30-10-2025 01:07:13 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడగకుండా ఎక్కుపెడుతున్న ప్రభుత్వం!
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిల విడుదల విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) సిద్ధమవుతోంది. ఫీజుల విషయంలో ఇక వెనక్కి తగ్గేదేలేదని అంటున్నది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు వర్సె స్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారింది. ఫీజు బకాయిలను విడు దల చేసే విషయంలో ప్రభుత్వం మొండి గా వ్యవహరిస్తుండటంతో కాలేజీల యాజమాన్యాలు స్వరం పెంచాయి.
అదేస్థాయిలో ప్రభుత్వం సైతం కాలేజీల యాజమాన్యాలను తమ దారిలోకి తెచ్చుకునేందుకు విజిలెన్స్ బాణాన్ని ఎక్కు పెట్టబోతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడగకుండా కాలేజీల్లో తనిఖీలు చేపట్టి బెదిరింపులకు పాల్పడేందుకు సిద్ధమవుతున్నట్లు ‘ఫతి’ నేతలు ఆరోపిస్తున్నారు.
వర్సిటీలకు విజిలెన్స్ లేఖలు?
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎం సీఏ, ఫార్మసీ, డిగ్రీ, పీజీ, బీఈడీ తదితర కాలేజీలన్నీ కలిపి దాదాపు 2,500 ఉం టాయి. అయితే వీరికి 2021-22, 2022 -23, 2023-24, 2024-25తోపాటు ప్రస్తుత 2025-26 విద్యాసంవత్సరానికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాల్సి ఉంటుంది. మొత్తం రూ.10 వేల కోట్లు బకాయిలున్నాయని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ఇందులో గతంలోనే రూ.1,200 కోట్లకు టోకెన్లు జారీచేశారు.
గత నెలలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో రూ.600 కోట్లను దసరాకు, మరో రూ.600 కోట్లను దీపావళి వరకు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. కానీ, అలాచేయకుండా ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయడంతో కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలను నిరవధికంగా బంద్‌కు నిర్ణయం తీసుకు న్నాయి.
పెండింగ్ రూ.900 కోట్లను వెంటనే విడుదల చేయడంతోపాటు, పెండింగ్‌లో ఉన్న రూ.9 వేల కోట్లపై కూడా ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతలను కలిసి మద్దతు కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
అయితే ప్రైవేట్ విద్యాసంస్థల తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాలేజీలపై విచారణకు సిద్ధమవుతున్నట్లుగా సమాచా రం. కాలేజీల్లో సరైనా మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించకుండా రూ.లక్షల్లో ఫీజు లు వసూలు చేస్తున్నారనే భావనలో ప్రభు త్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే కాలేజీల్లో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఇలా తనిఖీలు చేపట్టడం ద్వారా ప్రైవేట్ కాలేజీల విద్యాప్రమాణాలను తెలుసుకోవడంతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై నోరు మెదపకుండా చేయొచ్చని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, జేఎన్టీయూతోపాటు మిగిలిన అన్ని యూనివర్సిటీ వీసీలకు విజిలెన్స్ డీజీ లేఖలు రాసినట్లు సమాచారం.
నిబంధనల మేరకేనా..
ప్రస్తుతం రాష్ట్రంలో మొంథా తుఫాన్ ప్రభావం ఉండడంతో వర్షాలు కురుస్తున్నా యి. వర్షాలు తగ్గుముఖం పట్టాక రెండు మూడు రోజుల్లో కాలేజీల్లో తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని ఏ యూనివ ర్సిటీ పరిధిలోని కాలేజీలకు ఆ యూనివర్సిటీలకు సంబంధించిన అధికారులు తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ తనిఖీల బృం దాల్లో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ క్యాడర్ అధికారులు, ఇద్దరు ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు, రెవెన్యూ శాఖ నుంచి, యూనివర్సిటీ నుంచి అధికారులుండే అవకాశముంది.
వీరు కాలేజీలకు వెళ్లిల్యాబ్‌లు సరిగా ఉన్నాయా? స్టాఫ్, ఫ్యాకల్టీ సరిగా ఉందా? లేదా?, కాలేజీల భవనాల నిర్మాణంలో ఏమైనా నిబంధనలు అతి క్రమించారా? లేదా?, అన్ని సక్రమంగా నిబంధనలు పాటిస్తున్నారా? అని తనిఖీలు చేపడ తారు. కాలేజీల ర్యాంకింగ్‌ను బట్టి ఫీజులు ఉన్నాయా? అదనపు ఫీజులు లాంటివి వసూలు చేస్తున్నారా? అని ప్రతీది విచారణ చేపడుతారు. దీనిపై నివేదికను ప్రభుత్వానికీ సమర్పించే అవకాశముంది.
ఆతర్వాత ప్రభు త్వం ఆయా కాలేజీలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకునే అవకాశముంటుంది. ఇదిలాఉంటే కేసీఆర్ హాయాంలో కాలేజీలపై విజిలెన్స్ తనిఖీలను చేయించారు. అయితే ఆ నివేదిక బయటకు రాలేదు.రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల విషయంలో ఆ నివేదికపై ఆరా తీసి, దానిప్రకార మే ఫీజులు నిర్ణయించాలని అనుకున్నారు.
ఫీజులు అడిగితేనే తనిఖీలా..!
ప్రభుత్వానికి ఫీజు బకాయిలు అడిగితేనే తనిఖీలు గుర్తుకొస్తున్నాయని కాలేజీల మేనేజ్‌మెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కాలేజీ పది, ఇరువై సంవత్సరాలుగా ఉంటున్నాయి. వాటికి ప్రభుత్వమే అనుమతులిచ్చింది. ఇప్పుడు మళ్లీ తనిఖీలను భయపెట్టడం సరైందని కాదనే అంటున్నారు. ఇది ప్రభుత్వానికే మంచిది కాదని హితవు పలుకుతున్నా రు. తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్ట్టీ విద్యార్థులకు నిధులు కేటాయిస్తోంది.
ఆ ఫండ్స్‌లో నుంచైనా తమకు ఇవ్వాలి కదా? అని మేనేజ్‌మెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలను నడిపే పరిస్థితులో లేమంటున్నారు. కాలేజీలు ఇప్పటికే నడపలేక మూతపడే స్థాయిలోకి వెళ్లాయని, తామేమైనా తప్పు చేస్తే తనిఖీలు చేపట్టండి...కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడుగుతున్నామని ఇన్‌స్పెక్షన్ పేరుతో ఇబ్బందులు పెట్టడం ప్రభుత్వానికి సరైంది కాదంటున్నారు. మేము బకాయిలు అడగొద్దా? అని ఓ ప్రైవేట్ కాలేజీ యజమాని తన ఆవేదన వ్యక్తం చేశారు.
కాలేజీలను బ్లాక్‌మేల్ చేయడమే
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాం. విద్యాప్రమాణాలకు అనుగుణంగా విజిలెన్స్ అధికారులు కాలేజీల్లో తనిఖీలు చేపట్టడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ వ్యతిరేకం కాదు. కానీ ఈ తనిఖీ లు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చేపట్టి నిబంధనలకనుగుణంగా ఉన్న కాలేజీలకు అనుమతులివ్వాలి. లేని కాలేజీలకు ఇవ్వొద్దు. కానీ ఇప్పుడు ఫీజులు అడుగుతున్నారని తనిఖీలు చేపట్టడమనేది కాలేజీలను బ్లాక్‌మేల్ చేయడమే. ఫీజులు విడుదల చేయకపోవడంతో చదువులు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లను కాలేజీలు ఇవ్వడంలేదు.
టీ నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి