calender_icon.png 17 January, 2026 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మహాయుతి’ అఖండ విజయం

17-01-2026 02:26:43 AM

  1. ముంబైలోని మొత్తం 227 డివిజన్లలో 118 స్థానాలు కైవసం 
  2. పెద్దగా ప్రభావం చూపని థాక్రే సోదరులు 
  3. మహారాష్ట్రలోని ఇతర బల్దియాల్లోనూ బీజేపీదే హవా 
  4. లాతూరులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం

ముంబై, జనవరి ౧6: బృహన్ ముంబై మున్సిపల్ కా ర్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, -శివసేన నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమి అఖండ విజయం సాధించింది. ఆసియాలోనే అత్యంత సం పన్నమైన ముంబై నగర మేయర్ పీఠాన్ని దక్కించుకున్నది. తద్వారా మూడు దశాబ్దాలపాటు ముంబై నగరంపై కొనసాగిన థాక్రే కుటుం బ ఆధిపత్యానికి తెరదించింది. నగర పరిధిలో మొత్తం 227 వార్డులు ఉండగా, సుమారు 1,700 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 227 స్థానాల్లో బీజేపీ ఏకంగా 90 స్థానాలు, శివసేన 28 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేశాయి. రెండు పార్టీల బలం కలిపి మ్యాజిక్ ఫిగర్ 114ను దాటి 118 సాధించడంతో ‘మహాయుతి’ మేయర్ పీఠం దక్కించుకోవడం లాంఛనమే.  

మరోవైపు ఉద్ధవ్ థాక్రే నేతత్వంలోని శివసేన (యూబీటీ) 75 స్థానాలకు పరిమిత మైంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కేవలం 23 స్థానాలకు పరిమితమైంది. అలాగే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) ౮ స్థానాలతో సరిపెట్టుకున్నది. తాజా మున్సిపల్ ఎన్నికలతో ముంబైపై మూడు దశా బ్దాలుగా ఉన్న థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరబడింది. థాక్రే సోదరులైన శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) రాజ్ థాక్రే సోదరులు చేతులు కలిపినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. అలాగే అజిత్ పవార్ నేతత్వంలోని ఎన్సీపీ కేవలం 3 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. శరద్ పవార్ నేతత్వంలోని ఎన్సీపీ (సీపీ) కనీసం ఖాతా అయిన తెరవలేకపోవడం గమనార్హం.

ముంబై మేయర్ పీఠంపై చర్చ

బీజేపీ నాయకత్వం ఈసారి ముంబై మేయర్ పీఠంపై కన్నేసింది. పార్టీ ఇప్పటికే ఒక ‘మరాఠీ నేత’ను మేయర్ చేస్తామని హామీ ఇచ్చి ఉంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినందున ఆ పార్టీ అభ్యర్థికే మేయర్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు మహాయుతి భాగస్వామి అయిన షిండే వర్గం కూడా మేయర్ పదవి ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నది. ఈ అంశంపై త్వరలోనే రెండు పార్టీల అగ్రనేతలు భేటీ అయి నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది.ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ అయిన ధారావిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆశా దీపక్ కాలే ఘనవిజయం సాధించారు. తన సమీప శివసేన అభ్యర్థి వైశాలి షెవాలేపై 1,450 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అలాగే సెంట్రల్ ముంబైలోని కుర్లా వెస్ట్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి అషఫ్ అజ్మీ విజయం సాధించారు. 

నాగ్‌పూర్‌లోనూ బీజేపీ హవా

నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ (మొత్తం స్థానాలు: 151) నాగ్‌పూర్‌లో భారతీయ జనతా పార్టీ తన హవాను కొనసాగించింది. మొత్తం 151 స్థానాలకు గానూ బీజేపీ ఒంటరిగానే 101 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 38 స్థానాలకు పరిమితమైంది. ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి 12 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు అధికారికంగా వెల్లడయ్యాయి. 

పుణెలో బీజేపీ హవా

పుణె మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. నగరంలో మొత్తం 174 స్థానాలు ఉండగా, వాటిలో బీజేపీ 82 స్థానాల్లో సొంతంగా గెలిచింది. అలాగే ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీ 35 స్థానాలు, కాంగ్రెస్ 28 స్థానాల్లో విజయం సాధించాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 22 స్థానాలను దక్కించుకోగా, ఇతరులు 7 చోట్ల గెలిచారు. బీజేపీ ఇక్కడ తన  మిత్రపక్షాల మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకోనుంది.

పింప్రి చించ్వాడ్ బీజేపీదే..

పింప్రి -చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. మొత్తం 128 స్థానాల్లో బీజేపీ 84 సీట్లు గెలుచుకుంది. ఎన్సీపీ (శరద్ పవార్) 37 స్థానాలకు పరిమితమైంది. శివసేన 6 చోట్ల గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్, ఎంఎన్‌ఎస్ పార్టీలు కనీసం ఖాతా తెరవలేకపోయాయి. మరోవైపు ఒక్క స్వతంత్ర అభ్యర్థి మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించారు.

సోలాపూర్‌లో బీజేపీ ఘన విజయం

సోలాపూర్ మున్సిపాలిటీ కూడా బీజేపీ సత్తా చాటింది. ఆ పార్టీ మొత్తం 102 స్థానాల్లో 48 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన 12 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలను సాధించి గట్టి పోటీ ఇచ్చింది. ఎన్సీపీ, ఎంఐఎం పార్టీలు మిగిలిన స్థానాలను పంచుకున్నాయి.

నాసిక్ ‘మహాయుతి’దే !

నాసిక్ మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. బీజేపీ 70 స్థానాలు, శివసేన (షిండే) 38 స్థానాల్లో విజయం సాధించాయి. శివసేన యూబీటీ కేవలం 13 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 4 చోట్ల గెలుపొందగా, ఇతరులు 1 స్థానాన్ని గెలుచుకున్నారు.

లాతూరు కాంగ్రెస్ హస్తగతం

లాతూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. మున్సిపాలిటీలో మొత్తం 70 స్థానాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 43 స్థానాలను కైవసం చేసుకుంది. తద్వారా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నది. ఇక్కడ బీజేపీ 22 స్థానాలకే పరిమితమైంది. గత మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ప్రతిపక్షానికే పరిమితమైంది.

‘దురంధర్’ ఫడ్నవీస్

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం వెనుక ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కృషి ఎంతో ఉంది. ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు పార్టీ విజయానికి కారణాభూతమయ్యాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో మూడు దశా బ్దాలుగా పాతుకుపోయిన థాక్రే కుటుంబ ఆధిపత్యానికి తెరపడేలా చేశాయి. అలాగే నాగ్‌పూర్, పుణె, పింప్రి- చించ్వాడ్ వంటి నగరాల్లోనూ బీజేపీ తిరుగులేని విజయా న్ని నమోదు చేసింది. అందుకే.. ఫడ్నవీస్‌ను బీజేపీ నేతలు ‘రాజకీయ దురంధర్’ అని కొనియా డుతున్నాయి. 

‘మహాయుతి’ బలం రెట్టింపు

ముంబై మున్సిపల్ ఎన్నికల విజయం రాజకీయాల్లో మహాయుతి కూటమి బలం మరింత పెరిగిందనడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మహాయుతి బలం ఇప్పుడు రెట్టింపయింది. ప్రభుత్వం మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపించాయి. మేయర్ అభ్యర్థి మహాయుతి కూటమి నుంచే ఉంటారు. నగరంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తాం.

ఏకనాథ్ షిండే, శివసేన చైర్మన్, మహారాష్ట్ర మంత్రి