calender_icon.png 23 August, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో చర్చ తర్వాతే చర్యలు

23-08-2025 01:24:46 AM

ఘోష్ కమిషన్ నివేదికపై విచారణలో హైకోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్

పిటిషన్‌పై స్టే ఇవ్వలేమన్న సీజే ధర్మాసనం 

పబ్లిక్ డోమైన్‌లో నివేదికను తొలగించాలని ఆదేశం

విచారణ నాలుగు వారాలు వాయిదా 

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ముందు అసెంబ్లీలో చర్చ తర్వాతే రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పిటిషనర్లు కేసీఆర్, హరీశ్‌రావు.. ఇద్దరూ ఎమ్మెల్యేలు. వారిద్దరిపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అందుకే సర్కార్ అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెడుతున్నది’ అని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) హైకోర్టుకు తెలిపారు.

దీంతో సీజే అపరేశ్‌కుమార్ సింగ్ ధర్మాసనం స్పందిస్తూ.. కాళేశ్వరం నివేదికపై పిటిషనర్లు కోరినట్టుగా స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. పబ్లిక్ డొమైన్‌లో కమిషన్ నివేదిక అప్‌లోడ్ చేయడాన్ని సీజే తప్పపట్టారు. నివేదికను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. 

కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు రెండురోజు విచారించింది. విచారణ ప్రారంభమైన తర్వాత హైకోర్టు సీజే అపరేశ్‌కుమార్ సింగ్ బెంచ్ ఎదుట వాదనలు కొనసాగాయి. ప్రభు త్వం తరఫున ఏజీ తొలుత కమిషన్ నివేదిక కాపీని బెంచ్‌కు సమర్పించారు. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది.