calender_icon.png 30 October, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు తీర్పును బేఖాతర్ చేస్తున్నారు

30-10-2025 01:53:36 AM

  1. మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు 

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై మెగాస్టార్ ఆగ్రహం 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి):టాలీవుడ్ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత కొంతకాలంగా తనను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు ‘ఎక్స్’ ట్విట్టర్‌లో అభ్యంతరకరమైన, వల్గర్ కామెంట్లతో పోస్టులు పెడుతు న్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ చిరంజీవి ఫిర్యాదు చేశారు.

ఒక ‘ఎక్స్’ హ్యాండిల్ వివరాలను, దయా చౌదరి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలను కూడా తన ఫిర్యాదుకు జోడించారు.ఇటీవల తన అనుమతి లేకుండా ఫొటోలు, వాయిస్‌ను వాణి జ్య ప్రకటనలకు వాడుకోవడం, డీప్ ఫేక్ వీడియోలు సృష్టించడంపై చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో, టీఆర్పీ లు, వాణిజ్య లాభాల కోసం చిరంజీవి పేరు, ప్రఖ్యాతులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇటీవలే పోలీసులను ఆదేశించింది.

అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో, తనపై వ్యక్తిగత దూషణలు, అసభ్యకర పోస్టులు కొనసాగుతున్నా యని పేర్కొంటూ చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసుల తలుపు తట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వేధించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.