28-06-2025 12:00:00 AM
రైతు సమస్యలపై అక్షర రామాయణాన్ని రచించిన మహా రచయిత వానమామలై జగన్నాథాచార్యులు. వీరు రాసిన ‘రైతు రామాయణం’ సామాజిక దృక్పథంతో కూడిన అద్భుతమైన కవితా గ్రంథంగా సాహిత్య ప్రపంచంలో గుర్తింపు పొందింది. జగన్నాథాచార్యుల విద్యా జీవితారంభం కుటుంబపరంగా ఉన్న శాస్త్రీయ వాతావరణంలోనే జరిగింది. చిన్న వయస్సులోనే ఆయనకు పురాణ గ్రంథాలపై ఆకర్షణ కలిగింది.
దేవాలయాల్లో వినిపించే హరికథలు, రామాయణ భారతాల విశేషాలు, భక్తి గీతాల పరంపర ఇవన్నీ ఆయనలో సాహిత్యానురాగానికి విత్తనాలు వేశాయి. తండ్రి దగ్గర ‘శబ్దమంజరి’ వ్యాకరణ గ్రంథాన్ని బాల్యంలోనే అధ్యయనం చేశారు. మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన ఉపాధ్యాయునిగా మొదట ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశారు. ఆ కాలంలో ఆయనను విద్యార్థులు ‘తెలుగు వెంకయ్య మాస్టారు’ అని ఆప్యాయంగా పిలిచేవారు.
కరీంనగర్‌లోని ఒక ట్యుటోరియల్ కళాశాలలో తెలుగు పండితునిగా 8 ఏళ్లు పనిచేశారు. 19 ఏళ్ళ వయసులో ఆండాలమ్మతో వివాహమైంది. వీరికి పదకొండు మంది సంతానమున్నారు.
జగన్నాథాచార్యులు కవిత్వం, శతకాలు, నాటకాలు, భక్తికావ్యాలు, అభ్యుదయ గేయాలు, వ్రతకావ్యాలు తదితర సాహిత్య ప్రక్రియలలో అద్భుత సామర్థ్యాన్ని చాటారు. వీటిలో కొన్ని ముద్రితమై ప్రాచుర్యంలోకి రాగా, మరికొన్ని అముద్రితంగా ఉన్నాయి. ‘కార్వాసలక్ష్మి’ (నాటకం, 1919) కరుణ రస ప్రధానమైంది. ‘అభ్యుదయ గీతాలు’ (1952 సోషలిస్టు పార్టీ ప్రచురించింది. ఇందులోని గేయాల బాణి ఉద్యమ గాథను చాటుతుంది.
‘రైతు రామాయణం’ (1981) తెలంగాణ రైతాంగ పోరాట నేపథ్యంతో కూడిన మహాకావ్యం. ఇందులో రామాయణ కథానుగుణంగా రైతు జీవితగాథను ఆరు కాండలుగా రచించారు. ‘జూలపల్లి వరాహస్వామి శతకం’ అనేది భక్తికావ్యం. ‘ఇల్లంతకుంట సీతారామస్వామి సుప్రభాతం’ (1968) 33 సంస్కృత శ్లోకాలతో ఉంది. ‘శ్రీవ్రతగీతి’ (అనువాద గేయకావ్యం, 1971) గోదాదేవి తమిళ ‘తిరుప్పావై’కు తెలుగు అనువాదం.
కాగా, తెలంగాణలోని రైతాంగ పోరాట చరిత్రకు దర్పణంగా నిలిచిన కావ్యం రైతు రామాయణం కేవలం సాహిత్య సృజన మాత్రమే కాక ఒక సామాజిక దస్తావేజు. పల్లె జీవితం, నైజాం నిరంకుశ పాలన, రైతుబాధల ప్రతినిధిగా శ్రీరాముడి ప్రతీకను తీసుకొని ఈ కావ్యాన్ని రచించారు. ఈ కావ్యం ముద్రితమయ్యేలోపు పలు సాహితీ సభల్లో రచయిత స్వయంగా కవితాగానం చేయడంతో ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది.
ఇందులో ప్రతీ పాత్ర ఒక సామాజిక వర్గాన్ని లేదా రాజకీయ స్థితిని సూచిస్తుంది. ఇక్కడ రచయిత శైలి విభిన్నంగా ఉంది. పద ప్రయోగంలో అనేక మాండలికాలు, సామాన్య జనభాషా నుడి, ఉర్దూ పదాల వినియోగం స్పష్టంగా కనిపిస్తాయి. కావ్య నిర్మాణాన్ని శాస్త్రీయంగా కాక ప్రజల అభిరుచికి, వారి వాదనకు అనుగుణంగా మలిచారు. ఈ కావ్యానికి అనేకమంది విమర్శకులు, కవులు ప్రశంసలు గుప్పించారు.
- డా. ఐ. చిదానందం