13-09-2025 05:19:43 PM
- ఆగస్టు వరకు అందిన ఫిర్యాదులు 114
- హాట్ స్పాట్ లను ఎల్లప్పుడు సందర్శించాలి...
- బాధితులకు మేమున్నామనే మనో ధైర్యం కల్పించాలి...
- డీసీపీ ఎగ్గడి భాస్కర్
మంచిర్యాల (విజయక్రాంతి): షీ టీమ్స్ మహిళ రక్షణే లక్ష్యంగా.. బాధిత మహిళలకు అండగా, అందుబాటులో ఉంటుందనే భరోసా కల్పించాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్(DCP Eggadi Bhaskar) అన్నారు. శనివారం డీసీపీ కార్యాలయంలో షీ టీమ్, మహిళా పోలీస్ స్టేషన్, భరోసా సెంటర్ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది జిల్లాలో ఆగస్టు నెలాఖరు షీ టీమ్స్ కు 114 ఫిర్యాదులు అందాయని, ఇందులో 18 మందిపై క్రిమినల్ కేసులు, ఏడుగురిపై పెట్టి కేసులు నమోదు చేసి 89 మందికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అంతే కాకుండా వివిధ సందర్భాలలో 81 మంది పోకిరీలను షీ టీం పోలీసులు పట్టుకున్నామన్నారు.
హాట్ స్పాట్స్ ను సందర్శించాలి...
జిల్లాలో ఇది వరకే గుర్తించిన హాట్ స్పాట్స్ ను షీ టీమ్స్ ప్రతీరోజు సందర్శించాలని డీసీపీ భాస్కర్ సూచించారు. ఈవ్ టీజర్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేలా ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని, పాఠశాలలు, కాలేజీలతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. హాస్టల్స్, ఉమెన్ వర్కింగ్ హాస్టల్స్ లను సందర్శించి అక్కడ తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. హాస్టళ్ల వద్ద సెక్యూరిటీ గార్డ్, ఒక మహిళ ఇన్చార్జి తప్పని సరిగా ఉండాలనీ, అక్కడ పని చేసే వారి పూర్తి వివరాలు షీ టీం పోలీసులకు తెలిసి ఉండాలన్నారు.
మేమున్నామనే మనో ధైర్యం కల్పించాలి...
భరోసా కేంద్రాలలో బాధిత మహిళ, బాలికలకు వైద్యం, కౌన్సిలింగ్, అన్ని రకాల సేవలు అందించడంతో పాటు మీకు మేమున్నామనే మనోధైర్యాన్ని కల్పించాలని డీసీపీ భాస్కర్ కోరారు. భరోసా సెంటర్ లో లీగల్ అడ్వయిజర్, కౌన్సిలర్, మెడికల్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలికలకు సంబందించిన కేసు పోలీస్ స్టేషన్ లో నమోదైనప్పటి నుంచి బాధితులకు సపోర్టుగా వారి మానసిక పరిస్థితి, విద్యా పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ వారికి భరోసా కల్పించాలన్నారు.
అశ్లీల వీడియోలు అప్ లోడ్ చేస్తే చర్యలు...
పిల్లల అశ్లీల వీడియోలు, అత్యాచారం, సామూహిక అత్యాచారం వీడియోలు అప్‌లోడ్ చేయడం, షేర్ చేయడం, డౌన్‌లోడ్ చేయవద్దని, అలా చేస్తే ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 67బీ కింద కేసు నమోదు చేస్తామని డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం పిల్లలకు సంబంధించి అశ్లీల వీడియోలను స్టోర్ చేయడం, కలిగి ఉండటం కూడా నరమేనని, ఈ చట్టాల ప్రకారం నేరం రుజువైతే జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు కలిపి విధించే అవకాశం ఉంటుందన్నారు. చిన్నారులకు సంబంధించి రేప్, సామూహిక అత్యాచారాల వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం, గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేస్తే, వెంటనే మెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్ గుర్తించేలా నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్(ఎన్‌సీమెక్) వద్ద వ్యవస్థ ఉందని, ఇది డార్క్, డీప్ వెబ్ తో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై సైబర్ పెట్రోలింగ్ చేస్తుందన్నారు.
అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ భాస్కర్ సూచించారు. బెదిరింపులకు భయపడవద్దని, సమాజంలో మహిళలు, బాలికలు తెలిసిన వారితోనే ఎక్కువ వేధింపులకు గురవుతున్నారని, అలాంటప్పుడు జాగ్రత్త పడాలి తప్ప అధైర్య పడవద్దని, వేధింపులకు పాల్పడిన వారి వివరాలతో షీ టీం ని సంప్రదించి ఫిర్యాదు చేస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు. మహిళలు వేదింపులకు గురైనప్పుడు రామగుండం షి టీం వాట్సాప్ (6303923700) లేదా మంచిర్యాల షి టీం (8712659385) లేదా 100 నెంబర్ కు నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ నరేష్ కుమార్, మంచిర్యాల జోన్ షీ టీం ఇన్చార్జి, మహిళా ఎస్సై ఉషారాణి, హైమ, భరోసా సెంటర్, షీ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.