30-10-2025 01:27:16 AM
నలుగురు కూడినకాడ గుప్పుమంటున్న గుసగుసలు
రేవంత్‌రెడ్డి సర్కారుపై పెరుగుతున్న అసంతృప్తి
* తెలంగాణలో ప్రస్తుతం అటు పరిపాలనాపరంగా, ఇటు రాజకీయంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణిపై భిన్న వాదనలు, అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలకవర్గం, అధికార యంత్రాంగం తీరులో స్పష్టత కరువైందని క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభావం గట్టిగానే ఉందని అనుకుంటున్నప్పటికీ, లోలోపల అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా అధికార యంత్రాంగం, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని సీఎం రేవంత్‌రెడ్డి గ్రహించలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన చుట్టూ ఉన్న కోటరీయే. ఒక రాజకీయ డ్రామాను తలపించేలా.. భ్రమలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన కొనసాగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులపై స్పష్టమైన సమాచారాన్ని అందించాల్సిన అధికారులు, ఉన్నత పోస్టులు కోల్పోతామేమోనని భయంతో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
సలహాదారులున్నా వారు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నారు. వారి సలహాలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడంలేదు. మీడియా కూడా భయం మాటున మౌనంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ అనుకూల కథనాలే రాస్తూ సీఎం, ప్రభుత్వానికి అనుకూల వార్తలను మాత్రమే వండివారుస్తున్నది. కానీ తెలంగాణ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి తీవ్రతను గమనించి, దానికి గళమిచ్చి ‘విజయక్రాంతి’ అందిస్తున్న కథనం ఇది..
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా పాలకులకు పరిపాలనపై స్పష్టత రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఏ దిశ లేకుండా నడుస్తోందని సచివాలయ వర్గాలు అభిప్రాయపడుతు న్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరంతర ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజల్లో కొంత ఆదరణ పొం దింది.
ఆయా పథకాల అమలు ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజల మనసులు గెలుచుకుంది. కానీ తర్వాతి కాలంలో విభిన్న పరిస్థితులకు దారితీసింది. ప్రభుత్వ వైఫల్యాలు క్రమంగా పెద్దగా మారాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ అయిన రైతుల రుణ మాఫీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలుకాలేదు. రైతు భరోసా చెల్లింపులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఉద్యోగ హామీలు, సాగు నీటి ప్రాజెక్టులు, గ్యారంటీలన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉండిపోయాయి.
యూరియా కొరత, సరఫరా సమస్య పెద్ద అవినీతి కుంభకోణంగా మారింది. యూరియా పంపిణీలో అవినీతి పెరగడంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఖరీఫ్ పంటలు ఎండిపోతుండగా, బ్లాక్ మార్కెట్ దళారులు కోట్లలో సంపాదించారు. ఇక సన్నాల కొనుగోలు గందరగోళం కూడా రైతుల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయకపోవడంతో సన్న వడ్లు పంట పొలాల్లోనే మగ్గుతున్నది. దీంతో రైతుల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతున్నది.
ఉద్యోగులు, విద్యార్థులకు ఇచ్చే చెల్లింపులు కూడా దీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిపై మంత్రులు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. దీంతో ‘తాము సీఎంతోనే మాట్లాడుతామంటూ’ ఉద్యోగుల నుంచి డిమాండ్‌లు పెరుగుతున్నాయి. ఇది పాలనా వ్యవస్థ వైఫల్యానికి అతి పెద్ద నిదర్శనం. కళాశాలల్లో విద్యార్థులు నిరసనలు తెలుపుతూ రోడ్ల పైకెక్కి బోర్డులతో ఆందోళనలు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డిపై గట్టి విశ్వాసంతో.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కీలక పాత్ర పోషించిన యువత ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నది.
అయోమయంలో అధికార యంత్రాంగం..
ప్రభుత్వ వ్యవస్థలో పూర్తిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయోమయంలో ఉన్నారు. ఒకవైపు సీఎంవో ఆదేశాలు, మరో వైపు మంత్రుల నుంచి అభ్యర్థనల మధ్య ‘సీఎం వో ఆదేశాలే ముందు’ అనే విధంగా అధికారులు పనిచేస్తున్నారు. దీంతో మంత్రుల సిఫార్సులు, ఫైళ్లలోనే అడుగున పడిపోయి, వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల నుంచి అధికారులు కూడా తెలివిగా తప్పించుకుంటున్నారు.
‘ఈరోజు నేను అందుబాటులో లేను సర్’ అంటూ బయటపడుతున్నారు. ఇక అవినీతి విషయానికి వస్తే, అది ప్రతి శాఖలోనూ ఇమిడిపోయి ంది. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులకు రెండు నుంచి మూడు లక్షల లంచం సాధారణ వ్యవహారమైంది. భూమి సమస్యలు, బిల్లులు విడుదల, కాంట్రాక్టుల వంటివి అన్ని పర్సంటేజీలపై నడుస్తున్నాయి.
టీడీపీ నాయకులకు దగ్గరగా ఉన్నవారికి ఎర్ర తివాచీ, బీజేపీ పేరుతో వచ్చినా కూడా ప్రభుత్వ తలుపులు సులువుగా తెరుచుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. పెద్ద కాంట్రాక్టులన్నీ ఎక్కువగా ఆంధ్ర కాంట్రాక్టర్లకే వెళ్తున్నాయి. స్థానిక తెలంగాణ కాంట్రాక్టర్లు తగిన ప్రాధాన్యత లభించడం లేదు. దీంతో విసిగి పోయిన ఒక బిల్డర్ ‘ఇప్పుడు తెలంగాణ.. ఆంధ్ర వ్యాపారవేత్తల ఆట స్థలం అయిపోయిందని’ విమర్శించారు.
రేవంత్‌రెడ్డి మాటల గందరగోళం..
ఇటీవల కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక్కో సందర్భంలో రాబోయే పదేళ్లు తానే సీఎంగా ఉంటానని చెబుతారు. మరొక సందర్భంలో తాను బీసీ వర్గానికి పక్షపాతిని అని, భవిష్యత్‌లో బీసీ వర్గానికి చెందిన వ్యక్తే సీఎంగా ఉంటారని వ్యాఖ్యలు చేయడం పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. దీంతో ప్రజల్లో అయోమయం, పార్టీ లోపల గందరగోళం పెరుగుతోంది. ఇవన్నీ గమనిస్తున్న సామాన్యులు ‘రేవంతన్న.. నువ్వు సీఎంగా ఉంటావా లేక వెళ్తావా’ అని ప్రశ్నిస్తున్నారు.
దీనికితోడు కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. పార్టీ సీనియర్ నేతలను పక్కనబెట్టి, ఐఏఎస్, ఐపీఎస్, జిల్లా కలెక్టర్ల నియామకాల వంటి అన్ని కీలక నిర్ణయాలను సీఎం రేవంత్‌రెడ్డి తన చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో రేవంత్ మంత్రివర్గంలోని మంత్రి స్పందిస్తూ ‘ఇది కాంగ్రెస్ రాజ్యం కాదు, రేవంత్ రాజ్యం’ అని తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అధికారమంటూ లేక డమ్మీలుగా మిగిలిన మంత్రులు కోపంతో రగిలిపోతున్నారు. పరిపాలనలో ఉత్సాహం తగ్గిపోవడంతోపాటు వేసవిలో గోదావరి ఎండిపోయినట్టు కేబినెట్‌లో మానసిక స్థుర్యైం దెబ్బతిన్నది.
బీఆర్‌ఎస్-బీజేపీ కలయికే ప్రత్యామ్నాయం..
ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మారుతోంది. అన్ని పార్టీల కలిపి ఖర్చు సుమారు రూ. 300 కోట్లకు పైగా ఉం టుందని అంచనా వేస్తున్నారు. బీఆర్‌ఎస్ తెలివైన వ్యూహాలతో ముస్లిం ఓట్లను విభజించగలిగింది. కాంగ్రెస్ గట్టిగా పోటీ చేస్తూనే ఉంది. కానీ సానుభూతి ఓట్లు, రియల్ ఎస్టేల్ ధరల తగ్గుదల, తమ అభ్య ర్థి ‘రౌడీ ఇమేజ్’ కారణంగా కాస్త వెనుకబడి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి.
