30-10-2025 01:46:52 AM
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సినీ కార్మికులకు హామీలు ఇచ్చారని, ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకొని ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డిని బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
ఎన్నికల హామీలు గుప్పించినట్లుగా సినీ కార్మికులకు హామీలు ఇచ్చారని, ఇది చట్టరీత్యా నేరమని అన్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా సీఎం రేవంత్‌రెడ్డిని తొలగించాలని కోరారు. సెంట్రల్ నుంచి ఒక అబ్జర్వర్ తో పాటు, కేంద్ర బలగాలను కూడా ఇక్కడకు తీసుకురావాలని విజ్ఞప్తి చేసినట్టు కోరారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంగుల కమాలకర్ మాట్లాడారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం సభకు సినీ కార్మికుల మెడపై కత్తి పెట్టి బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించారు. అయినా కూడా సభ అట్టర్ ప్లాఫ్ అయిందన్నారు. హాలీవుడ్‌ను తీసుకురావడం కాదు.. ఉన్న సినిమా రంగాన్ని కాపాడితే చాలని హితవు పలికారు. ఈసీ వెంటనే కేంద్ర పరిశీలకులను నియమించడంతో పాటు కేంద్ర బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
రెండేళ్లుగా సినిమా రంగం వారిని భయభ్రాంతులకు గురి చేసిన రేవంత్ రెడ్డికి కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాద్ అనుచరులు దాడులకు పాల్పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఏం చేయాలో అర్థం కాక బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. సీ బృందాన్ని కూడా పట్టించుకోవడం లేదన్నారు.
బీఆర్‌ఎస్ నేతలు వెనక్కి పోరు అని నవీన్‌యాదవ్ అంటుంటే.. ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. సీఎం సభ అట్టర్ ప్లాఫ్ అయిందని, ఓటు వేయాలని బెదిరించి సభకు తీసుకొస్తున్నారని సినీరంగ కార్మికులు చెప్తున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని బస్తీల్లో రాత్రి పూట ఓటర్లు, కాలనీ సంఘాల నేతలు, అపార్ట్‌మెంట్ వాసులను బెదిరిస్తున్నారని ఆరోపంచారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. సినిమా రంగాన్ని రేవంత్‌రెడ్డి ఎలా ఇబ్బంది పెట్టారో అందరూ ఆలోచించుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, నేతలనే బెదిరించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని సూచించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.
బెదిరింపులకు భయపడవద్దు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
సినిమా రంగం వారికి కూడా సీఎం రంగుల కల చూపారని, ఎన్ని హామీలు గుప్పించినా ముఖ్యమంత్రిని ఎవరూ నమ్మరని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. నటులకే అద్భుతమైన సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. సినిమా రంగాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పదేళ్ల పాలనలో సినిమా రంగాన్ని కేసీఆర్ బ్రహ్మండంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.
కానీ సీఎం రేవంత్ మాత్రం కొత్తగా హాలీవుడ్‌ను తీసుకొస్తామని మాయమాటలు చెపుతున్నారని విమర్శించారు. కొత్తగా హాలీవుడ్‌ను తీసుకొచ్చేదేమీ లేదన్నారు. మనకు హాలీవుడ్ అవసరం లేదని, ప్రస్తుతం స్థానికంగా ఉన్న మనవాళ్లని ప్రోత్సహించాలని సూచించారు. మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తేనే ఎన్ని అవకతవకలు జరిగాయో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరూ చూశారని గుర్తు చేశారు.
డివిజన్‌కు ఇద్దరు మంత్రులు ఇన్‌చార్జిలుగా ఉంటూ ఒక మహిళ భర్త కోల్పోయి ఏడుస్తుంటే వక్రీకరించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రోజున కత్తులతో స్వైర విహారం చేయడమే రౌడీలకు టిక్కెట్ ఇచ్చారనడానికి నిదర్శనమన్నారు. జూబ్లీహిల్స్‌లో రౌడీ రాజ్యం తీసుకొచ్చి అందరూ ఇక్కడ నుంచి తరలివెళ్లేలా చేయవద్దన్నారు.
ప్రజలెవరూ బెదిరింపులకు భయపడవద్దని, తమకు అండగా బీఆర్‌ఎస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీనే తెలంగాణను తెచ్చిన పార్టీ, కాపాడుకున్న పార్టీ, హైదరాబాద్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసిన పార్టీ అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.