10-09-2025 12:00:00 AM
బీహార్ ఓటర్ల నమోదు, సవరణ కోసం ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా పరిగణించాలని ఎట్టకేలకు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కీలకమైంది. బీహార్ ఓటర్ల నమోదు, సవరణలో విసిగి వేసారి ఉన్న ఆ రాష్ట్ర ప్రజలకు ఇది స్వాంతన. ఎన్నికల కమిషన్ బీహార్‌లో ప్రత్యేకంగా చేపట్టిన ఓటరు జాబితా సవరణ (సర్) ఇప్పటికే వివాదాస్పదంగా మారింది.
ఓటు హక్కును పొందాలంటే బీహార్ ఓటరు 11 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలని ఎన్నికల కమిషన్ పెట్టిన నిబంధన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ 11 రకాల పత్రాల్లో ఓటరుగా గుర్తింపునిచ్చేందుకు ఆధార్ కార్డు ఇప్పటిదాకా చెల్లుబాటు కాలేదు. వివిధ పక్షాలు ఈ విషయంపై అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టాయి.
పాస్‌పోర్ట్, డ్రై వింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డులు, బ్యాంకు లేదా పోస్టాఫీసు పాస్ బుక్కులు, రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్ కార్డులు వంటి వాటిని మాత్రమే ఎన్నికల సంఘం ఓటర్ల నమోదుకు, సవరణకు గుర్తింపుగా పనికి వస్తాయని పేర్కొంది. ఈ జాబితాకు సుప్రీంకోర్టు చలవ వల్ల ఇప్పుడు ఆధార్ కార్డు కూడా జతకావడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశమే. ఇతర గుర్తింపు కార్డులేవీ లేని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆధార్ కార్డు ఒక ప్రధాన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతున్నదనేది అందరికీ తెలిసిందే.
అయితే ఆధార్ కార్డు కేవలం గుర్తింపుకు మాత్రమే ఉపయోగపడుతుందని, దానిని పౌరసత్వానికి నిదర్శనంగా పరిగణించకూడదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి ధర్మాసనం ఈ సందర్భంగా తన తీర్పులో స్పష్టతనిచ్చింది. నకిలీ ఆధార్ కార్డులు దేశంలో ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చాయని, వాటిని ఓటరు నమోదుకు కూడా పరిగణించలేమని ఎన్నికల కమిషన్ ఇన్నాళ్లు భీష్మించుకొంది. అందుకే వాటి ప్రామాణికతను నిర్ధారించుకొనే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయితే ఓటరు సమర్పించిన ఆధార్ పత్రాన్ని తీసుకోవడానికి అంగీకరించని ఎన్నికల అధికారులకు గతంలో తాము జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఈసీ వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. అదే సమయంలో ఆధార్ చెల్లుబాటు గురించి ఆధార్ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను ధర్మాసనం గుర్తు చేసింది. తమ ఆదేశాలను ఈసీ వెబ్‌సైట్‌లో ప్రచురించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు నిజానికి ఒక్క బీహార్ రాష్ట్రానికే పరిమితం కాదు. ఎన్నికల వ్యవస్థలో ఆధార్ అనుసంధానంపై జరుగుతున్న చర్చకు ఇది ముగింపు పలుకవచ్చు. ఓటర్ల గుర్తింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా జరగాలనే విషయాన్ని కూడా ఎవరూ కాదనరు. కానీ ఆ ప్రక్రియలో ఏది ఆచరణాత్మకం అనేది కూడా చూడాల్సిన అవసరం అనేది బీహార్ ఎన్నికల ప్రక్రియ ద్వారా ముందుకు వచ్చింది. ఆధార్ కార్డు సాధించడానికి దేశ ప్రజలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
ఆ తర్వాత దేశంలో అక్రమంగా ప్రవేశించినవారు కూడా ఆ ధార్ కార్డులు సంపాదించడం,నకిలీ ఆధార్ కార్డులు పుట్టుకురావడం పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారిపోయింది. ప్రజలకు అనేక సేవలందించడానికి ఇప్పుడు కీలకంగా మారిన ఆధార్ చెల్లకుండా పోతే ఏదీ దిక్కు అని సామాన్యులు భరించకుండా సుప్రీంకోర్టు తీర్పు వారికి కాస్త వెసులుబాటును కల్పించిందని చెప్పొచ్చు.