25-10-2025 12:15:00 AM
నకిరేకల్, అక్టోబర్24 : మంచి ఆహారం తీసుకుంటే మనిషికి బలం, ఆయుష్షు పెరుగుతాయి. కానీ ఇప్పుడు తినడానికి మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతోంది? ఎటు చూసినా కల్తీలే. తాగే నీళ్లు, పాల నుంచి ఆహార పదార్థాలు, దవాఖాన్లలో మందులు.. చివరికి ముఖానికి పూసుకునే క్రీములు కూడా కల్తీ అయిపోతున్నాయి. ఇందు గలదు.. అందు లేదన్న సందేహం వలదు.. అన్న చందంగా నేడు చాలా ఆహార పదార్థాల్లో కల్తీ, నకిలీలతో ప్రజారోగ్యం దెబ్బ తింటోంది.
జీవనశైలిలో వచ్చిన మార్పులతో ఆహారపు అలవాటు కూడా మారిపోయాయి. ప్రస్తు తం ఉరుకుల పరుగులు జీవితంలో చాలామంది ఇంటి భోజనం కంటే హోటళ్లు, డాబాలు, రెస్టారెంట్లు, బేకరీ ఫుడ్ కే మక్కువ చూపుతున్నారు. వారంతాల్లో చాలామంది కుటుంబాలతో సహా బయటకు వెళ్లి బిర్యానీలు, స్పుసై ఫుడ్ , బేకరీ ,తినేందుకు ఇష్టపడుతున్నారు. కానీ హోటల్ నిర్వాహకులు మాత్రం డబ్బులు తీసుకోని ఆహారం పేరుతో అనారోగ్యాన్ని వడ్డిస్తున్నారు.
నిల్వ ఉన్న పదార్థాలు, పలు రసాయనాలతో చేసిన వంటకాలు వడ్డిస్తూ జనం ప్రాణాలతోఆడుకుంటున్నారు.పంట పండటానికి కారణమయ్యే విత్తనాలే నకిలీ. పంట బాగా పండాలని వేసే ఎరువులు నకిలీ.. ఇలా అన్నీ కల్తీమయమైపోయి ప్రజలుఅనారోగ్యంపాలవుతున్నారు. బ్రాండెడ్లను పోలిన విధంగా నకిలీలను తయారు చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు కల్తీ వస్తువులను మార్కెట్లో నింపేస్తున్నారు.
ఆహార కల్తీని, నకిలీల తయారీని అరికట్టాల్సిన ఫుడ్ సేఫ్టీ అధి కారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని ప్రజలు నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల నామమాత్ర దాడులతో కల్తీ కేటుగాళ్లకు కలిసి వస్తోంది. ఆహార పదార్థాల కల్తీ రోజురోజుకూ పెచ్చు మీరుతోంది. అక్రమార్కులకు తెర లేపుతున్నారు. ప్రధానంగా వంట నూనెలు, పాలు, పెరుగు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు, టీ పౌడర్, ఉప్పు, పప్పులు, పసుపు, కారం, బియ్యం, మందులు, పండ్లు, స్వీట్స్, క్రీములు ఇలా చెప్పుకుంటు పోతే సర్వం కల్తీమయం చేస్తున్నారు.
హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ తయారీకి ఉపయోగించే నూనెలు, పిండి, మసాలాలు తదితర వస్తువులు చాలా మట్టుకు కల్తీవే. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేందుకు చిరు వ్యాపారులు కల్తీ సరుకులను విరివిగా వాడుతుంటారు. స్థానికంగా ప్యాక్ చేసి అమ్మే కొన్ని వస్తువులు, పదార్థాలు ఎక్కడ, ఎవరు, ఎప్పుడు తయారు చేస్తున్నారో కూడా తెలియడం లేదు. కానీ మార్కెట్లో మాత్రం యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ప్రజలు బయట హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లలో తినేందుకు మక్కువ చూపుతుండడంతో చిన్నచిన్న హోటళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దాబాలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు, తోపుడు బండ్లపై టిఫిన్ సెంటర్లు, తినుబండారాలు, మిక్చర్ , జిలేబి, మిర్చి బజ్జీలు పాయింట్లు తదితర చోట్ల కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
ప్రధానంగా దాబా హోటళ్లు, బిర్యానీ, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో నాసిరకం/కల్తీ వస్తువులు, కల్తీ నూనె ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన అధికారులు తనిఖీలు చేయడం లేదు. తనిఖీలు చేసినా తీసుకునే చర్యలు శూన్యమే.
