13-09-2025 03:07:44 AM
వెంకటాపురం(నూగూరు), సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): మేనత్తను అతి దారుణంగా హత్య చేసిన నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మండల పరిధిలోని ఇప్పలగూడెం గ్రామానికి చెందిన కొండకర్ల ఎల్లక్క(65) ను గురువారం ఉదయం కత్తితో నరికి చంపిన అతని మేనల్లుడు కొండగట్ల విజయను పోలీసులు 24 గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ మాట్లాడుతూ ఇప్పలగూడెం గ్రామానికి చెందిన విజయ్ మద్యానికి, దురలవాట్లకు బానిసై డబ్బుల కోసం గత కొంతకాలంగా అతని మేనత్తను వేధిస్తూ ఉండేవాడని, అయితే హత్య జరిగిన ముందు రోజు కూడా డబ్బులు, బంగారం కోసం మేనత్తను బెదిరించాడని తెలిపారు.
నిందితుడి మేనత్త డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో గురువారం ఉదయం గ్రామ ప్రధాన కోడలు వదిలి గొడ్డలితో ఆమెను నరికి వేశాడు. హత్య చేసిన తర్వాత గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలోని వేపచెట్టు కింద తన తండ్రి ఫోటో పట్టుకొని అక్కడే గొడ్డలి ఉంచి పారిపోయాడని తెలిపారు. వెంకటాపురం సిఐ ముత్యం రమేష్ ఎస్‌ఐ తిరుపతిరావు తమ సిబ్బంది సహకారంతో గాలింపు చేపట్టగా శుక్రవారం ఉదయం పోలీసులకు అతను చిక్కాడని వివరించారు. కేవలం 24 గంటల వ్యవధిలోని నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులను ఆయన అభినందించారు.