17-01-2026 04:32:00 AM
కివీస్‌తో మూడో వన్డే
నితీష్ స్థానంలో బదోని?
భారత్ తుది జట్టు అంచనా గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్‌కుమార్‌రెడ్డి/ఆయుష్ బదోని, జడేజా, హర్షిత్ రాణా, సిరాజ్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
ఇండోర్, జనవరి 16: భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ చివరి అంకానికి చేరింది. తొలి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. రెండో వన్డేలో న్యూజిలాండ్ దెబ్బకు దెబ్బ కొట్టి సిరీస్ సమంచేసింది. ఇప్పుడు సిరీస్ ఫలితాన్ని ఆదివారం జరిగే చివరి వన్డే తేల్చబోనున్నది. గత మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ వైఫల్యం, బౌలర్ల పేలవ ప్రదర్శన భారత్ ఓటమికి కారణమయ్యాయి. దీంతో సిరీస్ డిసైడర్‌గా మారిన ఇండోర్ వన్డేకు తుది జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.
ఈ సిరీస్ ఆరంభం నుంచి టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. వాషింగ్టన్ సుందర్ పక్కటెముకల గాయంతో సిరీస్ మొత్తానికి దూరమవగా అతని స్థానంలో యువ ఆటగాడు ఆయుష్ బదోని ఎంపికయ్యాడు. సుందర్ స్థానంలో రెండో వన్డేకు నితీష్‌కుమార్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే నితీష్ నిరాశ పరిచాడు. దీంతో మూడో వన్డేలో అతనికి చోటు దక్కడం అనుమానంగానే కనిపిస్తున్నది. పార్ట్‌టైమ్ బౌలర్‌గా బదోనికి అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. బదోని గంభీర్‌కు ఫేవరేట్ ప్లేయర్. దీంతో నితీష్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
రెండు వన్డేల్లోనూ విఫలమైన ప్రసిధ్ కృష్ణపై వేటు పడే అవకాశం ఉన్నది. అతని స్థానంలో అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రావొచ్చు. తొలి మ్యాచ్‌లో ప్రసిధ్ కృష్ణ భారీగా పరుగులిచ్చుకున్నాడు. రెండో వన్డేలో ఫెయిల్ అయ్యాడు. అతని కోసం అర్షదీప్ లాంటి బౌలర్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో కోచ్ గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఈ రెండు తప్పిస్తే మిగతా కాంబినేషన్‌లో మార్పులు జరిగే అవకాశం లేదు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో భారత్ భారీ స్కోరు లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నది.
ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ కొనసాగుతారు. గిల్ వరుస హాఫ్ సెంచరీలతో రాణించినా.. రోహిత్ శర్మ పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కోహ్లీ తన ఫామ్ కంటిన్యూ చేస్తే తిరుగుండదు. గాయం తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన అయ్యర్‌పై అంచనాలున్నాయి.
ఇక జట్టులో కీపింగ్ బాధ్యతలతోపాటు ఫినిషర్‌గా రాహుల్ అదరగొడుతున్నాడు. రెండో వన్డేలో సెంచరీతో దుమ్ము రేపాడు. జడేజా తన మ్యాజిక్ చూపించే టైమ్ వచ్చింది. బ్యాట్‌తోనూ లోయర్ ఆర్డర్‌లో అతనిపై అంచనాలు ఉన్నాయి. స్పిన్ విభాగంలో కుల్దీప్ కీలకం కానున్నాడు. పేస్ విభాగంలో మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా ఇంకా మెరుగ్గా రాణిస్తే తప్ప కివీస్‌ను కట్టడి చేయడం సాధ్యం కాదు.