ఆయిల్ మాయలు... నాణ్యతాఏదీ..?
సాధారణంగా ఇంట్లో చేసే ప్రతి ఆహారపదార్థంలోనూ వంట నూనె తప్పనిసరి. అందులోనూ ఎన్నో రకాల నూనెలు, ఎన్నో కంపెనీలు, మరెన్నో బ్రాండ్లు మార్కెట్లలో కనిపిస్తూ ఉంటాయి.నకిరేకల్ పట్టణంలోనే కాదు వివిధ ప్రాంతాల్లో నూనెలో భారీగా కల్తిమయం జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పల్లీ నూనెలో నూటికి 80% శాతం. కల్తీమయం జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాలుగు కేజీల పల్లీలు పట్టిస్తే కేవలం కేజీ నూనె మాత్రమే లభిస్తుంది. కేజీ పల్లీల ఖరీదు 120 రూపాయలు. అంటే మొత్తం నాలుగు కేజీల పల్లీల ఖరీదు 480 అవుతుంది కానీ మార్కెట్లో ,నూనె మిల్లులో పల్లీ నూనె కేవలం 160 నుండి 200 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇది ఎలా సాధ్యం .. పల్లీ నూనె కాదు, పామాయిల్ , ఇతర బ్రాండ్లకు చెందిన లోకల్ నూనే భారీగా కల్తిమయం జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నూనె మిల్లులో కుల్లగా నూనె విక్రయించొద్దని నిబంధనలు ఉన్నా విచ్చలవిడిగా అమ్మకాలుజరుగుతున్నాయి. హైదరాబాదు ఇతర ప్రాంతాల నుండి ట్యాంకీలకొద్దీ నూనె దిగుమతి చేసుకొని ఇష్టానుసారంగా నూనెను విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ బ్రాండ్లకు చెందిన అట్టాలను, కవర్లను, క్యాన్లను కొనుగోలు చేసి ఆ బ్రాండ్ల పేరుతో కల్తీ ఆయిల్ ను లోకల్ గా తయారుచేసివిక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంతా జరుగుతున్న నియంత్రించే వారే కరువయ్యారని అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వాడిన నూనెలే మళ్లీ వాడకం
పేరున్న హోటళ్లు మొదలు స్వీట్ ఫుడ్స్, చిరు వ్యాపారాలు మిర్చిబండి, టిఫిన్స్, కర్రీ పాయింట్స్ తయారీదారుల వరకూ ఒకసారి వాడిన నూనెను తిరిగి వాడకూడదనే నిబంధనలున్నా రోజుల తరబడి ఇంకిపోయేదాకా అవే నూనెలు వాడుతున్నారు. అడుగున మడ్డి కట్టిన నూనెలోనే వేయించడం, కూరలు, చెట్నీ, సాంబార్లకు వాడుతున్నారు. పాల ఉత్పత్తులు, బ్రెడ్ వంటి వస్తువులు వారం రోజులు కూడా నిల్వ ఉండవు. తయారైన రోజు నుంచి వారంలోపే వాడేయాలి. అలాంటిది కొన్ని నాన్ బ్రాండెడ్ వస్తువులపై తయారీ తేదీ వేయకుండానే విక్రయిస్తున్నారు. బేకరీల్లో పఫ్లు, బిస్కెట్లు, స్వీట్లు నాణ్యతలేనివి అమ్ముతున్నారు.