30-10-2025 01:50:24 AM
విజయక్రాంతి పత్రికలో వచ్చిన కథనాపై ప్రభుత్వం సీరియస్
వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో అవినీతిపై విచారణకు ఆదేశం
ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్, మంత్రి తుమ్మల
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి) : వసూళ్ల దందా.. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో అవినీతి రాజ్యం.. మంత్రి పేరు వాడుకుంటూ కమిటీ కార్యదర్శులకు టార్గెట్ అనే శీర్షికతో విజయకాంత్రి దినపత్రికలో బుధవారం వచ్చిన వార్తకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో దుమారమే రేగింది. సంబందిత శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.
వ్యవసాయ మర్కెటింగ్ శాఖలో అసలేమి జరుగుతోంది..? ప్రజా ప్రతినిధులు పేర్లను వాడుకూంటూ కమీషన్ల పేరుతో వసూలు దండా చేయడమేంటీ..? అని సీరియస్‌గా ఉన్నట్లుగా తెలిసింది. వీటన్నింటిపైన సమగ్రమైన జరిపించాలని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వానికి చెడుపేరు తీసుకొస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
అయితే కమీషన్ల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వరంగల్ రీజియన్‌కు చెందిన సదరు అధికారికి సంబంధించిన వ్యవహారాలపై నిఘా పెట్టాలనే ఆలోచనతో సర్కార్ ఉన్నట్లుగా తెలిసింది. అయితే .. మార్కెటింగ్ శాఖలో జరుగుతున్న వ్యవహారాలను మీడియాకు ఎవరు చెప్పారనే అంశంపై సదరు అధికారి, ఆయన అనుచర వర్గం ఆరా తీసే పనిలో పడినట్లుగా సమాచారం. అయితే సదరు అధికారి బుధవారం ఒక జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లుగా తెలిసింది.