31-10-2025 12:28:00 AM
-నేడు భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20
-వర్షం అడ్డంకిగా నిలిచే ఛాన్స్
-తుది జట్టులో అర్షదీప్‌కు చోటు కష్టమే
మెల్‌బోర్న్, అక్టోబర్ 30 : భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ ట్వంటీకి కౌంట్‌డౌన్ మొదలైంది. శుక్రవారం మెల్‌బోర్న్ వేదికగా మ్యాచ్ జరగబోతోంది. వర్షం కారణంగా తొలి టీ ట్వంటీ రద్దయిపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే రెండో టీట్వంటీకి సైతం వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 87 శాతం వర్షం పడే అవకాశమున్నట్టు వెదర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. దీంతో మ్యాచ్ సజావుగా జరగడం కష్టంగానే కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే తొలి మ్యాచ్‌లో 9.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చాలా కాలం గా అంతర్జాతీయ టీ20ల్లో నిరాశపరుస్తోన్న సూర్యకుమార్ ఎట్టకేలకు బ్యాట్ విదిల్చాడు. కాగా తొలి టీ ట్వంటీలో భారత తుది జట్టు కూర్పుపై విమర్శలు వచ్చాయి. టీ ట్వంటీల్లో అత్యుత్తమ బౌలర్‌గా ఉన్న అర్షదీప్‌ను పక్కనపెట్టి హర్షిత్ రాణాను ఆడించడం ఆశ్చర్య పరిచింది. తొలి టీట్వంటీ రద్దవడంతో రెండో మ్యాచ్‌కు కూడా అదే కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నా యి. ఒకవేళ పేసర్లకు అనుకూలించే మెల్‌బోర్న్‌లో అదనపు పేసర్‌తో బరిలోకి దిగాలను కుంటే మాత్రం అర్షదీప్ జట్టులోకి వస్తాడు. అప్పు డు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలలో ఒకరు బెంచ్‌కే పరిమితమవుతారు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు.
గత రికార్డులు :
గత రికార్డులను చూస్తే మెల్‌బోర్న్ స్టేడియంలో భారత్ ఆరు మ్యాచ్‌లు ఆడగా నాలుగింటిలో గెలిచి రెండు ఓడిపోయింది. అటు ఆస్ట్రేలియా 15 మ్యాచ్‌లు ఆడి 9 గెలిచి, ఆరింటిలో పరాజయం పాలైంది. ఓవరాల్ రికార్డుల్లో భారత్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకూ ఇరు జట్లూ 33 టీట్వంటీల్లో తలపడితే భారత్ 20, ఆస్ట్రేలియా 11 గెలిచాయి. రెండు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.
పిచ్ రిపోర్ట్ :
మెల్‌బోర్న్ పిచ్ రిపోర్ట్ చూస్తే ఇక్కడ బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా అనుకూలిస్తుంది. బిగ్‌బాష్ లీగ్‌లో యావరేజ్ స్కోర్లు 180 ప్లస్ నమోదయ్యాయి. అయితే పిచ్ ఆరంభంలో కాస్త బౌన్స్‌కు అనుకూలించే అవకాశముండడంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు.
భారత తుది జట్టు(అంచనా) :
అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా) :
హెడ్, మిఛెల్ మార్ష్(కెప్టెన్), జోస్ ఇంగ్లీ స్, టిమ్ డేవిడ్, మిఛ్ ఓవెన్, స్టోయినిస్, జోస్ ఫిలిప్, బార్ట్‌లెట్/సీన్ అబోట్, నాథన్ ఎల్లిస్, కున్నేమన్, హ్యాజిల్‌వుడ్