ఇక కాంగ్రెస్ అంతర్గత పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. అయితే ‘పార్టీ ఓడితేనే హైకమాండ్ తెలంగాణలోని ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేస్తుందని’ అని అనుకుంటూ కొందరు మంత్రు లు లోలోపల ఓటమి కోసం ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. హైక మాండ్ కూడా రేవంత్‌రెడ్డిపై నమ్మకం కోల్పోతున్న నేపథ్యంలో జిల్లాల నేతలను నేరుగా కలుస్తూ, సీఎంను పక్కనబెడుతోంది. నిధుల కొరతతో ప్రభుత్వ ప్రధాన పథకాలు సరిగ్గా అమలు కావడంలేదు.
దీంతో ప్రజల్లో అసంతృప్తి, ఉద్యోగుల్లో నిరాశ, పార్టీ లోపల అసహనం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావడం కష్టమే అని అభిప్రాయం వ్యక్తమవుతుంది. నాయకులు, ప్రజాప్రతి నిధులు ‘అధికారంలో ఉన్నంత కాలం సంపాదించుకుం దాం’ అనే ఆలోచనలో పడ్డారని అంటున్నారు. మొత్తంగా తెలంగాణలో తర్వాత ఎవరు అధికారం చేపడతారనే ‘బీఆర్‌ఎస్-బీజేపీ కలయికే పరిష్కారం కావచ్చు’ అనే చర్చ తెర మీద కు వచ్చింది.
రాష్ట్రంలో బీజేపీ ఇప్పటికీ మూడోస్థానంలో ఉన్నప్పటికీ, చివరి క్షణంలో పెద్ద దెబ్బ కొట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌తో చేతులు కలపవచ్చన్న అం చనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిణామాల మధ్య రేవంత్‌రెడ్డి చుట్టూ ఉన్న కోటరి వ్యవస్థ విచ్ఛిన్నం అయిన తర్వాత ఆయనకు మిగిలేదేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్‌ఎస్‌ను బలహీనం చేసే కుట్ర
సీఎం రేవంత్‌రెడ్డి కూడా చాలా తెలివిగా రాజకీయాలను నెరపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నారు. ఆయన గోప్యంగా బీఆర్‌ఎస్ మాజీ నేత కవితను ప్రోత్సహిస్తూ, ఆమె ద్వారా బీఆర్‌ఎస్‌ను లోపల నుంచే బలహీనపరచాలని చూస్తున్నారని వాదనలు వెల్లడవుతున్నా యి. కానీ రేవంత్‌రెడ్డి ఈ వ్యూహం ప్రతికూల ప్రభావం చూపుతోంది. కవిత చేసే విమర్శలు నిజమైనా, ప్రజలకు అవి చేదు గా అనిపిస్తున్నాయి.
దీంతో కేటీఆర్, హరీశ్‌రావు లాంటి బీఆర్‌ఎస్ నేతలు పార్టీని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలాఉండగా, రేవంత్‌రెడ్డి తన చుట్టూ తను నమ్మిన నేతలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లతో ఓ బలమైన కోటరిని నిర్మిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ లోపల తిరు గుబాటు జ్వాలలు చెలరేగుతున్నాయి. కనీసం పది మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు.
తెలంగాణ నిధులు కాంగ్రెస్ జాతీయ ఎన్నికల నిధులకు వెళ్తున్నాయనే ఆరోపణలూ వినిపి స్తున్నాయి. ఇక సీఎం పదవి కోసం పోటీపడుతున్న ఐదుగురిలో ఒకరు ఇప్పటికే వెనక్కి తగ్గి రేవంత్ కోసం పనిచేస్తున్నా రు. మరొకరు అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు. మిగిలిన ముగ్గురి ప్రభావం కూడా రోజురోజుకూ తగ్గుతోంది.