11-08-2025 12:00:00 AM
మూడ నమ్మకాలను పట్టించుకోవద్దు.. వివరాలు వెల్లడించిన డీఎస్ పీ
టేకులపల్లి, ఆగస్టు 10,(విజయక్రాంతి):మంత్రగాడనే అనుమానంతో వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇల్లందు డీఎస్ పీ చంద్రభాను టేకులపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వేళ్ళడించారు.
టేకులపల్లి పోలీస్ సర్కిల్ పరిధిలోని ఆళ్ళపల్లి మండలం పెద్ద వెంకటాపురం పంచాయతీ పరిధిలోని భూసురాయి గ్రామంలో ఈ నెల ఆరో తేదీన మడకం బీడ అలియాస్ రాజు (36) చేతబడి చేస్తున్నడన్న అనుమానంతో చెట్టుకు కట్టి విచక్షణ రహితంగా కర్రలతో కొట్టడంతో మృతి చెందాడని డీఎస్ పీ తెలిపారు. అదే గ్రామానికి చెందిన మడవి రాజు, మొక్కటి చిన్న సోమయ్య, మొక్కటి భీమయ్య, వంజం గంగ, వంజం జోగ, మొక్కటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు హత్య చేసిన నాటి నుంచి పారిపోయారని తెలిపారు.
శనివారం టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆళ్ళపల్లి ఎస్త్స్ర సోమేశ్వర్ ఇతర సిబ్బందితో కలిసి పెద్దవెంకటాపురం పాఠశాల వద్ద వాహన తనిఖీ చేస్తుండగా మడకం బీడ అలియాస్ రాజును హతమార్చిన ఆరుగురు నిందితులు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సొంత గ్రామాలకు వెళ్లి పెద్ద వెంకటాపురం మీదుగా వెళ్లే ప్రయత్నం చేస్తుండగా సింగారం వైపు నుంచి అడవిలో గొనె సంచి పట్టుకొని వస్తున్నా వారిని అనుమానంతో విచారించగా రాజును చంపినవారని తెలియడంతో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారని డీఎస్ పీ తెలిపారు.
బూసురాయి గ్రామానికి చెందిన పదిహేనేళ్ల పోడియం గంగి మృతికి రాజు కారకుడని, చేతబడి వల్లే మృతి చనిపోయిందని హతమార్చినట్లు విచారణలో తెలిసిందన్నారు. మృతి చెందిన అమ్మాయి కేవలం కామెర్ల వలెనే మృతి చెందిందని, చేతబడి, బాణామతి లాంటి క్షుద్ర పూజలను, మూఢ నమ్మకాలూ నమ్మి ప్రజలు ఎవరైనా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దన్నారు. ఎవరైనా చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, ఆళ్ళపల్లి ఎస్త్స్ర సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.