన్ బీఆర్‌ఎస్‌కు కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుందని రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
మిగతా రెండు బెర్తుల భర్తీ ఎప్పుడు..?
కాగా, మంత్రివర్గంలో ఇంకా మూడు బెర్తులు ఖాళీగా ఉండగా, అందులో ఒకటి మైనార్టీ కోటాలో అజారుద్దీన్‌కు కేటాయించబోతున్నారు. మిగతా రెండు బెర్తులకు ఎప్పుడు మూహూర్తం ఉంటుందనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు క్యాబినెట్‌లో ప్రాతినిథ్యం లేదు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మైనార్టీ కోటాలో అజారుద్దీన్ అవకాశం ఇస్తుండటంతో.. ఖాళీగా ఉన్న మిగతా రెండు బెర్తులు ఎప్పుడు భర్తీచేస్తారు..?
ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ రెం డు బెర్తుల కోసం నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మధన్‌మోహన్‌రావు, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డితో పాటు ఉమ్మడి నల్లగొండలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ పడుతున్నారు.