22-01-2026 12:31:17 AM
డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక
పాపన్నపేట, జనవరి 21:ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న వ్యవసాయ పరికరాలు రైతులకు ఎంతో మేలు చేకూరుస్తాయని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రాజు పేర్కొన్నారు. రాయితీపై వ్యవసాయ పరికరాలను అందించడానికి దరఖాస్తులు స్వీకరించి డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు తెలిపారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ పరికరాలకు దరఖాస్తు చేసుకున్న రైతుల సమక్షంలో ఎంపీడీవో విష్ణువర్ధన్, తహసిల్దార్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ వ్యవసాయంలో అన్నదాతలు యాంత్రికరణ పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.
వారికి వ్యవసా య యంత్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ క్రమంలో కేంద్ర సర్కారు స్మామ్ (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్) పథకం అమలుకు శ్రీకారం చుట్టి యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ రైతులకు అవసరమయ్యే పరికరాలను రాయితీపై అందిస్తోందని పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మండలానికి మొత్తం 206 వివిధ రకాల పరికరా లు అందించిందన్నారు. అందుకు రూ.17.30 లక్షలు కేటాయించింది. ఈ కార్యక్రమంలో ఏఈవోలు అభిలాష్, నాగరాజు, దరఖాస్తుదారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.