calender_icon.png 22 January, 2026 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలకు రెడీ అంటున్న పార్టీలు

22-01-2026 12:32:28 AM

మున్సిపాలిటీలకు ఇన్చార్జులు నియామకం 

కాంగ్రెసుకు మంత్రి కొండా సురేఖ జిల్లా ఎమ్మెల్యేలు,    

బీఆర్‌ఎస్‌కు నామ, పువ్వాడ సండ్ర, కందాల 

రఘునాథపాలెం ఖమ్మం, జనవరి 21 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైనది ఒకవైపు ఎండలు వేడి ఎక్కువవుతుంది మరోవైపు రాజకీయ వేడి ఎక్కువవుతుంది ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఖమ్మం జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బిఆర్‌ఎస్ పార్టీలు ఏదులాపురం,వైరా, కల్లూరు మధిర,సత్తుపల్లి లో ఎన్నికలు ఇన్చార్జిలను నియమించుకున్నారు.

మరోవైపు చాప కింద నీరు లాగా బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలైన సిపిఐ సిపిఎం పార్టీలు కూడా సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు వాళ్లకు బలంగా ఉన్నచోట పోటీ చేసి మిగతా చోట్ల ఎవరికి మద్దతు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు మిగతా పార్టీలైన బిజెపి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సైతం పోటీలో సిద్ధంగా ఉన్నాము అంటూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో మంచి జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే హవా కొన సాగించాలని, బిఆర్‌ఎస్ పార్టీ కూడా గత వైభవాన్ని దృష్టిలో ఉంచుకొని బాగా పనిచేసే మంచి ఫలితాలను సాధించాలని వ్యూహరచనలు చేస్తున్నాయి.

పొత్తుల కోసం కసరత్తులు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్‌ఎస్ సీపీఐ సిపిఎం పార్టీలు మధ్య పోటీ ఉండగా, కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి, అదేవిధంగా బిఆర్‌ఎస్ సీపీఎం పార్టీలు కలిసి పోటీ చేసే ఆలోచనలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి అదే దిశగా పావులు కదుపుతున్నారు. ఖమ్మం జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు సంకల్పంతో పనిచేస్తున్నారు.

రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్న ఏదులాపురం మున్సిపాలిటీలో ఇప్పటికే మంత్రి  పలుమార్లు పర్యటించి ఇన్చార్జిలని నియమించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిధిలో ఉన్న మధిర మున్సిపాలిటీలో అన్ని వార్డులతో సహా ఇన్చార్జిలను నియమించి వారితో చర్చించి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇకపోతే వైరా కల్లూరు సత్తుపల్లి మున్సిపాలిటీలలో మంచి పట్టు ఉన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఎమ్మెల్యే రాగమయి సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు దయానంద్ తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు చర్చించి వ్యూహాలను తయారు చేస్తున్నారు.

మొత్తం మీద ముగ్గురు మంత్రులు కలిసి ఖమ్మం జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో అన్ని వార్డులతో సహా కైవసం చేసుకోవాలని మంచి పట్టుదలతో పని చేస్తున్నారు. మరోపక్క బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అజయ్ కుమార్ వైరా పై దృష్టి పెట్టి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మధిరకు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు,  లింగాల కమల్ రాజు విస్తృతంగా పర్యటించి కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు.  ఎదులాపురం మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి,కల్లూరు సత్తుపల్లి కి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య లను ఇన్చార్జిలుగా నియమించి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఖమ్మం జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో జెండాలు ఎగురవేసేందుకు ఎవరి వ్యూహాల్లో వారు రచిస్తున్నారు. 

కొసమెరుపు ఏమిటంటే..

ఖమ్మం అంటే తెలుగుదేశం కంచుకోట అని, కనుక తెలుగు తమ్ముళ్లు ఎవరికి  మద్దతిస్తే వాళ్లే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది అందరూ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని టిడిపి తమ్ముళ్లు పట్టు ఉన్నచోట పోటీ చేయాలని ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళారు. ఇందుకు టీడీపీ నాయకులు దానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈసారి ఖమ్మం జిల్లాలో టిడిపి కూడా పోటీలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.