calender_icon.png 9 May, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసముద్రం పాలిటెక్నిక్‌కు ఏఐసీటీఈ గ్రీన్ సిగ్నల్

09-05-2025 01:49:18 AM

  1. నాలుగు కోర్సులకు అనుమతి

2025-26 విద్యా సంవత్సరంలో విద్యాబోధన ప్రారంభం

మహబూబాబాద్, మే 8 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాలకు అఖిలభారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసిటిఈ) అనుమతి ఇచ్చింది. 2025 26 విద్యా సంవత్సరంలో నాలుగు ఇంజనీరింగ్ డిప్లమా కోర్సులకు అనుమతి మంజూరు చేస్తూ జాతీయ సాంకేతిక విద్యా మండలి ఉత్తర్వులను జారీ చేసింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కృషితో కేసముద్రం పట్టణంలో ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసింది. ఈ మేరకు కేసముద్రం పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుపై ఏఐసీటీఈ బృందం పరిశీలించి వెళ్ళింది. అనంతరం సంతృప్తి వ్యక్తం చేస్తూ అనుమతి ఇవ్వడంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

మహబూబాబాద్ జిల్లా ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో పాలిసెట్ అర్హత సాధిస్తే కేసముద్రం పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం పొందడానికి అవకాశం లభించనుంది. కేసముద్రం పాలిటెక్నిక్ కళాశాలలో నాలుగు ఇంజనీరింగ్ డిప్లమా కోర్సులకు అనుమతి లభించింది.

ఇందులో 1 ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ మిషన్ లెర్నింగ్, 2 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్‌ఈ), 3 ఈ.ఈ.ఈ, 4 ఎంబేడెడ్ ఇంజనీరింగ్ కోర్సులకు అనుమతి లభించింది. పాలిసెట్ అర్హత పరీక్ష ఉత్తీర్ణత ర్యాంక్ ఆధారంగా ఆన్ లైన్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు.