01-11-2025 05:22:05 PM
మల్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని మూడు తూర్పు చింతల వాడ, బజార్ల వాడలో ప్రజలు రోడ్ల మరమ్మత్తులేని పరిస్థితితో తీవ్రంగా బాధపడుతున్నారు. వర్షాకాలం రాగానే రహదారులు అద్వానంగా మారిపోతున్నాయి. పలు చోట్ల ఏర్పడిన పెద్ద పెద్ద గుంతల్లో వర్షపు నీరు నిల్వవుతూ దోమల వృద్ధికి దారితీస్తోంది. ఫలితంగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, జ్వరాలు, దగ్గు, జలుబు వంటి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు చెబుతున్నదాని ప్రకారం గతకొంత కాలంగా సంబంధిత అధికారులను పలుమార్లు రోడ్ల పరిస్థితిపై సమాచారం ఇచ్చినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. వాడలోని చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు వర్షాల్లో ఈ చెత్త రోడ్లపై నడవలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు ముందు చర్యలు తీసుకొని, వెంటనే రోడ్లను మరమ్మతు చేసి, డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని వాడ ప్రజలు వేడుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఇది అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.