01-11-2025 12:00:00 AM
బోథ్ పోలీస్ స్టేషన్‌లో నెలకొన్న ఘటన
బోథ్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారున్ని చెట్టుకు కట్టేసి దౌర్జన్యానికి పాల్పడిన ఘటనలో అరెస్టు అయిన కాంట్రాక్టర్ పోలీస్ స్టేషన్ నుండి పరారీ అయిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. జిల్లా బోథ్ మండల పోలీస్ స్టేషన్ నుండి నిందితుడు పరారైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గత మూడు రోజుల క్రితం సోనాల మండలం లోని కోటా (కే) గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్దిదారురాలు భర్త మారుతి ఇంటి నిర్మాణం కొరకు కాంట్రాక్టర్ సత్యనారాయణ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఐతే ఇటీవల లక్ష రూపాయల లబ్ధిదారుని అకౌంట్ లో జమ కావడంతో డబ్బులు ఇవ్వాలని కాంట్రాక్టర్ ఒత్తిడి చేశాడు. కానీ లబ్ధిదారుడు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ సోనాల లో మారుతీ ని చెట్టు కు కట్టివేసిన ఘటన జిల్లాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సీరియస్ గా తీసుకు న్నారు.
దీంతో పోలీసులు కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేసి, బుధవారం సదరు కాంట్రాక్టర్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అయితే అదే రోజు రాత్రి సమయంలో మూత్ర విసర్జన కు వెళ్తానని చెప్పిన సదరు కాంట్రాక్టర్ పోలీసుల కళ్ళుకప్పి తప్పించుకుని పారిపోయినట్లు సమాచారం.
ఆనోటా ఈనోటా విషయం శుక్రవారం బయటపడింది. అయితే నిందితుడి కోసం పోలీసులు వివిధ ప్రదేశాలలో గాలిస్తున్నట్లు తెలిసింది. కాగాఈ విషయం పై స్థానిక ఎస్త్స్ర శ్రీ సాయి ని వివరణ అడగగా కాంట్రాక్టర్ పారిపోయింది వాస్తవమే నని, నిందితుడి కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.