28-06-2025 12:00:00 AM
భారత అంతరిక్ష యాత్రలో మరో ముందడుగు పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) మన వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా చేరుకోవడంతో తొలిసారిగా భారతీయుడు ఐఎస్‌ఎస్‌లో అడుగు పెట్టినట్టయ్యింది. సరికొత్త అధ్యాయానికి ఇది నాందిగా నిలిచింది. యాక్సిమ్ మిషన్‌లో భాగంగా, నలుగురు సభ్యుల బృందంలో ఒకరిగా శుక్లా అంతరిక్ష యాత్ర సాగింది. 41 ఏళ్ల తర్వాత భూకక్షను దాటిన భారత రెండో వ్యోమగామిగా శుక్లా చరిత్రకెక్కారు.
1984లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ సోవియట్ అంతరిక్ష నౌకలో గగనయానం చేశారు. ఇప్పుడు కమర్షియల్ స్పేస్ కంపెనీగా పేరు తెచ్చుకున్న ‘యాక్సిమ్ స్పేస్’తో నాసా సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టింది. అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేటు సంస్థలు కీలక భూమిక పోషిస్తున్న ఈ దశాబ్దంలో ‘యాక్సిమ్ విజయవంతం కావడం విశేషం.
14 రోజులు వైజ్ఞానిక పరిశోధనల కోసం తలపెట్టిన ఈ అంతరిక్ష యాత్రలో 31 దేశాల కూర్పుతో దాదాపు 60 విభిన్న వైజ్ఞానిక అధ్యయనాలు జరగనున్నాయి. మన దేశానికి సంబంధించి, ఇస్రో చేపట్టిన ‘గగన్‌యాన్’ మిషన్‌కు ఈ యాత్ర కీలకం కానుంది. అంతరిక్ష కేంద్రంలోకి శుభాంశును ఒక పర్యాటకుడిగా ఇస్రో పంపించలేదు. మైక్రో గ్రావిటీకి సంబంధించి 30 పరిశోధనలను శుభాంశు నిర్వహిస్తారు.
భారత వైజ్ఞానిక, సాంకేతిక సామర్థ్యాలను ఇప్పటికే ప్రపంచానికి చాటిచెప్పిన ఇస్రో ప్రపంచ దేశాల విశ్వాసాన్ని చూరగొన్నది. మైక్రో గ్రావిటీ పరిశోధనలు భారత్ తలపెట్టిన ‘గగన్‌యాన్’కు ఉపయుక్తం కానుండగా వృక్షశాస్త్రం, స్పేస్ మెడిసిన్ వంటి అంశాల్లో భారత్ తలపెట్టిన అధ్యయనాలు అంతరిక్ష వైజ్ఞానిక రంగానికి కీలకం కానున్నాయి. వైద్య, ప్రపంచ వాతావరణ మార్పులపై జరుగనున్న పరిశోధనలు మానవాళికంతటికీ ఉపయోగపడేవే.
చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు 2040 సంవత్సరాన్ని భారత్ ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకొంది. ఆ లోగానే 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్)ను ఏర్పాటు చేసుకోవాలని తలపెట్టింది. ఈ లక్ష్యాలకు శుభాంశు అంతరిక్ష యాత్ర ఒక రోడ్‌మ్యాప్ కానుంది. సాధించే అనుభవం భవిష్యత్‌లో ఇస్రో చేపట్టే ఏ మిషన్‌కైనా మార్గ నిర్దేశనం చేస్తుంది.
ఈ యాత్ర ద్వారా సేకరించే డేటా భవిష్యత్తులో ఎంత క్లిష్టమైన మిషన్‌నైనా విజయవంతంగా పూర్తి చేసేందుకు ఉపయోగపడుతుంది. 2033 నాటికి అంతర్జాతీయంగా 8 శాతం స్పేస్ మార్కెట్‌ను ఇస్రో సాధించాలనేది లక్ష్యం. భారత అంతరిక్ష పరిశోధనలు తక్కువ ఖర్చుతో కొనసాగుతాయని ఇప్పటికే పలు దేశాలకు అవగతమైంది. కనుక, అంతరిక్ష రంగంలో మన దేశ వృద్ధిరేటుకు ఢోకా లేదు.
వివిధ వైజ్ఞానిక రంగాలకు మన అంతరిక్ష పరిశోధనలు ఆర్థికంగా ఊపునిచ్చేవే. పలు రంగాల్లో ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుంది. అంతర్జాతీయ భాగస్వామ్యంతో భవిష్యత్‌లో భారత్ మరిన్ని మిషన్‌లు చేపట్టేందుకు శుభాంశు శుక్లా సాగిస్తున్న ఈ చారిత్రక మిషన్ ఉపకరిస్తుంది. ‘మీరంతా నాతోనే ఉన్నారని’ భుజంపై జాతీయ జెండాతో శుభాంశు 140 కోట్ల భారతీయులకు ఇచ్చిన సందేశం స్ఫూర్తిదాయకం.