జమ్మికుంటలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి
మూడు అక్రమ ఇసుక డంప్లు, రెండు ట్రాక్టర్లు సీజ్
అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు: సీపీ గౌష్ ఆలం
జమ్మికుంట, జూన్15 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వలపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు, టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా తీవ్రం చేశారు. ఇందులో భాగంగా సోమవారం జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన మూడు భారీ అక్రమ ఇసుక డంప్లను పోలీసులు కనుగొని, సీజ్ చేశారు. అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా విలాసాగర్ పరిసర ప్రాంతాల నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అక్కడికక్కడే పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.ఒక పెద్ద ఇసుక డంప్లో సుమారు 100 ట్రాక్టర్ల లోడుల ఇసుకను గుర్తించారు.మిగిలిన రెండు ఇసుక డంప్లలో కలిపి మరో 50 ట్రాక్టర్ల లోడుల ఇసుక నిల్వలను సీజ్ చేశారు.
మొత్తంగా దాదాపు 150 ట్రాక్టర్ల లోడుల అక్రమ ఇసుకతో పాటు, రవాణాకు ఉపయోగిస్తున్న 2 ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సీజ్ చేసిన మొత్తం ఇసుక నిల్వలను, వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యలు మరియు సమగ్ర విచారణ నిమిత్తం జమ్మికుంట పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా సహజ వనరులైన ఇసుకను అక్రమంగా తవ్వినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని సీపీ గౌష్ ఆలం ఈ సందర్భంగా హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు మైనింగ్ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.






