15-12-2025 02:03:16 AM
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య
గోదావరిఖని, డిసెంబర్ 14 (విజయక్రాంతి): రెండు రోజులుగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్టు బొగ్గు గని పరిసరాల్లో సంచరించిన పెద్దపులి గోదావరి నది దాటి పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలోకి ప్రవేశించింది. శనివారం రాత్రి గోదావరి నది దాటిన పెద్దపులి మేడిపల్లి బొగ్గు గని పరిసరాల్లో తిరిగింది. సింగరేణి అధికారులకు అనుమానం వచ్చి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆదివారం ఉదయం జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య ఫారెస్టు సిబ్బందితో చేరుకొని గోదావరి వద్ద ఇసుకలో పెద్దపులి అడుగులను గుర్తించారు. అవి పెద్దపులి అడుగులేనని నిర్ధారించారు.
మేడిపల్లి చుట్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పెద్దపులి సంచారంతో అటు సింగరేణి కార్మికులు, ఇటు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పెద్దపులి ఎన్టీపీసీ, మేడిపల్లి, లింగాపూర్ ప్రాంతాలలో సంచరిస్తుందని, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఒక్కరుగా కాకుండా పదిమంది గుంపులుగా పోవాలని, రాత్రి సమయంలో తిరగవద్దని, ఉదయం 7గంటల తర్వాతనే ప్రజలు బయటికి రావాలని సూచించారు. పశువులను అటవీ ప్రాంతాలకు పంపించవద్దని, పెద్దపులి కి ఎవరు కూడా హాని చేయొద్దని జిల్లా అటవీ శాఖ అధికారి ప్రజలకు సూచించారు.