09-05-2025 01:51:18 AM
మహబూబాబాద్, మే 8 (విజయ క్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతుండడాన్ని సీరియస్ గా పరిగణించిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు.
మిల్లులకు ధాన్యం తరలించే విషయాన్ని స్వయంగా పరిశీలించేందుకు గురువారం కేసముద్రం మండలంలోని తాళ్లపూసపల్లి, కోరుకొండ పల్లి హల్వల మహమూద్ పట్నం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రాథమికంగా తనిఖీ చేసి , ధాన్యం రవాణా తీరును స్వయంగా పరిశీలించారు. ధాన్యం కాంటాలు పూర్తికాగానే వెంట వెంటనే లారీలను తెప్పించి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం తరలింపులో ఎక్కడ కూడా జాప్యం చేయకూడదని ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు క్లస్టర్ అధికారుల నియామకం
జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం తరలించడం, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్ కే. వీరబ్రహ్మచారి పర్యవేక్షణలో క్లస్టర్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా కార్యాచరణ చేపట్టారు. లారీలు, కార్మికుల సన్నదత అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
మరిపెడ క్లస్టర్ కు సివిల్ సప్లై డిఎం కృష్ణవేణి, తొర్రూరు క్లస్టర్ కు డిఎస్‌ఓ ప్రేమ్ కుమార్, మహబూబాబాద్ క్లస్టర్ కు మనోజ్, కేసముద్రం క్లస్టర్ కు రమేష్ లను ప్రత్యేకంగా నియమించారు. కలెక్టర్ ఏకంగా ధాన్యం కొనుగోలు, రవాణాపై ఆకస్మిక తనిఖీలు చేయడంతో జిల్లావ్యాప్తంగా ఒక్కసారిగా ధాన్యం మిల్లులకు తరలింపు ఊపందుకుంది.