calender_icon.png 13 January, 2026 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎస్‌ఎల్వీ- సీ62 ప్రయోగానికి అంతరాయం

13-01-2026 01:51:04 AM

నాలుగు దశల్లో ప్రయోగం పూర్తి చేసేందుకు ప్రణాళిక

మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తి ప్రయోగానికి బ్రేక్

అంతరాయానికి గల కారణాలను విశ్లేషిస్తాం: ఇస్రో చైర్మన్ నారాయణన్

శ్రీహరికోట, జనవరి ౧౨: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సోమవారం ఉదయం 10.18 గంటలకు శ్రీహరికోట కేంద్రంగా ప్రతిష్ఠాత్మకంగా పీఎస్‌ఎల్వీ- సీ62 రాకెట్ ప్రయోగానికి అంతరాయం ఏర్పడింది. దేశ రక్షణ రంగానికి విశేష సేవలందించే ‘అన్వేష’ అనే ఈవోఎస్-ఎన్ 1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రయోగించిన రాకెట్‌లో సమస్య తలెత్తింది. ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో పూర్తి కావాల్సి ఉండగా, మూడో దశ తర్వాత అడ్డంకులు ఎదురయ్యాయి. మూడో దశ చివర్లో నిర్దేశించిన మార్గంలో రాకెట్ వెళ్లకపోవడంతోనే ఈ అంతరాయం ఏర్పడింది. ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ వీ నారాయణన్ స్పష్టత ఇస్తూ.. మూడో దశ ఇంజిన్ ఛాంబర్‌లో ప్రెజర్ అకస్మాత్తుగా పడిపోవడంతో సమస్య తలెత్తిందని తెలిపారు.

అంతరాయానికి గల పూర్తి కారణాలను విశ్లేషించి, తదుపరి ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. రాకెట్ కేవలం ‘ఈఓఎస్-ఎన్ 1’ మాత్రమే కాకుండా భారత్, ఇంగ్లాండ్, థాయ్‌లాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ తదితర దేశాలకు చెందిన మొత్తం 16 చిన్న ఉపగ్రహాలు కూడా మోసుకెళ్లిందని, వాటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టే సమయంలో అంతరాయం ఏర్పడిందని వివరించారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) చేపట్టిన ౯వ పూర్తిస్థాయి వాణిజ్య మిషన్ ఇదేనని వెల్లడించారు.మరోవైపు పీఎస్‌ఎల్వీ ప్రయోగంలో భాగంగా మూడో దశలో లోపం తలెత్తడం ఇది రెండోసారి. గతేడాది మే నెలలో జరిగిన పీఎస్‌ఎల్‌వీ సీ -61 ప్రయోగం కూడా సరిగ్గా ఇదే కారణంతో విఫలమైంది.