calender_icon.png 31 October, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంగారెత్తించారు

31-10-2025 12:29:31 AM

-భారత్ దెబ్బకు ఆస్ట్రేలియా ఔట్

-మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్

-సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్‌కు షాక్

-ఆసీస్‌పై భారీ టార్గెట్ ఛేజ్ చేసిన భారత్

నవీ ముంబై, అక్టోబర్ 30: ఇది కదా విజయమంటే... ఇది కదా ఇన్నింగ్స్ అంటే.. ఇది కదా రివేంజ్ అంటే...లీగ్ స్టేజ్‌లో అపజయమే ఎరుగని జట్టుగా సెమీస్‌కు దూసు కొచ్చిన ఆస్ట్రేలియాకు భారత్ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఊహించని విధంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కంగారూలను చిత్తు చేసింది. అది కూడా ఏ చిన్న స్కోరో కాదు ఏకంగా 339 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసి ఆసీస్‌ను ఇంటికి పంపిం చింది. తద్వారా లీగ్ స్టేజ్‌లోనూ, 2005 ఫైనల్లోనూ ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.

బౌలింగ్, ఫీల్డింగ్‌లో నిరాశపరిచిన భారత్ బ్యాటింగ్‌లో మాత్రం దుమ్మురేపేసింది. జెమీమా రోడ్రిగ్స్ సెంచరీకి హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తోడ వడంతో భారీ లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలుండగానే అందుకుంది. నిజానికి ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపు అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే భారత్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ కంగారూలదే పైచేయిగా ఉంది. లీగ్ స్టేజ్‌లో ఓడిపోయే స్థితి నుంచి భారత్‌పై మ్యాచ్ గెలిచింది. దీంతో కంగారూలను జయిస్తే చాలు కప్ చిక్కినట్టే అన్న అభిప్రాయాలు వినిపించాయి.

చివరికి జెమీ మా, హర్మన్ అద్భుత బ్యాటింగ్‌తో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు త్వరగానే కెప్టెన్ అలీసా హీలీ వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ మెరుపు సెంచరీతో అదరగొట్టింది. భారత బౌలర్లను ఆటాడుకుంది. దీనికి తోడు భారత జట్టు పేలవమైన ఫీల్డింగ్ కూడా కంగారూలకు కలిసొచ్చింది. లిచ్‌ఫీల్డ్ 93 బంతుల్లో 119 రన్స్ చేయగా.. ఎలిస్ పెర్రీ 77, గార్డనర్ 63 పరుగులతో రాణించారు. ఫలితంగా ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది.

భారత బౌలర్లలో శ్రీచరణి (2/49), దీప్తిశర్మ(2/73) రాణించారు. 339 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసే క్రమంలో భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ప్రతీకా రావల్ ప్లేస్‌లో జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ 2 ఫోర్లు బాది ఊపుమీద కనిపించినా 10 పరుగులకే వెనుదిరిగింది.స్మృతి మంధాన(24) కూడా త్వరగానే ఔటవడంతో భారత్ గెలవడం కష్టమని అనుకున్నారు. అయితే జెమీమా రోడ్రి గ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పార్టనర్‌షిప్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది.  హర్మన్‌ప్రీత్ 89(10 ఫోర్లు,2 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకో గా.. జెమీమా మాత్రం నిలకడగా ఆడుతూ శతకం సాధించింది. చివర్లో సాధించాల్సిన రన్‌రేట్ ఓవర్‌కు 7కు పైగా ఉన్నప్పటకీ దీప్తిశర్మ(24), రిఛా ఘోష్(26)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన జెమీమా అమన్‌జోత్ కౌర్‌తో కలిసి విజయాన్ని పూర్తి చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.