25-09-2025 12:00:00 AM
‘ఆది కర్మయోగి అభియాన్’ కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ ఉద్యమం. ఇది గిరిజన ప్రాంతాలలో పాలనను మెరుగుపరచడానికి, గిరిజనుల సాధికారితను పెంపొందించడానికి ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమంలో గిరిజనులకు శిక్షణ ఇచ్చి వారిని మార్పుకు మార్గదర్శకులుగా తీర్చిదిద్దుతారు. వీరు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో సంఘాలను స మీకరించడంలో, యంత్రాంగంతో సమన్వయం చేయడంలో సహాయపడతారు.
ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ అధికారులు గిరిజనులకు ప్రభుత్వ పథకాలు, పాలన పట్ల అవగాహన కల్పించడంతో పాటు సామర్ధ్య పెంపు శిక్షణ అందిస్తారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా గిరిజనులు వెనుకబాటుతనానికి కారణం పథకాలు లేకపోవడం కాదు.. అది అమలు చేసే వారిలో ప్రేరణ లేకపోవడంతో నేటికి గిరిజనేతర దళారుల కబంధ హస్తాల కింద నలిగిపోతున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అనాగరికులుగానే మిగిలిపోతున్నారు.
అటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిస్థితులు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సేవలు మొదలైన పథకాలు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాటు అయ్యిందే ‘ఆది కర్మయోగి అభియాన్’ కార్యక్రమం. దేశవ్యాప్తంగా గిరిజన సంక్షేమ రంగంలో పనిచేస్తున్న రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వ అధికారులను ప్రోత్సహించి ఒక లక్ష గిరిజన గ్రామాల్లో ‘ఆది కర్మయోగి అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
2047 నాటికి ‘వికసిత్ భారత్’ దార్శనికతకు అనుగుణంగా సమగ్రాభివృద్ధి నమూనాకు ఇది పునాది ఏర్పరచనుంది. ఈ కార్యక్రమం గిరిజన సాధికారికత, నిర్మాణాత్మక చట్టాన్ని నిర్మించడంపై దృష్టి పెడుతుంది. లక్ష్యాలు, పెట్టుబడులు స్థానిక వ్యూహాలను వివరించే ఒక లక్ష గిరిజన గ్రామాలు ‘విజన్ 2030’ కింద గిరిజన వర్గాలతో కలిసి అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం,
550 జిల్లాలు, 30 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో 20 లక్షల మంది గిరిజనులను మార్పును తీసుకురావడం ప్రధాన లక్ష్యం. గిరిజన సమాజాలు అభివృద్ధి లబ్ధిదారులు మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు సృష్టికర్తలు కూడా కావాలనేది దీని ఉద్దేశం. గిరిజన ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం, బ్లాక్ మాస్టర్ ట్రైనర్లతో గవర్నెన్స్ ల్యాబ్ వర్క్ షాపులు, గిరిజన గ్రామ కార్యచరణ ప్రణాళికతో ‘విజన్ 2030’ రోడ్ మ్యాపులు రూపొందించడం,
కమ్యూనిటీ లీడర్ షిప్, వాలంటరీ నెట్‌వర్క్ ద్వారా ఉపాధ్యాయులు, వైద్యులు, సమాజానికి మార్గ నిర్దేశం చేయడమే దీని లక్ష్యం. ఏదేమైనా ఆదివాసీ, గిరిజన గ్రామాలు అభివృద్ధికి చేరువ కావాలంటే నిజమైన సాధికారికత.. కేవలం పథకాల ద్వారా మాత్రమే రాదని, హక్కులను గుర్తించడం ద్వారానే అది ఏర్పడుతుందని భారత రాష్ర్టపతి ద్రౌపదీ ముర్ము నొక్కి చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి.
పెనుక ప్రభాకర్, 9494283038