10-01-2026 12:21:16 AM
సమయస్ఫూర్తితో యువకుడిని కాపాడిన108 సిబ్బంది
వాంకిడి, జనవరి 9 (విజయ క్రాంతి): మండలంలోని లింబరావు గూడా గ్రామ సమీపంలోని కుమ్రం భీం ప్రాజెక్టు కాలువలోకి ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు దూసుకెళ్లిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని సోనాపూర్ చిచ్చుపల్లి గ్రామానికి చెందిన నాయుడు శుభం (నాని) గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో కోపగూడకు వెళ్లి తిరిగి వస్తుండగా మద్యం మత్తులో అదుపుతప్పి ద్విచక్ర వాహనంతో కాలువలో పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనను గమనించిన లింబరావు గూడా గ్రామస్తులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు.
సమాచారం అందుకు న్న 108 ఈఎంఎటి ప్రవీణ్ యాదవ్, పైలట్ శ్రీనివాస్ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర చీకటి, ప్రమాదకర పరిస్థితుల మధ్య అతి కష్టంతో కాలువలోకి దిగిన 108 సిబ్బంది నాయుడు శుభం (నాని)ను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆయనను మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి వేళల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది ని గ్రామ ప్రజలు అభినందించారు.