22-01-2026 12:18:25 AM
జీ+1 అనుమతితో జీ+4 నిర్మాణాలు!
అధికారుల ఉదాసీనత..
గత పాలకుల అండతోనే అక్రమ దందా?
నిబంధనలు అతిక్రమిస్తే తాట తీస్తాం: ఎంపీడీవో బానోతు సరిత
కందుకూరు, జనవరి 21(విజయక్రాంతి): కందుకూరు మండలంలో భవన నిర్మాణ నిబంధనలు అపహాస్యమవుతున్నాయి. సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే నిబంధనలు వల్లెవేసే అధికారులు, బహుళ అంతస్తులు లేస్తుంటే మాత్రం ‘కళ్లున్నా చూడలేని’ కబోదుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల పరిధిలోని 35 గ్రామ పంచాయతీల్లో కేవలం జి ప్లస్ వన్ (G+1) వరకు మాత్రమే ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి జి ప్లస్ ఫోర్ (G+4) వరకు యథేచ్ఛగా నిర్మాణాలు సాగుతున్నాయి.
అంతస్తుల వెనుక ‘అదృశ్య’ హస్తం ఎవరిది?
గ్రామాల్లో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాల వెనుక గత పాలకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ పలుకుబడితో అధికారులను మేనేజ్ చేస్తూ, పర్మిషన్ల పేరుతో భారీగా అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, ఎంపీడీవోలు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక భారీ స్థాయిలో ‘మామూళ్ల’ పంపిణీ జరిగిందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాలు భవిష్యత్తులో అగ్నిప్రమాదాలు లేదా ఇతర విపత్తులు సంభవించినప్పుడు పెను ముప్పుగా మారతాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.....
మండలంలోని 35 పంచాయతీల్లో యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఉన్నతాధికారుల తనిఖీలు లేకపోవడం, క్షేత్రస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫీజులు ఎగ్గొట్టి, ఇష్టారాజ్యంగా అంతస్తులు పెంచుకుంటూ పోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
కఠిన చర్యలు తప్పవు
పంచాయతీ లో అక్రమ నిర్మాణాలపై కందుకూరు మండల ఎంపీడీవో బానోతు సరిత తీవ్రంగా స్పందించారు. మండల పరిధిలోని 35 గ్రామ పంచాయతీలలో కేవలం జి ప్లస్ వన్ ఇళ్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ‘ఎవరైనా నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేపడితే మూడు పర్యాయాలు నోటీసులు జారీ చేస్తాం. ఆపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఒకవేళ గ్రామ పంచాయతీ కార్యదర్శులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ ఇలాంటి అక్రమాలకు సహకరిస్తే.. వారిపై జిల్లా కలెక్టర్ కు, జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక పంపి కఠినమైన చర్యలు తీసుకునేలా సిఫార్సు చేస్తాం‘ అని ఆమె ’విజయ క్రాంతి’కి వివరించారు.