22-09-2025 01:01:27 AM
సిద్దిపేట, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయి. దుండగులు కూరగాయల మార్కెట్, మహిళలు నిర్వహించే దుకాణాలు కేంద్రంగా నోట్లను చలామణి చేసినట్లు చర్చ జరుగుతుంది. శనివారం దుబ్బాకలో జరిగిన సంతలో నకిలీ నోట్లతో లావాదేవీలు జరిగినట్లు తెలుస్తుంది.
కూరగాయలు విక్రయించే వృద్ధురాలు ఆదివారం తనకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తూ ఉండగా ఒకే సీరియల్ నెంబర్ కలిగిన 200 నోట్లు ఉండటాన్ని వ్యాపారి గుర్తించాడు. విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో నకిలీ నోట్లను దుబ్బాక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు కూరగాయల విక్రయదారులు, పెట్రోల్ బంకులు నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.