28-07-2025 12:00:00 AM
పెన్ పహాడ్, జూలై 27 : మండల కేంద్రములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది నడుమ కొనసాగుతున్న అవినీతి ఆరోపణల ’పంచాయితీ’ ఎట్టకేలకు స్థాన చలనం, నోటీసులు ఇచ్చి జిల్లా అధికారులు చేతులు దులుపుకున్నారు. ఈనెల 21న, ’విజయక్రాంతి’ దిన పత్రికలో ’నెల దాటిన జిల్లా కలెక్టర్ టేబుల్ పై మూలుగుతున్న ఫైల్’ అనే శీర్షిక ప్రచురించింది.
జిల్లా అధికారులు చేపట్టిన విచారణలో పలు అవినీతి ఆరోపణలు వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, హెచ్ ఈ ఓ చంద్రశేఖర్ రాజులపై వచ్చిన విషయం విధితమే. వాటికి తగ్గుట్టుగా చర్యలు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ చేతిలో ఉండగా తప్పనిసరి పరిస్థితిలో జిల్లా ఉన్నత అధికారులు స్పందించి బదిలీల ప్రక్రియతోనే సరిపెట్టుకొని, చర్యలు తీసుకోకపోవడం విషయం మండలంలో హాట్ టాపిక్ మారింది.
బది’లీలల’పై వెల్లువెత్తుతున్న విమర్శలు :
మొదట మండలంలోని సబ్ సెంటర్ నిధుల పంచాయితీ తీర్మాణాలు లేకుండా ఖాళీ చెక్ లు తీసుకొని స్వంత అకౌంట్లలోకి మార్చుకోవడంపై ఏ ఎన్ ఎంలు కలసి జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాధు చేయగా..
ఏ ఎన్ ఎంలు సహకరించడం లేదని డాక్టర్ స్రవంతి తిరిగి ఫిర్యాధు చేయగా ఇక్కడ మొదలైంది డబ్బుల దుర్వినియోగం లొల్లీ. దీంతో డిప్యూటీ డీ ఎం హెచ్ ఓ కోటిరత్నం విచారణ మొదలు పెట్టగా హెచ్ ఈ ఓ చంద్రశేఖర్ రాజు తన స్వంత ఖాతాలోకి రూ.లక్షలు మల్లించినట్టుగా బట్టబయలు కాగా అందుకు వైద్యాధికారి స్రవంతి హస్తం ఉందని విచారణలో తేలిందనే విషయం తేట తెల్లం అయిందనే విషయం బయటకు పొక్కింది.
ఈ లొల్లీలపై జిల్లా ఉన్నత అధికారులు కొలిమిలో కాల్చిన కర్రును నీటిలో పెట్టినట్టుగా బదిలీలు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రజా సొమ్మును స్వంత ఖాతాలోకి మల్లించుకొని నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు లేకుండానే బదిలీలు చేయడం పట్ల జిల్లా ఉన్నతాధికారులపై పలు విమర్శలు గుప్పుమంటున్నాయి.
ఒక్క ఫోన్ కాల్‌తో.. అంతా సవ్యం..!
ఓ ప్రజా ప్రతినిధి దగ్గర ఉన్న వ్యక్తిగత కార్యదర్శి మండల వైద్యాధికారి సోదరుడు కావడంతో ఇంత అవినీతి ఆరోపనలు ఉన్నా ఆయన చేసిన ఒక్క ఫోన్ కాల్ తో .. దుర్వినియోగం, అవినీతి అనే పదాలు ’విశ్వసనీయ తగా మారిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే విషయంపై మండలంలోని ఆ శాఖ ఉద్యోగులు, మండల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎక్కడైనా చిన్నపాటి ఉద్యోగులు తెలిసి, తెలియక చిన్న పాటి తప్పు చేస్తే మొదట సస్పెండ్ చేయడం తరువాత నోటీసులు ఇచ్చి విచారణ చేయడం ఎన్నో సందర్భాలలో చూస్తేనే ఉన్నాం. అయితే ఇంత పెద్ద తప్పు చేసినా చర్యలు లేకపోకపోవడం మాకు మంచిదే.. ఏం చేసినా ఇక ఏం కాదనే చర్చ మండలంలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, సంఘ నాయకుల మధ్య జరిగినట్లు తెలిసింది.
అధికారుల తీరుపై అనుమానాలెన్నో..!
పెన్ పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిలో వైద్యాధికారి స్రవంతిని (మునగాల పీ హెచ్ సీ)కి, హెచ్ ఈ ఓలు చంద్రశేఖర్ రాజు, శ్రీనివాస్ (మద్దిరాల ), అలాగే సూపర్ వైజర్లు జానకమ్మ, సైదులు (ఆత్మకూర్-ఎస్)కు బదిలీలు కాగా, జిల్లాలో ఉన్న మరి కొందరిని వేర్వేరు పీ హెచ్ సీలకు బదిలీలు చేశారు. పెన్ పహాడ్లో ఇద్దరు వైద్యాధికారులు ఉండగా ఒకరు మేల్, మరొకరు ఫీమేల్. డిప్టేషన్ పై మోతే పీ హెచ్ సీకి వెళ్ళిన ఇంచార్జీ డాక్టర్ డి. రాజేష్ ఆ డిప్టేషన్ రద్దు చేసి తిరిగి పెన్ పహాడ్ కు బదిలీ చేసి డీడీఓ పవర్స్ అందజేశారు.
వీరితో పాటు లింగగిరిలో ఉన్న యశ్వంత్ కుమార్ కు మోతె పీ హెచ్ సీకి బదిలీ చేశారు. అంతేకాకుండా తుంగతుర్తిలో ఉన్న సూపర్వైజర్ టి. వెంకన్న, సూర్యాపేట డి.ఎం.హెచ్ ఓ కార్యాలయంలో ఉన్న వెంకయ్య, కాసరాబాద పీహెచ్సీలో ఉన్న పూలమ్మను పెన్ పహాడ్ పీ హెచ్ సీకి బదిలీ పై వచ్చారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన బదిలీల ప్రక్రియ కేవలం పెన్ పహాడ్లో జరిగిన ఇష్యూను తెరపైకి రాకుండా జిల్లా అధికారులు ఛూమంతర్ చేసి మైమరిపించినట్లుగా జిల్లా అధికారుల పాత్ర ఉందనే ఆరోపనలు మిన్నంటుతున్నాయి.
ఈవిషయం ముందే విజయక్రాంతి గత శీర్షికలో గుర్తు చేసింది. ఏదీ ఏమైనా .. ఇక అవినీతిపై జిల్లా అధికారుల కొరఢా ఉండబోదని చూసి చూడనట్లుగా ఉంటారని..వీరికో( రాజకీయ) న్యాయం.. వారికో (సామాన్యులు) న్యాయం ఉండరాదని పలువురు మేధావులు భావిస్తున్నారు.