17-01-2026 02:39:54 AM
ఢిల్లీ దారిలో హైదరాబాద్!
హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): పట్నం ప్రజలు సంక్రాంతి పండు గకు సొంతూళ్లకు వెళ్లారు.. హైదరాబాద్ నగరం సగం ఖాళీ అయ్యింది.. రోడ్లపై ట్రా ఫిక్ తగ్గింది.. సిటీ బస్సులు, మెట్రో రైళ్లు సగం ఖాళీగానే కనిపిస్తున్నాయి. అస లే చలికాలం. వాహనాలు వదిలే పొగతో ముక్కులకు మాస్క్‌లు ధరించి, బతుకుజీవుడా అంటూ ఇంటికి చేరే నగరవాసులకు ఈ నాలుగు రోజులు పండగే. పండుగ, పబ్బం లేనిరోజుల్లో అటు వాహనాల రద్దీ, ఇటు కాలుష్యంతో పొగచూరుతున్న నగ రం కూడా త్వరలోనే కాలుష్యంలో ఢిల్లీ స్థాయికి ‘ఎదుగుతున్నదా’ అనే ప్రశ్న అందరిని వెంటాడుతున్నది.
ఢిల్లీలో రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400 దాటింది. ‘ప్రమాదకర’ విభాగంలోకి ప్రవేశించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం ఢిల్లీలో ఏఐక్యూ 411గా న మోదైంది. -ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగించే స్థాయి కావడం గమ నార్హం. హైదరాబాద్ ఇప్పటికీ ఆ తీవ్రస్థాయికి చేరలేదు గానీ, నగరంలో క్రమంగా దిగజారుతున్న గాలి నాణ్యతను నిర్లక్ష్యం చేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే, హైదరాబాద్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొనే ప్రమా దం ఉందని వారు చెబుతున్నారు.
నేటి హైదరాబాద్‌లో పరిశ్రమలు నగరమంతటా చెల్లాచెదురుగా విస్తరించి ఉన్నాయి. ఇది వ్యవస్థీకృత పరిశ్రమల జోనింగ్ సూత్రాలను ఉల్లంఘిస్తోంది. నగర విస్తరణ సమయంలో శాస్త్రీ య విశ్లేషణలు, పౌర సంప్రదింపులు ఎక్కువగా లేకపోయాయి. ఒకప్పుడు హైదరా బాద్‌లో మూసారాంబాగ్ వంటి చారిత్రక ‘బాగ్‌లు’, అనేక చెరువులు ఉండేవి. కానీ అవి కనుమరుగవడం గాలి నాణ్యతపై నే రుగా ప్రభావం చూపింది. ప్రజా రవాణా ఇప్పటికీ విశ్వసనీయంగా లేకపోవడం, అం దుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సి రావడం మరో ప్రధాన కారణం.
చెత్త, ధూళి, పౌర వ్యవస్థ వైఫల్యం..
‘హైదరాబాద్‌లో ఇప్పుడు ద్విచక్ర, త్రిచక్ర వాహనాల సాంద్రత అత్యధికంగా ఉంది. ఏటా లక్షల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి, దీనివల్ల ఉద్గారాలు గణనీయం గా పెరుగుతున్నాయ’ని ఒక పౌరుడు తెలిపారు. ప్రణాళిక లేని పరిశ్రమల అభివృద్ధి, ముఖ్యంగా రసాయన, ఔషధ పరిశ్రమలు, కాలుష్య భారాన్ని మరింత పెంచుతూ హైదరాబాద్ గాలిని రసాయనపరంగా మరింత విషపూరితంగా మారుస్తున్నాయి. కాలుష్యానికి మరో ప్రధాన కారణం హైదరాబాద్‌లో శాస్త్రీయ పట్టణ ఘన వ్యర్థాల నిర్వహణ లేకపోవడమే. ‘చెత్తను తరచుగా కాల్చడం లేదా రోడ్ల పక్కన పడేయడం జరుగుతోంది. భారీ చెత్త కొండలు ఏర్పడి, జవహర్‌నగర్ వంటి ప్రాంతాలు డంపింగ్ యార్డులుగా మారా యి.
ఇది పౌరులూ, జీహెచ్‌ఎంసీ రెండింటికీ చెందిన వైఫల్యం’ అని ఆయన వివరించారు. అత్యంత కీలకమైన చివరి అంశం పౌర స్ఫూ ర్తి అని ప్రొఫెసర్ రెడ్డి పేర్కొన్నారు. గాలిలో నూ, నీటిలోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణను రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ(జీ) తప్పనిసరిగా పేర్కొన్నప్పటికీ, పౌరులు పర్యావరణా న్ని దెబ్బతీసే ఆచారాలను కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన విమర్శించారు. స్థిరమైన ప్రణాళికలు అమలు చేయడానికి ప్రత్యేక రాష్ర్ట పర్యావరణ అభివృద్ధి కమిషన్ ఏర్పా టు చేయాలని పిలుపునిచ్చారు. మునిసిపల్ వ్యవస్థపై మరింత బలమైన బాధ్యత నిర్ధారణ అవసరమని డిమాండ్ చేశారు.
ఢిల్లీ స్థాయికి చేరలేదు..
అయితే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త శరత్ కుమార్ హైదరాబాద్‌లో కాలుష్యం ఉందని అంగీకరించినప్పటికీ, అది ఢిల్లీ స్థాయికి చేరదని అన్నారు. ‘ఏఐక్యూను అర్థం చేసుకోవడంలో చాలాసార్లు గందరగోళం ఏర్పడుతుంది. మనకు 50-100 మంచి స్థాయి, 100-200 సంతృప్తికర స్థాయి. ఢిల్లీ ఏఐక్యూ గణాంకాలు జాతీయ సగటుగా తీసుకోవడం వల్ల అవి తరచూ తప్పుగా అర్థం చేసుకోవాల్సి వస్తుంద’ని ఆయన వివరించారు. హైదరాబాద్‌లో ఏఐక్యూ ప్రాంతానికి, ప్రాంతానికి చాలా తేడా ఉంటుందని, సనత్‌నగర్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగా మారుతుందని చెప్పారు. వాతావరణ పరిస్థితులు కూడా కొన్నిసార్లు కాలుష్యాన్ని తాత్కాలికంగా పెంచుతాయని తెలిపారు.
ఐఐటీ కాన్పూర్‌తో కలిసి దాదాపు రూ.1 కోటి వ్యయంతో నిర్వహించిన సోర్స్ అపోర్షన్‌మెంట్ అధ్యయనం ప్రకారం రోడ్డు ధూళి 27--30 శాతం, వాహనాలు మరో 20--30 శాతం, పరిశ్రమలు సుమారు 15 శాతం కాలుష్యానికి కారణమని వెల్లడైంది. ప్రస్తుతం దాదాపు 500 అనుబంధ పరిశ్రమలను కవర్ చేసే కార్యాచరణ ప్రణాళిక అమల్లో ఉందని ఆయన తెలిపారు. ఇందులో ఆకస్మిక తనిఖీలు, వాహనాల పర్యవేక్షణ, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, చార్జింగ్ మౌలిక వసతుల విస్తరణ, మొక్కల నాట్లు, రియల్‌టైమ్ గాలి నాణ్యత పర్యవేక్షణ వంటి చర్యలు ఉన్నాయి. ‘మన అవగాహన, చర్యలే కీలకం. ఉల్లంఘనలను అరికట్టడంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత అవసరమ’ని శరత్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ ఢిల్లీ దారిలోనే వెళ్తుందా..
ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కే పురుషోత్తం రెడ్డి ఒక కఠిన హెచ్చరిక జారీ చేస్తూ హైదరాబాద్ నిజంగానే ఢిల్లీ దిశగా కదులుతోందని అన్నారు. ఢిల్లీ భౌగోళిక పరిస్థితులు అక్కడి కాలుష్యాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయని ఆయన వివరించారు. హిమాలయాలు, ఉత్తర పర్వత శ్రేణులు గోడలా నిలిచి, గాలిని అడ్డుకుంటాయని, దాంతో ధూళి అక్కడే చిక్కుకుపోతుందని చెప్పారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చే ధూళి, థార్ ఎడారి నుంచి వచ్చే ఇసుకతో కలిసిపోయి, సూక్ష్మ కణాలను పెంచి గాలిని అత్యంత విషపూరితంగా మారుస్తోందని ఆయన అన్నారు.
‘ఢిల్లీ అభివృద్ధిని ప్రణాళిక చేయడంలో పర్యావరణ పరిమితులను పర్యావరణ మంత్రిత్వ శాఖ చాలా ముందే పరిగణనలోకి తీసుకోవాల్సింద’ని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం అప్పుడప్పుడు మాత్రమే జాతీయ పట్టణీకరణ కమిషన్లను ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. ‘వారు మూడు లేదా నాలుగు సిఫారసులు చేశారు గానీ, ప్రకృతి పరిమితులను ఎప్పుడూ గంభీరంగా పరిగణించలేద’ అని ఆయన అన్నారు.